పరారీలో జొన్నల వ్యాపారి
Published Tue, Feb 21 2017 11:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
–పోలీసులను ఆశ్రయించిన బాధితులు
చాగలమర్రి: చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్ కాలనీకి చెందిన ముద్దేటి అశోక్ అనే జొన్నల వ్యాపారి రైతులకు రూ. 3 కోట్ల వరకు కుచ్చు టోపి పెట్టి పరారయ్యాడు. దీంతో బాధితులైన రైతులు, చిరువ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు లబోదిబో మంటూ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. జొన్నలవ్యాపారి అశోక్ తోపాటు అతడి సోదరుడు ముద్దేటి హరి పై ఎస్‌ఐ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దేటి అశోక్, హరి గత రెండు సంవత్సరాలుగా రైతులు, కమీషన్ దారుల నుంచి జొన్నలు కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయించే వారు.
ఈ నేపథ్యంలో కర్నూలు, వైఎస్సార్ కడప లోని పలు ప్రాంతాల రైతుల నుంచి రూ. 3 కోట్ల విలువ చేసే జొన్నలు తీసుకున్నాడు. వారందరికి ఈనెల 20వ తేదీన డబ్బులు ఇస్తానని నమ్మించాడు. ఆ ప్రకారం రైతులు, కమీషన్ దారులు అశోక్, హరి ఇంటి వద్దకు పోయారు. అయితే వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో చుట్టు పక్కల వారిని విచారించారు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడ లేరని చెప్పడం.. ఫోన్‌లు పనిచేయకపోవడంతో పరారైనట్లు నిర్ధారించుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్‌ఐ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు రోజుల్లోనే కర్నూలు, వైఎస్‌ఆర్‌కడప జిల్లాల నుంచి 38 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Advertisement
Advertisement