కాసుక్కూర్చున్నారు.. | Corrupt officials in gmc | Sakshi
Sakshi News home page

కాసుక్కూర్చున్నారు..

Published Mon, Jul 3 2017 2:34 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

కాసుక్కూర్చున్నారు.. - Sakshi

కాసుక్కూర్చున్నారు..

► జీఎంసీలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అవినీతి అధికారులు
► నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలను పెంచిపోషిస్తున్న వైనం
► గతంలో విజిలెన్స్‌ విచారణలో బయటపడిన అవినీతి బాగోతం
►  ప్రస్తుత కలెక్టరైనా అడ్డుకట్ట వేస్తారా ?


నిబంధనలను పునాది రాళ్లలో తొక్కేసి గుంటూరు నగరంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారా ?. నగరంలో ఏదైనా పనులు చేపట్టి నాణ్యతకు తిలోదకాలిచ్చేసి బిల్లులు తీసుకోవాలనుకుంటున్నా ?. ఇంటి కుళాయి దగ్గర నుంచి ఏదైనా సర్టిఫికెట్‌ వరకు అక్రమంగా పొందాలనుకుంటున్నారా ? అయితే మీ దగ్గర ముడుపులు దండిగా ఉండాలి. వీటిని ఆశ చూపితే చాలు గుంటూరు నగరపాలక సంస్థలో ఎలాంటి పనైనా చిటికెలో అయిపోతుంది. ఉన్నతాధికారులు అడ్డుపడతారని   భయపడాల్సిన పని లేదు. వారినీ ఈ అవినీతి అనకొండలు మేనేజ్‌ చేస్తాయి.     అవసరమైతే పక్కదారి పట్టించి బలి చేసేస్తాయి కూడా..       –సాక్షి, గుంటూరు


సాక్షి, గుంటూరు: నిషేధిత, ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు నిర్మించినా రెవెన్యూ విభాగం అధికారులు ఇంటి పన్నులు వేసేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అభివృద్ధి పనులు నాణ్యత లేకున్నా ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తున్నారు.

వాస్తవంగా 50 శాతానికి మించి శుభ్రత లేకపోయినా ప్రజారోగ్య విభాగం అధికారులు రికార్డుల్లో 99 శాతం ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇదంతా చేతులు తడిపితేనే. జీఎంసీలో ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ డబ్బులు ఇచ్చుకోలేని సామాన్యుల వద్ద నిబంధనల చిట్టా వల్లెవేస్తున్నారు. వీరి అవినీతిని అడ్డుకోవాలని చూసిన ఎంతో మంది కమిషనర్‌లను సైతం ఏడాది తిరక్కుండానే బదిలీపై పంపేస్తున్నారు. ఇదీ అనేక ఏళ్లుగా గుంటూరు నగరపాలక సంస్థలో సాగుతున్న అవినీతి దందా.  

బయటపడినవి కొన్ని..తెలియనివి ఎన్నో
 ముఖ్యంగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగాల్లోని కొందరు అధికారులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని రోజురోజుకూ విస్తరిస్తూనే ఉన్నారు. వీరికి కమిషనర్లంటే భయం లేదు. పైకి స్వామి భక్తి నటిస్తూ తమ విభాగాల్లోని ఉన్నతాధికారులను మేనేజ్‌ చేస్తూ అవినీతి దందా కొనసాగిస్తున్నారు.

కొత్తపేట శివాలయం ఎదురుగా ఓ వైద్యుడు అక్రమ నిర్మాణం చేపడుతుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు భారీగా ముడుపులు తీసుకొని సహకరించారు. దీనిపై మరో వైద్యుడు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పటి కమిషనర్‌ నాగలక్ష్మికి హైకోర్టు నెల రోజులు జైలు శిక్ష విధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అవినీతికి ఐఏఎస్‌ అధికారి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గతంలో ఇదే విభాగంలో టీడీఆర్‌ బాండ్‌లు, లేబర్‌సెస్‌ కుంభకోణాలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు నిగ్గు తేల్చి పది మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

చర్యలు శూన్యం
రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు డబ్బులు దండుకుని పన్ను తగ్గించిన విషయం అప్పటి ఆర్డీ, ప్రస్తుత కమిషనర్‌ అనూరాధ గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు. గతేడాది కృష్ణా పుష్కరాల సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్‌లు నాణ్యత గాలికొదిలి, పనులను మధ్యలోనే ఆపేశారు. అయినా వారి వద్ద పర్సంటేజీలు పుచ్చుకున్న ఇంజినీరింగ్‌ అధికారులు పూర్తిగా బిల్లులు చెల్లించేశారు.

మరి కొందరు ఇంజిరింగ్‌ అధికారులైతే బినామీ పేర్లతో టెండర్‌లు దక్కించుకుని వారే పనులు చేసి బిల్లులు చేసుకొన్నట్లు బయటపడింది. ఇంత జరిగినా జీఎంసీలో అంతర్గత బదిలీలు మినహా కఠిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల నగరంలోని ఆదిత్యానగర్‌ కాలనీలో నిషేధిత స్థలంలో నిర్మిస్తున్న ఇంటికి అధికారులు శారాదా కాలనీ అడ్రస్‌తో నీటి కుళాయి కేటాయించారు. దీనిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజారోగ్య విభాగంలోని కొందరు అధికారులు పారిశుద్ధ్య కార్మికుల లెక్కలు సక్రమంగా చూపకుండా జీతాలు మార్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆయా విభాగాల ఉన్నతాధికారుల అండతో తప్పించుకోగలుగుతున్నారు.

వారం రోజుల్లో తప్పులు సరిదిద్దుకోండి : కోన శశిధర్, కలెక్టర్‌
‘నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు నా దృష్టికి వచ్చాయి. వారం రోజులు టైం ఇస్తున్నా.. సరి చేసుకోండి.. ఆ తరువాత నేను జరిపే విచారణలో అక్రమాలు బయటపడితే ఊరుకునేది లేదు. ఆన్‌లైన్‌ పేరుతో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు చేస్తున్న వ్యవహారం మొత్తం నాకు తెలుసు. ఐఏఎస్‌ అధికారినే ఇబ్బందులు పెట్టి పంపారు.

ఎవరినీ వదిలిపెట్టను’ అంటూ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి కోన శశిధర్‌ జీఎంసీ అధికారులను హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్‌లో ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన సీరియస్‌గా క్లాస్‌ పీకారు. ప్రస్తుత కమిషనర్‌ అనూరాధ సైతం అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. ఇప్పటికైనా జీఎంసీ అధికారుల అవినీతికి అడ్డుకట్ట పడుతుందో ? లేదో ? వేచి చూడాలి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement