♦ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి
♦ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన రిలయన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విశ్వవిద్యాలయాలపై కార్పొరేట్ దిగ్గజాలు మక్కువ చూపుతున్నారు. అనుమతినిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఈ దిశగా అడుగులు వేసింది. దీంతో గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే సమావేశాల చివరి రోజున ఆ కసరత్తు పూర్తి కావడంతో బిల్లును ప్రవేశ పెట్టేందుకు వీలు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించడంతో... అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు మార్గం సుగమం అయింది.
ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు...
రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలను అనుమతించాలన్న నిర్ణయానికి వచ్చింది. అంతే కాకుండా అన్నివిధాలా అనుకూలమైన హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ప్రైవేటు వర్సిటీలకు అనుమతివ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చూడాలన్న సంకల్పంతో ఉంది. రిలయన్స్, మహీంద్రా, బిర్లా వంటి బడా సంస్థలు ఇందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. వీటితోపాటు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఉన్న గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వంటివి రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐటీ, విజ్ఞాన్ వంటి పేరున్న విద్యా సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది.
బ్రాండ్ ఇమేజ్ ముఖ్యం...
మొత్తంగా ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే... ప్రముఖ పరిశ్రమలకు చెందిన 10 నుంచి 15 ప్రైవేటు వర్సిటీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రైవేటు వర్సిటీలు మనుగడ సాగించాలంటే బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమని, అలాంటి సంస్థలే సక్సెస్ కాగలుగుతాయని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు.
ప్రైవేట్ వర్సిటీలపై కార్పొరేట్ కన్ను
Published Sat, Nov 28 2015 3:42 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement