అలా ముగించేశారు !
– పాలకవర్గం తీరుకు నిరసనగా కార్పొరేటర్ల వాకౌట్
– రూ.58 కోట్లకు బడ్జెట్ ఆమోదం
అనంతపురం న్యూసిటీ : ప్రజాసమస్యల ప్రస్థావన లేకుండానే నగర పాలక సంస్థలో శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం తూతూ మంత్రంగా ముగించారు. తొలుత ప్రజాసమస్యలపై చర్చ జరిగాకే బడ్జెట్‌ను ఆమోదించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టినా మేయర్ స్వరూప ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నలుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చేశారు. చివరకు మేయర్ రూ.58 కోట్లతో బడ్జెట్‌కు ఆమోదించగా అందుకు టీడీపీ కార్పొరేటర్లు ఓకే చెప్పేశారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ పట్టు
బడ్జెట్ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు గంగన హిమబిందు, బోయ గిరిజమ్మ, జానకి, బాలాంజినేయులు, గూడురు మల్లికార్జున, షుకూర్ ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. నగరంలో పందులు, కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయని, పారిశుద్ధ్యం పడకేసిందని, నగరపాలక సంస్థలో పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. బడ్జెట్ చదవడాన్ని ఆపాలంటూ అకౌంటెంట్ దేవశంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ స్వరూప జోక్యం చేసుకుని తొలుత బడ్జెట్ చదవాలని ప్రజా సమస్యలపై మళ్లీ మాట్లాడుదామని అల్టిమేటం జారీ చేశారు. కమిషనర్ సత్యనారాయణను చుట్టుముట్టి సమస్యలపై మాట్లాడాలని ఇది వరకే మీ దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ అనుమతితో కేవలం బడ్జెట్ అంశంపై మాత్రమే చర్చించాలంటూ తోసిపుచ్చారు.
అందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు.. కలెక్టర్ ఎక్కడైనా ప్రజా సమస్యలపై మాట్లాడవద్దని చెప్పారా.. అని నిలదీస్తే కమిషనర్ నోట మాట రాలేదు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏవిధంగా బడ్జెట్ సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై రోజూ నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి చెట్లకు, గోడలకు చెప్పి వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అరగంటపాటు తీవ్ర గందరగోళం నెలకొనింది. అంతలోనే 9వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి నీటి కొళాయికు బిరడా వేయలేని నిస్సహాయ స్థితిలో పాలకవర్గం, అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిలో నీరు సరిగా రావడం లేదన్నారు. టీడీపీ రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ సైతం ప్రజా సమస్యలపై ప్రస్తావించాలని పట్టుబట్టారు. చివరకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పాలకవర్గం, అధికారుల తీరును తప్పుబడుతూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో నలుగురు స్వతంత్య్ర, ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి బయటకు రావడం గమనార్హం.
పందికొక్కుల్లా మెక్కుతున్నారు : వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు
కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గంగన హిమబిందు, బోయ గిరిజమ్మ, జానకి, బోయ పక్కీరమ్మ, బోయ సరోజమ్మ,బాలాంజినేయులు, షుకూర్, పోతులయ్య, గూడురు మల్లికార్జున, చింతకుంట సుశీలమ్మ, వెంకటరమణమ్మ ధ్వజమెత్తారు. సమావేశాన్ని వాకౌట్ చేసిన అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ పందికొక్కుల్లా ప్రజాధనాన్ని మెక్కుతున్నారని ఆరోపించారు. త్వరలో పాలకవర్గం అవినీతి, అక్రమాలను ఎండగడతామని హెచ్చరించారు.
రూ 58 కోట్లకు ఆమోదం : గతేడాది మిగులు బడ్జెట్ రూ.3.98 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్ రూ. 54.55 కోట్లను కలుపుకుని రూ. 58.53 కోట్లతో బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. అందులో రూ 54.55 కోట్ల సాధారణ రాబడులు కాగా రూ.46.87 కోట్లు ఖర్చులున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ గంపన్న, ఈఈ రామ్మోహన్ రెడ్డి, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.