మంత్రి పదవి రాలేదని... | corporation meeting no tdp corporaters | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి రాలేదని...

Published Mon, Apr 3 2017 11:45 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

corporation meeting no tdp corporaters

నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం బహిష్కరణ
గోరంట్లకు టీడీపీ కార్పొరేటర్ల సంఘీభావం 
కోరం లేకపోవడంతో వాయిదా వేసిన మేయర్‌ 
 
 
నగరాన్ని అభివృద్ధి చేయాలని  ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాలకు వాడుకోవడంతో నగర పాలక సంస్థ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి దక్కనందున టీడీపీ కౌన్సిలర్లు మూకమ్మడిగా నగర  పాలక సంస్థ బడ్జెట్‌ సమావేశానికి డుమ్మా కొట్టారు.  దీంతో బడ్జెట్‌ సమావేశం సోమవారం నిర్వహించిన నగర పాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం వాయిదా పడింది. ఆనం కళాకేంద్రం ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయంలో సమావేశమై బహిష్కరణ వ్యూహానికి పదును పెట్టారు., సీనియారిటీని గుర్తించడంలో సీఎం చంద్రబాబు అనుసరించిన తీరుకు నిరసనగా గోరంట్లకు సంఘీభావం ప్రకటిస్తూ పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు.  నగర పాలక సంస్థ సమావేశానికి హాజరైన గోరంట కాసేపు ఉండి.. టీడీపీ సభ్యులు లేకపోవడం చూసి ఆయన కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. బడ్జెట్‌ సమావేశం జరిగేలా చూడాలన్న సూచనకు వారు ససేమిరా అన్నారు. నగర ప్రగతికి ఎంతో కీలకమైన బడ్జెట్లను కాదని అలకబూనడం విచారకరమని విపక్షం మండిపడింది.
 
 
సాక్షి, రాజమహేంద్రవరం : 
టీడీపీలోని అంతర్గత రాజకీయాలు నగర పాలక సంస్థపై పడింది. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం, పార్టీ పదవికి ఆయన రాజీనామా చేయడం సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశంపై ప్రభావం చూపింది. నగరపాలక సంస్థ సముదాయంలోని క్రొవిడి లింగరాజు మందిరంలో నిర్వహించ తలపెట్టిన బడ్జెట్‌ సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ సమావేశానికి టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు ఆరుగురు, స్వతంత్రులు నలుగురు, బీఎస్పీ ఒకరు, బీజేపీకి చెందిన కార్పొరేటర్‌ ఒకరు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తొలుత కోరం లేనందున మేయర్‌ పంతం రజనీశేషసాయి గంటపాటు సమావేశాన్ని వాయిదా వేశారు. తర్వాత నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్ది అప్పారావు సమావేశానికి వచ్చారు. తిరిగి 11:30 గంటలకు సభను ప్రారంభించిన మేయర్‌ అప్పడు కూడా కోరం లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేసేది కమిషనర్‌ వి.విజయరామరాజు తెలియజేస్తారని చెప్పారు.
ఇది రెండో సారి...
సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు 
నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం రెండోసారి వాయిదా పడినట్లయింది. మార్చి 31న ఈ సమావేశం వాయిదా పడిన విషయం విదితమే. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. 
ముక్కిపోయిన సమోసా పెడతారా?
సభ్యులు, అధికారులు, మీడియా వారికి పెట్టిన సమోసాలు ముక్కిన వాసన రావడంతో స్వతంత్ర కార్పొరేటర్‌ నండూరి వెంకటరమణ అధికారులను ప్రశ్నించారు. ‘మీకు ఎలాంటి సమోసాలు కావాలి’అని అధికారులు అడగడంతో నండూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో జరిగే నాలుగు సమావేశాలల్లో స్నాక్స్, టీ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. నిధుల వినియోగంపై లెక్కా పత్రం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
 
నగర బడ్జెట్‌ను తాకట్టు పెట్టారు..
ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నగరపాలక సంస్థ బడ్జెట్‌ను టీడీపీ కార్పొరేటర్లు తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరించడంతో.. నగర అభివృద్ధిపై వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. బడ్జెట్‌ సమావేశం వాయిదా పడిన తర్వాత కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్‌రావు, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణి, బొంతా శ్రీహరిలతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం కోరం లేదని సభను వాయిదా వేసిన పాలకులు.. మార్చి 31లోపు బడ్జెట్‌ను ఆమోదించాలన్న నిబంధనలు తెలియదాని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు రోజుల పాటు ఎలాంటి చెల్లింపులు చేయలేదని కమిషనర్‌ చెబుతున్నారని పేర్కొన్నారు.యీ సమావేశం తిరిగి ఎప్పడు నిర్వహించేదీ చెప్పలేదని, అప్పడువరకూ నగరపాలక సంస్థలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. మెజారిటీ ఉందన్న భావనతో టీడీపీ కార్పొరేటర్లు ఇలా చేయడం భావ్యం కాదని సూచించారు. స్వప్రయోజనాల కోసం ఐదు లక్షల మంది నగర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement