మళ్లీ వివాదంలోకి... | Controversy again | Sakshi
Sakshi News home page

మళ్లీ వివాదంలోకి...

Published Thu, Nov 5 2015 3:05 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM

Controversy again

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వ్యవహారం లో కొత్త వివాదం రాజు కుంది. గతంలో ఆలయ స్థల లీజును వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమించటంతో తర చూ వార్తల్లోకెక్కగా... ఇప్పు డు మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు పోటెత్తాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు శాస్త్రవిరుద్ధంగా ఉందో లేదో తేల్చేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ వేయాల్సి వచ్చింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పనులు జరుగుతుండటంతో సమీప బస్తీలకు అరిష్టం చుట్టుకుందని, దీనివల్ల అనారోగ్యానికి గురై చనిపోతున్నారంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది.

 ఇదీ సంగతి..: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఓ ధార్మిక సంస్థ లీజుకు తీసుకుని పునరుద్ధరణ, అభివృద్ధి పనులు జరుపుతోంది. పురాతన ఆలయం దెబ్బతినకుండా చుట్టూ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంటోంది. అయితే ఈ పనుల పేరుతో దేవాయంలోని మూల విరాట్టులను మరోచోటికి తరలించటం, ధ్వజస్తంభాన్ని తొలగించటం, చుట్టూ ఉన్న గుట్ట రాళ్లను మార్పుచేర్పులు చేయటాన్ని స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇవన్నీ శాస్త్రవిరుద్ధమైన పనులని, దీనివల్ల తమకు అరిష్టం చుట్టుకుందంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. నెలరోజులుగా ఈ వివాదం నానుతోంది.

ఇటీవల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు స్థానికులు రాగా నిర్వాహకులు అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారని, ఆలయంలో స్వామిని దర్శనం చేసుకోనివ్వటం లేదని ఫిర్యాదు చేయటంతో ప్రభుత్వం స్పందించింది. అక్కడి పనులు శాస్త్ర సమ్మతమా, విరుద్ధమా తేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. గతంలో ఈ ఆలయ స్థలం స్వాహా చేసేందుకు రాజకీయ నేతలు యత్నించటం, ఆ తర్వాత ధార్మిక సంస్థ అభివృద్ధి చేసేందుకు ముందుకు రావటంతో ప్రభుత్వం లీజుకివ్వటం తదితరాలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగింది.

 కమిటీ ఆలయ సందర్శన: దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు కన్వీనర్‌గా, ఆగమ శాస్త్ర నిపుణులు వెంకటాచార్యులు, స్థపతి వల్లినాయగం, దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సింహులు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులు ఓ దఫా ఆలయాన్ని సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించి రికార్డు చేశారు. ధార్మిక సంస్థ నిర్వాహకులతో మాట్లాడగా వారం రోజుల్లో పనుల ప్రణాళికలు అందిస్తామని, ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేసి ఆలయాన్ని తెరిచేలా చూస్తామని వెల్లడించారు. వాటిన్నింటిని పరిశీలించి మరో పది రోజుల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement