‘పట్టా’భిషేకం
– ఘనంగా 2011 బ్యాచ్ మెడికల్ విద్యార్థుల స్నాతకోత్సవం
– 94 మందికి పట్టాల ప్రదానం
ఆరేళ్లు కలిసి చదువుకున్నారు. రోగుల నాడిపట్టారు. మానవ శరీరంపై పూర్తిగా అధ్యయనం చేశారు. విజయవంతంగా వైద్యవిద్య పూర్తి చేశారు. కన్నవారి కలలను నిజం చేస్తూ వారి సమక్షంలోనే ‘పట్టా’భిషిక్తులయ్యారు. గురువారం అనంతపురం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన 12వ స్నాతకోత్సవం కన్నుల పండువగా సాగింది. 2011 బ్యాచ్‌కు చెందిన 94 మంది వైద్య విద్యార్థులు కరతాళ ధ్వనుల మధ్య తల్లిదండ్రులతో కలిసి ఆనందోత్సాహంగా పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులతో ఆడిటోరియం, కళాశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. అందమైన ముగ్గులతో, వివిధ రకాల పుష్పాలతో వేదికను అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థిని లేఖ ‘ఓం నమఃశివాయ.. చంద్రకళాధర సహృదయా’ అంటూ చేసిన నృత్యం ఆకట్టుకుంది. ఆడిటోరియంలోకి పట్టాలు అందుకునే విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించుకుని వచ్చిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగుతూ హుషారుగా గడిపారు. ‘వెళ్లొస్తా నేస్తం’ అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
- అనంతపురం మెడికల్
సేవే జీవిత పరమార్థంగా భావించండి
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ఈ రోజు పట్టాలు అందుకునే వారంతా డాక్టర్లుగా మారారని, ఇక సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే జీవిత పరమార్థమన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలని సూచించారు. డబ్బు శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నారు. కమీషన్ల కోసం రోగులతో చెలగాటమాడుతున్న వైద్యుల్ని అక్కడక్కడా చూస్తున్నామని, ఇది మంచిది కాదన్నారు. చికిత్స కోసం వచ్చే వారి కళ్లలో సంతోషం చూడాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాళ్లు చిట్టి నరసమ్మ, జేసీ రెడ్డి, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ అందరూ మానవతా విలువలు పాటించాలన్నారు. పేదల సేవలో తరించాలని సూచించారు. విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
సురేందర్‌రెడ్డికి సన్మానం
మెడికల్ కళాశాలలో 2014లో వైద్య విద్యార్థిని స్నేహిత మృతి చెందిన వైనం విదితమే. స్నేహిత పేరు మీద ఆమె తండ్రి సురేందర్‌రెడ్డి ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో వైద్య విద్యార్థులంతా భాగస్వాములయ్యారు. పట్టాల ప్రదానోత్సవం సందర్భంగా సురేందర్‌రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమార్తె ఇక్కడ లేకున్నా ‘స్నేహిత ఫౌండేషన్’ ద్వారా సామాజిక సేవ చేస్తానన్నారు. అందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.