అనంతపురం సెంట్రల్: ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప వల్ల టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నాలుగేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అంతా అవినీతి, అక్రమాలేనని ధ్వజమెత్తారు. కోర్టురోడ్డులోని చారిత్రాత్మక భవనం పీస్ మెమోరియల్ హాల్ ఆధునికీకరణపై అనేక విమర్శలు వస్తున్నాయన్నారు. çపురాతన భవన స్థలాలను అద్దెకు ఇచ్చుకున్నారని, ఇందులో ఎవరెవరికీ ఎంత వాటాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆయన భారతం రాసినట్లు నాలుగు పేజీల లేఖ రాస్తూ వివరణ పంపారని వివరించారు. జాతీయ రహదారిలో ఓ నేత రెండు సెంట్ల స్థలం రాయించుకుని.. ఎనిమిది సెంట్లను అక్రమించుకున్నాడని ఆరోపించారు.
వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, త్వరలోనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. అనంతపురం నగర అభివృద్ధిని వారిద్దరూ అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధించాలని తాను తీవ్రంగా శ్రమించగా.. దీన్ని కూడా రాజకీయం చేసి అడ్డుకున్నారని బాధపడ్డారు. అందువల్లే మరువ వంకను గతేడాది పరిశుభ్రం చేసినా.. మళ్లీ యథావిధిగా ప్లాస్టిక్‌తో నిండిపోయిందన్నారు. అలాగే రోడ్ల వెడల్పు విషయంలో కొంతమంది నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకొని కోర్టును ఆశ్రయించేలా పురమాయించారన్నారు. అంత వెడల్పు అవసరమా అంటూ రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించకుండా అడ్డుపుల్ల వేయడానికి యత్నించారన్నారు. పేరుకు ‘అవే’ పేరుతో నీతులు చెబుతున్నారని... అవే లేదు.. ఏం లేదంటూ చిందులు తొక్కారు. ఇంటిపైన రాళ్లు పెట్టుకున్న నీచ సంస్కృతిని ఆయనదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదిరి తీరును తూర్పారబట్టారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. కనీసం మీడియానైనా బాధ్యతగా వీరి అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. ఇక జిల్లా పోలీసులకు చేవ లేకుండా పోతోందని ఎంపీ జేసీ అన్నారు. పోలీసుల తీరు వల్లే శాంతి భద్రతలు కాపాడటం ఇబ్బందిగా మారిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటూ నేరస్తులకు కూడా రాచమర్యాదలు చేస్తున్న పరిస్థితి ఉందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment