Vigilance inquiry
-
అప్పన్న భూముల కైంకర్యంపై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన భూములు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ వ్యవహారంలో లబ్ధి పొందిన వారెవరు? దేవదాయ శాఖ చట్ట నిబంధనలను ఉల్లంఘించి జరిగిన ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఆదేశించింది. 3 నెలల్లోగా విచారణ ముగించి ప్రభుత్వానికి నివేదిక అందచేయాలని నిర్దేశించింది. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా నివేదికలో తగిన సూచనలు చేయాలని పేర్కొంది. మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూములను కారుచౌకగా అప్పటి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన తీరు తెన్నులపైనా ఈ విచారణ కొనసాగనుంది. ఆయా అంశాలపై విజిలెన్స్ విచారణకు తగిన తోడ్పాటు, అవసరమైన పత్రాలు అందజేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రాథమిక విచారణలో అక్రమాల నిర్థారణ సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టులో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో 2016 నుంచి 2018 వరకు పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు దేవదాయ శాఖ గుర్తించింది. దీనిపై ప్రాథమిక విచారణ కోసం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వారం రోజులకు పైగా మరోసారి తనిఖీలు నిర్వహించి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేసింది. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల మాయం నిజమేనని ప్రాథమిక విచారణలో కమిటీ తేల్చడంతో పాటు అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్లు వెల్లడించింది. దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారన్నది తేలాలంటే దర్యాప్తు సంస్థలతో క్షుణ్నంగా విచారణ నిర్వహించాలని కమిటీ సూచించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బోర్డులో అశోక్‌తో పాటు బాబు సన్నిహితుడు సింహాచలం ఆలయ భూములు, మాన్సాస్ ట్రస్టు బోర్డులో భూ అక్రమాలు జరిగిన సమయంలో ట్రస్టు బోర్డు చైర్మన్‌గా అశోక్‌గజపతి రాజే ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల పర్యవేక్షణకు గత సర్కారు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో చైర్మన్ అశోక్‌తో పాటు చంద్రబాబుకు సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్నారు. ఇద్దరు అధికారులపై ఇప్పటికే చర్యలు.. ఈ వ్యవహారంలో భాగస్వామ్యలైన అప్పటి సింహాచలం ఈవో, ప్రస్తుతం దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న రామచంద్రమోహన్‌తోపాటు నాటి విశాఖ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ప్రస్తుతం సింహాచలం ఆలయంలో ఏఈవోగా ఉన్న సుజాతను ప్రభుత్వం 4 రోజుల కిత్రం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి... విజయనగరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెట్టి గత ప్రభుత్వ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను విక్రయించిన వ్యవహారంపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరపనున్నారు. మెడికల్ కాలేజీ కోసమంటూ విశాఖకు సమీపంలో మాన్సాన్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాల భూమిని, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమిని గత సర్కారు తమకు కావాల్సిన వారికి కారుచౌకగా కట్టబెట్టింది. అయితే మెడికల్ కాలేజీ కోసం అప్పటి ప్రభుత్వం గానీ, మాన్సాస్ ట్రస్టు తరఫున గానీ కనీసం దరఖాస్తు కూడా చేయలేదని అధికారుల కమిటీ గుర్తించింది. మచ్చుకు 36.11 ఎకరాల విక్రయాల రికార్డులను పరిశీలించగా అందులోనే రూ.74 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. సింహాచలం ఆలయం ఉన్న కొండపై గ్రావెల్‌ను అక్రమంగా విక్రయించారని, మాన్సాస్ ట్రస్టు భూములలో ఇసుక అమ్మకాలలోనూ భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని కమిటీ నిర్ధారించింది. -
ఖజానా కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని తమ వారికి దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం గత ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసింది. పలు పథకాలకు సంబంధించి కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాల్సిన అవసరం లేకున్నా, ఆ పద్ధతిలో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి ఖజానాను కొల్లగొట్టింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశకు సంబంధించిన 14 ప్యాకేజీల్లో మొత్తం రూ.109.7 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైంది. చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కే రూ.37.76 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూర్చినట్లు తేల్చింది. ఇక గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం మొదటి దశలో ఒక్క 26వ ప్యాకేజీలోనే రూ.46.45 కోట్లను కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టినట్లు స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి రాబట్టడంతో పాటు, ఆ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సాగునీటి ప్రాజెక్టుల పనులలో కఠినమైన బండరాళ్లను తొలగించేందుకు కంట్రోల్ బ్లాస్టింగ్ (పేలుళ్లు) చేయాల్సి వస్తే, అదనపు నిధులు చెల్లించాలన్న నిబంధన ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో ఎక్కడా లేదు. కానీ ఆ సాకు చూపి అదనపు బిల్లులు చెల్లించడానికి నవంబర్ 25, 2016న గత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. అదీ అప్పుడు జరుగుతున్న పనులకు కాదు. 2003 నుంచి 2014 దాకా చేసిన పనులతోపాటు, 2014 తర్వాత చేపట్టిన పనులకు కూడా అదనపు బిల్లులు చెల్లించేలా ఉత్తర్వు జారీ చేసింది. కంట్రోల్ బ్లాస్టింగ్ చేసినట్లుగా ఆర్డీవో స్థాయి అధికారి ధ్రువీకరిస్తే చాలని నిబంధన పెట్టింది. ఆ ఉత్తర్వును అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ వారికి అదనపు బిల్లుల రూపంలో భారీ ఎత్తున దోచిపెట్టారు. సీఎం రమేష్‌కు రూ.37.76 కోట్ల అదనపు లబ్ధి ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ దర్యాప్తు చేసింది. విచారణలో వెలుగుచూసిన అంశాలు.. - కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకున్నా చేసినట్లు చూపి కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించినట్లు, డీ వాటరింగ్, పూడిక తీత తీయకున్నా– తీసినట్లుగా చూపించి బిల్లులు చెల్లించారు. నేల స్వభావాన్ని తప్పుగా వర్గీకరించి అదనపు ప్రయోజనాన్ని చేకూర్చారు. - హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువ (–1.150 కిమీ నుంచి 78.670 కిమీ వరకు) విస్తరణ పనుల్లో సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థ కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేసిన దాఖలాలు లేవు. కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పని చేసినట్లు ఆర్డీవో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. అయినప్పటికీ సీఎం రమేష్‌కు 2018లో రూ.32.72 కోట్లను కట్టబెట్టారు. - హంద్రీ–నీవా తొలిదశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.4 కిమీ నుంచి 20 కిమీ వరకు తవ్వకం) పనుల్లో డీ వాటరింగ్, పూడిక తీతను సీఎం రమేష్ సంస్థ చేపట్టలేదు. 2005లో చేసిన ఆ పనులకు 2016లో డీవాటరింగ్.. పూడిక తీశారంటూ అదే ఏడాది రూ.94 లక్షలను ఆ సంస్థకు దోచిపెట్టారు. - హంద్రీ–నీవా తొలి దశలో 32వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 115 కిమీ నుంచి 176 కిమీ వరకు తవ్వకం) పనులను 2005–2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో సీఎం రమేష్ సంస్థ డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేయలేదు. అయినా సరే 2016లో డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేసినట్లు చూపి రూ.4.1 కోట్లను కట్టబెట్టారు. గాలేరు–నగరిలో రూ.46.45 కోట్లు... గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 26వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 25.067 కిమీ నుంచి 56.775 కిమీ వరకూ) పనులను 2005 నుంచి 2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయలేదు. డీ వాటరింగ్ చేయలేదు. అయినా సరే.. కంట్రోల్ బ్లాస్టింగ్, డీ వాటరింగ్ చేసినట్లు చూపి 2017లో కాంట్రాక్టర్‌కు రూ.46.45 కోట్లను దోచిపెట్టారు. -
డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు వద్దు
సాక్షి, అమరావతి: కార్మిక రాజ్యబీమా ఆస్పత్రుల (ఈఎస్ఐ)లో ఇకపై డిస్ట్రిబ్యూటర్ల నుంచి మందుల కొనుగోళ్లు చేయకూడదని, ఉత్పత్తి దారుల (మాన్యుఫాక్చరర్స్) నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయడం వల్ల నాసిరకం మందులు సరఫరా అయ్యే అవకాశం ఉండదని, అలా చేస్తే వారిని బాధ్యులు చేయవచ్చునని, పైగా తక్కువ ధరలకే వచ్చే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం. డిస్ట్రిబ్యూటర్ల నుంచి గానీ, వ్యక్తుల నుంచి గానీ, ఏజెంట్ల నుంచి గానీ కొనుగోలు చేస్తే నాసిరకం మందులు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాంటి వారి నుంచి కొనుగోలు చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఉత్పత్తి దారుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ అధికారులు మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నేడో రేపో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.300 కోట్ల వరకు మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో గత మూడు మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేశారు. విచారణ పూర్తికావడంతో త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. కొంతమంది అధికారులతో పాటు ఒకరిద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు, తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి కొడుకు మందుల కొనుగోళ్ల అవినీతిలో కీలక పాత్ర పోషించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మంత్రి కొడుకు చిన్న చిన్న స్లిప్పుల్లో సంతకాలు చేసి ఇచ్చినా కూడా దాని ఆధారంగా నామినేషన్ కింద మందులు సరఫరా చేశారని వెల్లడైంది. వంద రూపాయల సరుకు సరఫరా చేస్తే, వెయ్యి రూపాయలకు చేసినట్టు చూపించారు. పైగా రూపాయి మాత్రను పది రూపాయల రేటుకు కొనుగోలు చేసినట్టు కూడా విచారణాధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. ఇదిలా ఉండగా, ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలపై తెలంగాణ ఏసీబీ అధికారులు బుధవారం ఏపీ ఈఎస్ఐ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ల పాత్ర ఇక్కడ కూడా ఉండటంతో విచారణలో భాగంగా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. -
రాజధానిలో ‘రోడ్డు దోపిడీ’ నిజమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో బహిర్గతమయ్యాయి. ఏ పనులు ఎవరికి కేటాయించాలో ముందుగానే నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారని, ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించారని పేర్కొంది. రూ.4,057.95 కోట్ల విలువైన నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.751 కోట్లకు పైగా దోపిడీకి పథక రచన జరిగినట్లు విజిలెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. నాలుగు రహదారులు... మూడు సంస్థల కుమ్మక్కు అమరావతిలో నాలుగు రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అంశంలోనూ అంచనాలను ఎలా పెంచాలనే లక్ష్యంతోనే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. రాజధానిలో 11వ ప్యాకేజీ రహదారి నిర్మాణంలో అంచనాలను రూ.190.86 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ తేల్చింది. 12వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.106.42 కోట్లు, 13వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.195.88 కోట్లు, 14వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.157.74 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ విచారణ నిగ్గు తేల్చింది. ఈ నాలుగు రహదారుల పనులను మూడు కాంట్రాక్టు సంస్థలు కుమ్మకై దక్కించుకున్నాయని, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను రూపొందించిందని, ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశం లేకుండా నిబంధనలు విధించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. విజిలెన్స్ తేల్చిన వాస్తవాలు – కేవలం అంచనాలను పెంచడం ద్వారానే నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.651 కోట్ల మేర దోపిడీ జరిగింది. – ఇక అధిక ధరలకు అప్పగించడం ద్వారా మరో రూ.100 కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. – ఇప్పటివరకు చేసిన పనుల్లో నిబంధనలను తుంగలోకి తొక్కారు. చేయని పనులకు కూడా అక్రమంగా బిల్లులు చెల్లించారు. – రాజధాని ప్రాంతం మూడు పంటలు పండే మాగాణి భూమి కాగా రాతి నేల అంటూ లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – రహదారులకు పక్కన గ్రీనరీ పేరుతో లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – గ్రీనరీ కోసం మట్టి ఇతర ప్రాంతాల నుంచి తరలించి చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పక్కనే అనంతవరంలో క్వారీలు ఉండగా పేరేచర్ల నుంచి గ్రావెల్ తెచ్చినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పక్కనే కృష్ణా నదిలో ఇసుక ఉంటే మరోచోట నుంచి తరలించినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – వరద నీరు, డ్రైనేజీ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పవర్ యుటిలిటీ డక్ట్ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. -
సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ
-
సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ
సాక్షి,అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సదావర్తి సత్రం భూముల వేలంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలం వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర్ర ప్రభుత్వం గుర్తించింది. గత టీడీపీ ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించింది. సత్రం భూముల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విజిలెన్స్,ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆర్టీసీలో ‘కుల’కలం!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు అధికారులపై ఒకే తరహా ఫిర్యాదులొచ్చాయి. విజిలెన్సు విచారణలో అవి నిజమేనని తేలాయి. కానీ ఓ అధికారిని విధుల నుంచి తొలగించారు... మరో అధికారి ఆ తర్వాత ప్రమోషన్ అందుకుని పెద్ద పోస్టులో కొనసాగుతున్నాడు. ఇప్పుడీ అంశం ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. వేటు పడ్డ అధికారి ఎస్సీ కావటమే దీనికి కారణం. సొంతంగా బస్సులు కొనటం ఆర్టీసీ భారంగా భావిస్తుండటంతో కొంతకాలంగా అద్దె బస్సులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. వీటి పరిమితిపై ఉన్న నిబంధనను కూడా సడలించి వాటి సంఖ్యను పెంచుకుంటోంది. ఇది కొందరు ఉన్నతాధికారులకు ఆదాయవనరుగా మారింది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ఈ బస్సుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు దండుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఆ బస్సులు నడుపుకు నేందుకు అనుమతించినా, ఈ అధికారి మాత్రం ఒక్కో బస్సు నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించి, మరో జిల్లా రీజినల్ మేనేజర్‌కు ఆ బాధ్యత అప్పగించారు. ఆయన కూలంకషంగా విచారణ జరిపి వసూళ్లపై ఆధారాలున్నట్టు నివేదిక సమర్పించారు. మరో కేసులో.. వరంగల్‌లో కూడా ఇదే స్థాయి అధికారి అద్దె బస్సులపై పడి జేబులు నింపేసుకున్నాడు. దీనిపై కూడా బస్‌భవన్‌కు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ చేసి ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. రాజుకున్న కుల వివాదం నల్లగొండలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి పదోన్నతి పొంది బస్‌భవన్‌లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇది కులం రంగు పులుముకొంది. వేటుపడిన అధికారి ఎస్సీ కావటంతో ఆ వర్గం అధికారులు, సిబ్బంది దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒకే నేరానికి శిక్ష కూడా ఒకే రకంగా ఉండాలని కోరుతున్నారు. ఎస్సీ అధికారిపై వేటువేసి, మరో కులానికి చెందిన అధికారిని కాపాడటం కుల వివక్షగానే పరిగణించాలంటూ వారు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తీవ్ర ఆరోపణలున్నా.... నల్లగొండ జిల్లాలో పనిచేసి బదిలీ అయిన అధికారిపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లలో దుకాణాల కేటాయింపులో ఆయన హస్తలాఘవం ప్రదర్శించారన్నది ప్రధాన ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా పదార్థాలు, వస్తువులు అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో మిగ తా దుకాణాలు ఖాళీగా ఉండిపోయి ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. ఆయన అక్కడి నుంచి బదిలీ అయిన తర్వాత స్థానిక అధికారులు మళ్లీ వాటికి టెండర్లు పిలిచారు. కానీ దుకాణదారులతో కుమ్మక్కై ఆ అధికారి టెండర్లు రద్దు చేయించారు. -
ఒకే పనికి రెండు సార్లు బిల్లులు
లబ్బీపేట(విజయవాడ తూర్పు) : ప్రభుత్వాస్పత్రిలో రూ.3 కోట్లు గోల్‌మాల్‌పై విజిలెన్స్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. రెండో రోజు గురువారం కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకసారి బిల్లులు చెల్లించిన తర్వాత, ఎరియర్స్ పేరుతో రెండోసారి ఎలా చెల్లిస్తారని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆ కాలానికి సంబంధించి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో పనిచేసిన సిబ్బంది వివరాలు, అటెండెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.చక్రధర్‌ను విజిలెన్స్ డీఎస్సీ విజయపాల్ కోరారు. కాగా సాయంత్రం వరకు ఆ వివరాలు అందించకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి మరోసారి విచారించేందుకు విజిలెన్స్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. బిల్లుల చెల్లింపు ఎలా అంటే... ప్రభుత్వాస్పత్రిలో ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 వరకు సెక్యురిటీ గార్డులు 45 నుంచి 50 మంది వరకు పనిచేశారు. వారికి బిల్లులు చెల్లించారు. శానిటేషన్‌కు అదే విధంగా చేశారు. ఒకసారి కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లులను వందశాతం చెల్లించిన తరువాత మళ్లీ ఏరియర్స్ పేరుతో రెండోసారి ఎలా చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ కాలానికి సంబం«ధించి కాంట్రాక్టర్లు సమర్పించిన బిల్లులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అప్పట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుగుణంగా బిల్లులు సమర్పించడం, చెల్లించడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎరియర్స్ పేరుతో మరోసారి కోట్లాది రూపాయలు ఎలా చెల్లిస్తారనేది ప్రభుత్వాస్పత్రిలో చర్చానీయాంశంగా మారింది. సెక్యూరిటీ దోపిడీ.. ప్రభుత్వాస్పత్రిలో నెలకు రూ.18 లక్షలు సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు. అసలు ఎంత మంది గార్డులు పనిచేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారో అధికారులకు తెలియని పరిస్థితి. ప్రభుత్వాస్పత్రితోపాటు, సిద్ధార్థ వైద్య కళాశాల, డెంటల్ కాలేజీ కాంట్రాక్టు కూడా ఉండటంతో ఇక్కడి వారిని అక్కడ, అక్కడి వారిని ఇక్కడ, ఒక్కరినే రెండు చోట్ల చూపుతూ బిల్లులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారు. ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు అటెండెన్స్, పీఎఫ్ వివరాలు పరిశీలిస్తే కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారులపాత్ర ఉందా? ప్రభుత్వాస్పత్రి శానిటేషన్, సెక్యురిటీ, పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టు బిల్లులు టెండర్ ధరను అమాంతం మూడు రెట్టు పెంచడంతో పాటు, ఏరియర్స్ పేరిట రెండోసారి రూ.3 కోట్లు బిల్లులు చెల్లించిన విషయంలో ఆస్పత్రి అధి కారులతో పాటు, రాష్ట్ర వైద్య విద్యా సంచా లకుల కార్యాలయం పాత్ర కూడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు అంచనాకు వచ్చారు. -
కాసుక్కూర్చున్నారు..
► జీఎంసీలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అవినీతి అధికారులు ► నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలను పెంచిపోషిస్తున్న వైనం ► గతంలో విజిలెన్స్ విచారణలో బయటపడిన అవినీతి బాగోతం ► ప్రస్తుత కలెక్టరైనా అడ్డుకట్ట వేస్తారా ? నిబంధనలను పునాది రాళ్లలో తొక్కేసి గుంటూరు నగరంలో ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారా ?. నగరంలో ఏదైనా పనులు చేపట్టి నాణ్యతకు తిలోదకాలిచ్చేసి బిల్లులు తీసుకోవాలనుకుంటున్నా ?. ఇంటి కుళాయి దగ్గర నుంచి ఏదైనా సర్టిఫికెట్ వరకు అక్రమంగా పొందాలనుకుంటున్నారా ? అయితే మీ దగ్గర ముడుపులు దండిగా ఉండాలి. వీటిని ఆశ చూపితే చాలు గుంటూరు నగరపాలక సంస్థలో ఎలాంటి పనైనా చిటికెలో అయిపోతుంది. ఉన్నతాధికారులు అడ్డుపడతారని భయపడాల్సిన పని లేదు. వారినీ ఈ అవినీతి అనకొండలు మేనేజ్ చేస్తాయి. అవసరమైతే పక్కదారి పట్టించి బలి చేసేస్తాయి కూడా.. –సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు: నిషేధిత, ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు నిర్మించినా రెవెన్యూ విభాగం అధికారులు ఇంటి పన్నులు వేసేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. అభివృద్ధి పనులు నాణ్యత లేకున్నా ఇంజినీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తున్నారు. వాస్తవంగా 50 శాతానికి మించి శుభ్రత లేకపోయినా ప్రజారోగ్య విభాగం అధికారులు రికార్డుల్లో 99 శాతం ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇదంతా చేతులు తడిపితేనే. జీఎంసీలో ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ డబ్బులు ఇచ్చుకోలేని సామాన్యుల వద్ద నిబంధనల చిట్టా వల్లెవేస్తున్నారు. వీరి అవినీతిని అడ్డుకోవాలని చూసిన ఎంతో మంది కమిషనర్లను సైతం ఏడాది తిరక్కుండానే బదిలీపై పంపేస్తున్నారు. ఇదీ అనేక ఏళ్లుగా గుంటూరు నగరపాలక సంస్థలో సాగుతున్న అవినీతి దందా. బయటపడినవి కొన్ని..తెలియనివి ఎన్నో ముఖ్యంగా ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగాల్లోని కొందరు అధికారులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని రోజురోజుకూ విస్తరిస్తూనే ఉన్నారు. వీరికి కమిషనర్లంటే భయం లేదు. పైకి స్వామి భక్తి నటిస్తూ తమ విభాగాల్లోని ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ అవినీతి దందా కొనసాగిస్తున్నారు. కొత్తపేట శివాలయం ఎదురుగా ఓ వైద్యుడు అక్రమ నిర్మాణం చేపడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా ముడుపులు తీసుకొని సహకరించారు. దీనిపై మరో వైద్యుడు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పటి కమిషనర్ నాగలక్ష్మికి హైకోర్టు నెల రోజులు జైలు శిక్ష విధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి ఐఏఎస్ అధికారి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గతంలో ఇదే విభాగంలో టీడీఆర్ బాండ్లు, లేబర్‌సెస్ కుంభకోణాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిగ్గు తేల్చి పది మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇంత వరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చర్యలు శూన్యం రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు డబ్బులు దండుకుని పన్ను తగ్గించిన విషయం అప్పటి ఆర్డీ, ప్రస్తుత కమిషనర్ అనూరాధ గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు. గతేడాది కృష్ణా పుష్కరాల సమయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో కొందరు కాంట్రాక్టర్లు నాణ్యత గాలికొదిలి, పనులను మధ్యలోనే ఆపేశారు. అయినా వారి వద్ద పర్సంటేజీలు పుచ్చుకున్న ఇంజినీరింగ్ అధికారులు పూర్తిగా బిల్లులు చెల్లించేశారు. మరి కొందరు ఇంజిరింగ్ అధికారులైతే బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకుని వారే పనులు చేసి బిల్లులు చేసుకొన్నట్లు బయటపడింది. ఇంత జరిగినా జీఎంసీలో అంతర్గత బదిలీలు మినహా కఠిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల నగరంలోని ఆదిత్యానగర్ కాలనీలో నిషేధిత స్థలంలో నిర్మిస్తున్న ఇంటికి అధికారులు శారాదా కాలనీ అడ్రస్‌తో నీటి కుళాయి కేటాయించారు. దీనిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజారోగ్య విభాగంలోని కొందరు అధికారులు పారిశుద్ధ్య కార్మికుల లెక్కలు సక్రమంగా చూపకుండా జీతాలు మార్చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆయా విభాగాల ఉన్నతాధికారుల అండతో తప్పించుకోగలుగుతున్నారు. వారం రోజుల్లో తప్పులు సరిదిద్దుకోండి : కోన శశిధర్, కలెక్టర్ ‘నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు నా దృష్టికి వచ్చాయి. వారం రోజులు టైం ఇస్తున్నా.. సరి చేసుకోండి.. ఆ తరువాత నేను జరిపే విచారణలో అక్రమాలు బయటపడితే ఊరుకునేది లేదు. ఆన్లైన్ పేరుతో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు చేస్తున్న వ్యవహారం మొత్తం నాకు తెలుసు. ఐఏఎస్ అధికారినే ఇబ్బందులు పెట్టి పంపారు. ఎవరినీ వదిలిపెట్టను’ అంటూ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి కోన శశిధర్ జీఎంసీ అధికారులను హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్లో ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన సీరియస్‌గా క్లాస్ పీకారు. ప్రస్తుత కమిషనర్ అనూరాధ సైతం అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. ఇప్పటికైనా జీఎంసీ అధికారుల అవినీతికి అడ్డుకట్ట పడుతుందో ? లేదో ? వేచి చూడాలి. -
అవినీతి కూపం!
జీహెచ్ఎంసీలో పెరుగుతున్న అక్రమాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది లంచాలతో అక్రమంగా ఆస్తుల బదిలీ తాజాగా విజిలెన్స్ విచారణలో వెల్లడి పోలీసు కేసు నమోదు సిటీబ్యూరో: సినిమాలు.. కామెడీ సీన్లలో జరిగినట్లుగానే ఘనత వహించిన జీహెచ్ఎంసీలో ఇలాంటి అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. అడపాదడపా బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తగిన విచారణ జరిపితే ఒకటో, అరో వెలుగు చూస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులపై చర్యలు లేకపోవడంతో వారు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కిందిస్థాయిలోని ఔట్సోర్సింగ్ సిబ్బంది అక్రమాల కారణంగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. విచారణలో నిజాలు వెలుగు చూసినప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. కొంతకాలం గడిచాక తిరిగి వారు మళ్లీ ఏదో ఒక సర్కిల్లో విధుల్లో చేరుతూ అక్రమాల పరంపరను కొనసాగిసున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ పరిధిలోని ఒక భవన యజమాని పేరునే మార్చిన ఘటన(తప్పుడు మ్యుటేషన్)తో జీహెచ్ఎంసీలో అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అయిన ఘటనలు మరువకముందే ఈ ఘటన వెలుగు చూసింది. అన్ని విభాగాల్లోనూ... టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి బహిరంగంగా కనిపిస్తుండగా, ఇంజినీరింగ్‌లో చేయని పనులకు బిల్లులు, నాణ్యత లోపాలతో అవినీతి వెల్లడవుతోంది. రవాణా విభాగంలో డీజిల్, వాహన విడిభాగాల్లో అక్రమాలు చోటుచేసుకుంటుండగా..ఆస్తిపన్ను వసూళ్లు, మ్యుటేషన్ పనులు చేసే ట్యాక్స్ సెక్షన్లో ఊహించని విధంగా అవినీతి జరుగుతోంది. ఆస్తిపన్ను తక్కువ అసెస్ చేసేందుకు ఒకరేటు.. చేయి తడపకపోతే ఎక్కువ ఆస్తిపన్ను విధిస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ మరో రేటు వంతున వసూలు చేస్తున్నారు. ఇలా విచ్చలవిడిగా సంపాదించిన ఆదాయంతో ఆర్థికసంవత్సరం ఆఖరినెల మార్చి ముగిశాక జల్సాలు, విలాసాలు, విదేశీయాత్రలు సంప్రదాయంగా మారాయి. ఔట్సోర్సింగ్ అంటే పండగే.. ఎక్కడైనా ఔట్సోర్సింగ్ అంటే డిమాండ్ ఉంటుందో ఉండదోకానీ జీహెచ్ఎంసీలో మాత్రం పండగే. ఎందుకంటే పేరుకు ఔట్సోర్సింగ్ అయినా అధికారులు చేయాల్సిన పనులన్నీ దాదాపుగా ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లే నిర్వహిస్తుంటారు. అధికారుల పని ఒత్తిడి వల్ల కావచ్చు. ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు వారి డిజిటల్ కీలు, పాస్వర్డ్లు సైతం ఆపరేటర్లకప్పగించి పనులు చేయిస్తున్న అధికారులు తక్కువేమీ లేరు. దీంతో ఆపరేటర్లు ఆడింది ఆట..పాడింది పాటగా కొనసాగుతోంది. ఔట్‌సోర్సింగ్‌పై పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం గతంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో ఎక్కువగా జరిగేది. ప్రస్తుతం అది అన్ని విభాగాలకూ వ్యాపించింది. ఆస్తిపన్నును ఆన్లైన్లో తక్కువ చేసేందుకు బిల్ కలెక్టర్లు, ఆపరేటర్లు కుమ్మక్కై జీహెచ్ఎంసీ ఖజానాను ముంచుతున్నారని గుర్తించి రెండేళ్ల క్రితం ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతల్ని సీజీజీకి అప్పగించారు. అయినప్పటికీ అక్రమార్కుల అవినీతి దందా ఆగడం లేదు. ఉన్నతాధికారుల సహకారం, సమన్వయంలతో ఈ అవినీతికి పాల్పడుతున్నవారు కొందరైతే, ఆన్లైన్లో డేటా మార్చి లంచాలకు పాల్పడుతున్నవారు మరికొందరు. -
కొంపముంచిన మామూళ్ల పంచాయితీ
కమిషనర్ పేరుతో కలెక్షన్లు వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు కలకలం రేపిన ‘సాక్షి’ కథనం విజయవాడ సెంట్రల్ : అక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కుల్లో కలకలం మొదలైంది. విజిలెన్స్ విచారణ లోతుగా సాగితే తమ కొంప కొల్లేరవుతుందని పలువురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ‘టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి ప్రకంపనలు’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ సాగింది. టౌన్‌ప్లానింగ్ అక్రమాలపై వచ్చే ఆరోపణలపై ఇప్పటి వరకు శాఖాపరమైన దర్యాప్తు సాగింది కాబట్టి ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. నేరుగా ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో మూల్యం భారీగా చెల్లించుకోక తప్పదనే భయం అక్రమార్కులను వెంటాడుతోంది. మూమూళ్ల పంపకాల్లో తేడాల వల్లే.. మామూళ్ల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే విజిలెన్స్‌ను ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ల (టీపీఎస్) మధ్య కొద్ది రోజులుగా కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు సమాచారం. వన్‌టౌన్‌లో అక్రమ కట్టడాలకు సంబంధించి ఒక టీపీఎస్ భారీగా మామూళ్లు వసూలు చేసినట్లు వినికిడి. తన పరిధి కాని దాంట్లో అతను తలదూర్చి డబ్బులు దండుకోవడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. సిటీ ప్లానర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఈ టీపీఎస్ ఓవర్ యాక్షన్ ఎక్కువవడంపై పలువురు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రమంత్రి బావమరిది పటమట ప్రాంతంలో ఇల్లు కట్టారు. మార్ట్గేజ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరారు. నిబంధనల పేరుతో అతని వద్ద టీపీఎస్ చేయిచాచడంతో ‘మా బావ ఎవరో తెలుసా అంటూ’ మంత్రి బావమరిది వార్నింగ్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న టీపీఎస్ మార్ట్గేజ్ రిలీజ్ చేయాల్సిందిగా బిల్డింగ్ ఇన్పెక్టర్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కమిషనర్ పేరుతో కలెక్షన్ కమిషనర్ పేరుతో టౌన్ ప్లానింగ్‌లో కలెక్షన్ చేస్తున్నట్లు బలమైన విమర్శలు ఉన్నాయి. ఇటీవల బదిలీ అయిన సి.హరికిరణ్ తన హయాంలో టౌన్‌ప్లానింగ్ నుంచి వచ్చే కొన్ని ఫైళ్లపై స్పీక్, డిస్కస్ అని రాసేవారని తెలుస్తోంది. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న ఇద్దరు అధికారులు గృహ నిర్మాణదారుల నుంచి గట్టిగా ఆమ్యామ్యాలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్బీపేట గ్రీన్‌ల్యాండ్స్ సమీపంలో ఒక భవనం మార్ట్గేజ్ రిలీజ్‌కు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఫైల్‌పై కమిషనర్ డిస్కస్ అని రాయడంతో ‘కమిషనర్ మీ బిల్డింగ్ విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఆక్యుపెన్సీ రావడం కష్టం’ అంటూ ఆ భవన యజ మానిని బెదిరించి మూడు లక్షల రూపాయలు గుంజినట్లు తెలుస్తోంది. అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ నిష్పక్షపాతంగా జరిగితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
రెవె‘న్యూ’.. జగడం
* గంటాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లో మంత్రి అయ్యన్న మంత్రాంగం * భూ వ్యవహారంపై విజిలెన్స్ విచారణతో కలకలం * ఆర్డీవోపై వేటు కోసం వ్యూహం! * మంత్రుల మధ్య వేడెక్కుతున్న రాజకీయం సాక్షి, విశాఖపట్నం : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో మంత్రి అయ్యన్న బాణం సంధించారు. కోట్ల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా స్వామి భక్తిని ప్రదర్శించే అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు మంత్రి గంటాకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటుకు మార్గం సుగమం చేశారు. అదను చూసి వేసిన ఎత్తుకు మంత్రి గంటా బిత్తరపోవాల్సిన పరిస్థితి కల్పించారు. భీమిలి, పరవాడలలో భూ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జిల్లా రాజకీయ, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఇప్పటికే ఉప్పూ నిప్పుగా ఉన్న అయ్యన్న, గంటాల మధ్య తాజా ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. ఇద్దరు మంత్రుల ఆధిపత్యపోరులో తాము అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో పనిచేయడం కంటే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడం ఉత్తమమని కూడా భావిస్తున్నారు. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... పరవాడ మండలంలో సర్వే నంబర్ 54లో 32.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఒక ప్రభుత్వ పెద్ద ఎప్పటి నుంచో కన్నేశారు. అదే విధంగా భీమిలి మండలం గంభీరంలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ఇదే రీతిలో ఆక్రమించాలని ఎప్పటినుంచో పథకం పన్నారు. ఈ భూములు ప్రస్తుతం రైతులు, స్థానికుల ఆక్రమణలో ఉన్నాయి. వీటిని ఎలాగైనా తన పరం చేసుకోవాలని కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో సదరు ప్రభుత్వ పెద్ద చక్రం తిప్పారు. తన అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారి ద్వారా కథ నడిపించారు. గత ప్రభుత్వ హయాంలోనే గంభీరం వద్ద ఉన్న భూములను క్రమబద్ధీకరించుకున్నారని సమాచారం. పరవాడలో రైతుల ఆక్రమణలో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చే విషయం పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ఆ కీలక నేత, ఈయన తనకు అనుకూలుడైన రెవెన్యూ అధికారి ఒకరు సదరు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను టాంపరింగ్ చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా పరిగణించారు. కానీ ఆ కీలక నేత ఒత్తిడితో టాంపరింగ్ విషయం తెలిసినా సదరు అధికారి మిన్నకుండిపోయినట్టుగా తెలియవచ్చింది. భీమునిపట్నం మండలంలోని చిప్పాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 86/4, 184/6లలో ఉన్న భూముల రికార్డులను తారుమారు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ సర్వే నంబర్లో సుమారు 500 ఎకరాల్లో ఓ లేబొరేటరీ ఉండగా, మిగిలిన భూముల్లో అటవీ, విజయనగరం జిల్లా మాన్సాస్ భూములు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీఎం, డీప్యూటీ సీఎంలకు ఫిర్యాదుల వెల్లువెత్తడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీల్లో రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమైన సదరు రెవెన్యూ అధికారిపై ఈ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. విచారణ పేరుతో సదరు అధికారిని బలవంతంగా పంపించేందుకే జిల్లాకు చెందిన కీలక మంత్రి పావులు కదిపినట్టుగా తెలుస్తోంది. -
అక్రమ లేఅవుట్లపై విజి‘లెన్స్’
కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం సిద్ధం పంచాయతీలవారీగా ప్లాట్ల వివరాల సేకరణ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్ల గుండెల్లో రైళ్లు నక్కపల్లి : అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు నిబంధనల మేరకు ఏర్పాటు చేశారా లేదా అన్నది నిర్థారించేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. డీపీవో ఆదేశాల మేరకు అక్రమ లేఅవుట్ల విషయంపై నివేదిక సిద్ధం చేస్తున్నామని ఈవోఆర్డీ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన లేఅవుట్లకు వుడా, డీటీసీపీ అప్రూవల్‌లు లేవు. స్థానిక పంచాయతీలు డెవలపర్స్ నుంచి మామ్మూళ్లు తీసుకుని తీర్మానాలు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము వేసిన లేఅవుట్లకు అనుమతులున్నాయంటూ కొనుగోలుదార్లను మోసం చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లను విక్రయించారు. లేఅవుట్లకు అనుమతి మంజూరు చేసే అధికారం పంచాయతీలకు లేదు. కేవలం వుడా అధికారులకు సిఫార్సు మాత్రమే చేయాలి. ఈ సిఫార్సు లేఖలనే అప్రూవల్స్‌గా చూపించి డెవలపర్స్ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పాయకరావుపేట పట్టణంలో అత్యధికంగా 119 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇలా అనుమతి లేని లేఅవుట్లు కొనుగోలు చేసి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టినవారికి కరెంటు, తాగునీరు సరఫరా నిలిపివేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్లాట్లుకొని ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ మీటర్లుకోసం దరఖాస్తు చేస్తే అటువంటివి పెండింగ్‌లో పెట్టేందుకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు భోగట్టా. చాలాచోట్ల ఏర్పాటు చేసిన లేఅవుట్లలో సామాజిక అవసరాల నిమిత్తం పంచాయతీలకు, మున్సిపాలిటీలకు 10 శాతం స్థలాన్ని కేటాయించాలి. ఈ విధంగా స్థలం కేటాయించకపోవడం, కొన్ని చోట్ల ఇలా కేటాయించిన స్థలాలను కూడా విక్రయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల వారీగా లే అవుట్ల వివరాలు సమర్పించాలని డీపీవో ఆదేశించారు. ఆ వివరాల మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. లే అవుట్లు ఇలా వేయాలి.. 2002లో ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం 67 ప్రకారం లేఅవుట్లు వేయాలి. అప్రోచ్ రోడ్డు 40 అడుగులు, ఇంటర్నల్ రోడ్లు 30 అడుగులు ఉండాలి. తాగునీరు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ అవసరాలకు స్థలం కేటాయించి పంచాయతీకి రాతపూర్వకంగా అందజేయాలి. గుర్తించిన అక్రమలే అవుట్లు నర్సీపట్నం డివిజనల్లో సుమారు 218.11 ఎకరాల్లో అక్రమలే అవుట్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. నక్కపల్లి మండలంలో 51.96 ఎకరాలు, పాయకరావుపేటలో 119.74 ఎకరాలు, రావికమతం మండలంలో 7.46 ఎకరాలు, ఎస్.రాయవరం మండలంలో 13 ఎకరాలు, కోటవురట్ల మండలంలో 2.93 ఎకరాలు, మాకవరపాలెం మండలంలో 20.16 ఎకరాల్లో అక్రమలేఅవుట్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. వందమంది డెవలపర్స్‌ను దీనికి బాధ్యులను చేశారు. ఆయా పంచాయతీల వారీగా లేఅవుట్లు వేసిన సర్వే నెంబర్లు, డవలపర్స్ పేర్లు, విస్తీర్ణం, ఎన్నిప్లాట్లుగా విభజించారనే వివరాలు సేకరించి విజిలెన్స్ అధికారులకు అందజేసేప్రక్రియ చురుగ్గాసాగుతోంది. అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ఈ లేఅవుట్లను నాలాకింద మార్చి రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించారా లేదా అన్న కోణంలో కూడా విజిలెన్స్ ద్వారా విచారణ చేయించనున్నారు. ప్రభుత్వ చర్యలతో రియల్ ఎస్టేట్వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
‘ఉపాధి’ అక్రమాలపై విజిలెన్స్ విచారణ
ఖమ్మం మయూరిసెంటర్: ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం వ్యక్తిగత విచారణ జరిపారు. కూసుమంచి, వీఆర్ పురం, సత్తుపల్లి మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన 71మంది 1,29,759 రూపాయలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డట్టుగా సోషల్ ఆడిట్లో తేలడంతో జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. కూసుమంచి మండలంలో నిర్వహించిన ఆరవ విడత సోషల్ ఆడిట్లో 33మంది రూ.70,907 వరకు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. వీరిలో ఒక ఏపీవో, దుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక ఈసీ, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 24మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. సత్తుపల్లిలో ఏడో విడత సోషల్ ఆడిట్లో మొత్తం 12మంది రూ.11,416 వరకు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. వీరిలో ఒక ఏపీవో, ఒక ఈసీ, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఏడుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీఆర్ పురం మండలంలో ఆరవ విడత సోషల్ ఆడిట్లో 26మంది రూ.47,536 వరకు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. వీరిలో ఒక ఏపీవో, ఇద్దరు ఈసీలు, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో ఒకరు రూ.10,038, మరొకరు రూ.14,776 వరకు అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. అక్రమాలకు పాల్పడిన వారిలో జిల్లాలో ఇప్పటివరకు 111మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో నలుగురు ఏపీవోలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఐదుగురు ఈసీలు, 51మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 12మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. మిగిలిన 39మంది నుంచి స్వాహా నిధులను తిరిగి వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చారు. -
స్వర్గమా.. సెస్‌కు నరకమా!
- గతమంతా అవినీతిమయం - ఆయనకే మళ్లీ ఎండీ పోస్టింగ్ - రూ.3.08 కోట్ల అవినీతికి జేజేలు - విచారణ నివేదిక తుంగలో తొక్కారా? - విజిలెన్స్ విచారణ ఫైలు ఎక్కడాగింది? - హాట్ టాపిక్‌గా మారిన రంగారావు నియామకం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అయిదేళ్ల కిందట ఆయన హయాంలోనే భారీగా అవినీతి జరిగింది. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ లిమిటెడ్‌లో (సెస్)లో కనీసం రూ.3 కోట్ల సొమ్ము దుర్వినియోగమైంది. స్వయానా ఎన్పీడీసీఎల్ అధికారుల ప్రాథమిక విచారణలో ఈ అవినీతి స్వరూపం బట్టబయలైంది. ఆ విచారణ సైతం తూతూమంత్రంగానే సాగిందని... లోతుపాతులు తవ్వితే మరిన్ని లొసుగులు వెలికి వస్తాయని అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. జేసీ రాసిన లేఖను పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐవీఆర్ కృష్ణారావు గత ఏడాది మే 25న రిజిస్ట్రార్ అండ్ కమిషనర్‌కు రిమైండర్ రాశారు. కానీ.. ఇప్పటికీ ఈ ఫైలు ముందుకు కదల్లేదు. దీంతో విజిలెన్స్ విచారణ ప్రారంభం కాకముందే కొండెక్కినట్లయింది. సిరిసిల్ల సెస్ కేంద్రంగా జరిగిన అవినీతి తుట్టెను కదిపితే.. ఎవరికి చుట్టుకుంటుందోననే భయంతో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఫైలును తొక్కిపెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువుదీరగానే అనుచిత నిర్ణయం వెలువడింది. అప్పట్లో ఎవరి హయాంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు... అభియోగాలున్నాయో.. ఆయననే మరోసారి సెస్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించింది. సిరిసిల్ల సెస్ ఎండీగా స్వర్గం రంగారావును నియమిస్తూ రెండు రోజుల కిందట ఎన్పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2007 జూలై నుంచి 2010 మే వరకు ఆయన సెస్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే భారీగా అవినీతి, అవకతవకల దుమారం చెలరేగింది. 2007-2010 మధ్య కాలంలో ఇంప్రూవ్మెంట్ వర్క్స్ పేరిట జరిగిన పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. సిరిసిల్ల సెస్ పరిధిలో తొమ్మిది మండలాలున్నాయి. దాదాపు 300 గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసే సహకార సంఘంగా దేశంలోనే సిరిసిల్ల సెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నీటిపారుదల సదుపాయం లేని మెట్ట ప్రాంతంలో ఉన్న మండలాలకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఢిల్లీలోని ఆర్ఈసీ ఆర్థిక సహకారంతో 43 ఏళ్ల కిందట సెస్ ఏర్పడింది. 2007-10 మధ్య కాలంలో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు ఎన్పీడీసీఎల్ విచారణ కమిటీని నియమించింది. అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా నియమించారు. వరుసగా మూడేళ్ల వ్యవధిలో జరిగిన అవకతవకలు, అందుకు బాధ్యులైన ఉద్యోగులు, అధికారులపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. ఈ విచారణ కమిటీ మొత్తం రూ 3.08 కోట్ల అవినీతి జరిగినట్లు ధ్రువీకరించింది. జరిగిన అవకతవకలను ఉటంకించటంతో పాటు బాధ్యులైన ఉద్యోగులు, అధికారుల వివరాలను సైతం వేలెత్తి చూపింది. వరుసగా మూడేళ్ల వ్యవధిలో సెస్ పరిధిలో ఇంప్రూవ్మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మైనర్ ఎక్స్టెన్షన్ విభాగాలుగా మొత్తం 3207 పనులు జరిగాయి. అందులో కేవలం 1837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1370 పనులను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవటంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం జరిగింది. అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయించి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి, మిగతాదంతా పక్కదారి పట్టించినట్లు వేలెత్తి చూపింది. పనులు పూర్తి కాకుండానే.. కనీసం వర్క్ ఆర్డర్లు, అగ్రిమెంట్లు లేకుండానే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరగటంతో సెస్‌కు భారీ మొత్తం గండి పడింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయముందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలని అప్పట్లో సెస్‌కు పర్సన్ ఇన్చార్జిగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంత జరిగినా అప్పటి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు, దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఉన్నతాధికారులు వెనుకంజ వేయటం అనుమానాలకు తావిస్తోంది. ఈలోగా విచారణ పేరుతోమరో రూ.10 లక్షలకు పైగా సెస్ ఖజానాకు గండి పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అవినీతి హయాంగా ముద్రవేసుకున్న అధికారికే మరోసారి సెస్ ఎండీగా బాధ్యతలు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సెస్‌లో జరిగిన అవినీతికి ఉన్నత స్థాయిలోనే లింక్లున్నాయా.. అప్పటి అవినీతి ఫైళ్లను తొక్కిపెట్టేందుకు కొత్తగా మళ్లీ పాత ఎండీని రంగంలోకి దింపారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులతో ముడిపడి ఉన్న సహకార సంఘం కావటంతో సెస్ ఎండీ నియామకం అందరి నోటా హాట్ టాపిక్‌గా మారింది.