నగదు రహిత లావాదేవీలకు సహకరించాలి
విజయవాడ : జిల్లాలో వ్యాపారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించి డిజిటల్ క్యాష్‌లెస్ ఎకనామీకి సహకరించాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. నగరంలో తన క్యాంపు ఆయన గురువారం బ్యాంకర్లు, హోల్ సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు బజార్ల ఏస్టేల్ అధికారులు, బ్యాంకర్లతో క్యాష్ లెస్ ఎకనామీపై సమావేశమయ్యారు. దేశంలో తొలిసారిగా ఈ జిల్లాలో నగదు రహిత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వీరిలో 7,500 మంది మాత్రమే ఫోస్ మిషన్లు వినియోగిస్తున్నారని వివరించారు. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని తెలిపారు. వ్యాపారస్తులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు జిల్లాలో విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సబ్–కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానంలో స్మార్ట్ ఫోన్ల ద్వారా లేదా సాధారణ ఫోన్ ద్వారా నగదును బదిలీచేసే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. దీన్ని సామాన్యులు సైతం కొద్దిపాటి అవగాహనతో వినియోగించుకోవచ్చన్నారు. యూరోపియన్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫీన్‌ల్యాండ్ వంటి దేశాలలో ఎటువంటి కరెన్సీ నోట్లు లేకుండా పూర్తిగా నగదు రహిత ఎకనామీ ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి దీన్ని అమలు చేయాలన్సిన అవసరం ఉందన్నారు. నగదు రహితంగా వస్తువులు కొనుగోలు నిర్వహిస్తే సయయం ఆదా అవుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో ప్రజలు నగదు రహితంగా కొనుగోలుపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే నగదు రహితంగా చౌకధరల దుకాణాలలో నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని, 90 శాతం పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలు అనుసంధానించామని పేర్కొన్నారు. జిల్లాలో 29వేల ఈ–పోస్ మిషన్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో క్యాష్ లెస్ పేమెంట్ విధానంపై పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. సబ్–కలెక్టర్ సలోనీ సిదాన, ఆర్డీవోలు పి.సాయిబాబు, చక్రపాణి, డీఎస్‌డీ వి.రవికిరణ్, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, బ్యాంకర్లు, అసోసియేషన్ ప్రతినిధులు వక్కలగడ్డ బాస్కరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.