స్వర్గమా.. సెస్‌కు నరకమా! | Sircilla Co-op Electricity Supply Society Ltd. | Sakshi
Sakshi News home page

స్వర్గమా.. సెస్‌కు నరకమా!

Published Sun, Jun 22 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

స్వర్గమా.. సెస్‌కు నరకమా!

స్వర్గమా.. సెస్‌కు నరకమా!

- గతమంతా అవినీతిమయం
- ఆయనకే మళ్లీ ఎండీ పోస్టింగ్
- రూ.3.08 కోట్ల    అవినీతికి జేజేలు
- విచారణ నివేదిక తుంగలో తొక్కారా?
- విజిలెన్స్ విచారణ ఫైలు ఎక్కడాగింది?
- హాట్ టాపిక్‌గా మారిన రంగారావు నియామకం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అయిదేళ్ల కిందట ఆయన హయాంలోనే భారీగా అవినీతి జరిగింది. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ లిమిటెడ్‌లో (సెస్)లో కనీసం రూ.3 కోట్ల సొమ్ము దుర్వినియోగమైంది. స్వయానా ఎన్‌పీడీసీఎల్ అధికారుల ప్రాథమిక విచారణలో ఈ అవినీతి స్వరూపం బట్టబయలైంది. ఆ విచారణ సైతం తూతూమంత్రంగానే సాగిందని... లోతుపాతులు తవ్వితే మరిన్ని లొసుగులు వెలికి వస్తాయని అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.

జేసీ రాసిన లేఖను పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐవీఆర్ కృష్ణారావు గత ఏడాది మే 25న రిజిస్ట్రార్ అండ్ కమిషనర్‌కు రిమైండర్ రాశారు. కానీ.. ఇప్పటికీ ఈ ఫైలు ముందుకు కదల్లేదు. దీంతో విజిలెన్స్ విచారణ ప్రారంభం కాకముందే కొండెక్కినట్లయింది.

సిరిసిల్ల సెస్ కేంద్రంగా జరిగిన అవినీతి తుట్టెను కదిపితే.. ఎవరికి చుట్టుకుంటుందోననే భయంతో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఫైలును తొక్కిపెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువుదీరగానే అనుచిత నిర్ణయం వెలువడింది. అప్పట్లో ఎవరి హయాంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు... అభియోగాలున్నాయో.. ఆయననే మరోసారి సెస్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించింది.
 
సిరిసిల్ల సెస్ ఎండీగా స్వర్గం రంగారావును నియమిస్తూ రెండు రోజుల కిందట ఎన్‌పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2007 జూలై నుంచి 2010 మే వరకు ఆయన సెస్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే భారీగా అవినీతి, అవకతవకల దుమారం చెలరేగింది. 2007-2010 మధ్య కాలంలో ఇంప్రూవ్‌మెంట్ వర్క్స్ పేరిట జరిగిన పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. సిరిసిల్ల సెస్ పరిధిలో తొమ్మిది మండలాలున్నాయి.

దాదాపు 300 గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసే సహకార సంఘంగా దేశంలోనే సిరిసిల్ల సెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నీటిపారుదల సదుపాయం లేని మెట్ట ప్రాంతంలో ఉన్న మండలాలకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఢిల్లీలోని ఆర్‌ఈసీ ఆర్థిక సహకారంతో 43 ఏళ్ల కిందట సెస్ ఏర్పడింది. 2007-10 మధ్య కాలంలో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు ఎన్‌పీడీసీఎల్ విచారణ కమిటీని నియమించింది.

అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా నియమించారు. వరుసగా మూడేళ్ల వ్యవధిలో జరిగిన అవకతవకలు, అందుకు బాధ్యులైన ఉద్యోగులు, అధికారులపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. ఈ విచారణ కమిటీ మొత్తం రూ 3.08 కోట్ల అవినీతి జరిగినట్లు ధ్రువీకరించింది. జరిగిన అవకతవకలను ఉటంకించటంతో పాటు బాధ్యులైన ఉద్యోగులు, అధికారుల వివరాలను సైతం వేలెత్తి చూపింది.

వరుసగా మూడేళ్ల వ్యవధిలో సెస్ పరిధిలో ఇంప్రూవ్‌మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మైనర్ ఎక్స్‌టెన్షన్ విభాగాలుగా మొత్తం 3207 పనులు జరిగాయి. అందులో కేవలం 1837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1370 పనులను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవటంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది.

ఇంప్రూవ్‌మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం జరిగింది. అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయించి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది.

సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి, మిగతాదంతా పక్కదారి పట్టించినట్లు వేలెత్తి చూపింది. పనులు పూర్తి కాకుండానే.. కనీసం వర్క్ ఆర్డర్లు, అగ్రిమెంట్లు లేకుండానే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరగటంతో సెస్‌కు భారీ మొత్తం గండి పడింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయముందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది.

మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించాలని అప్పట్లో సెస్‌కు పర్సన్ ఇన్‌చార్జిగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంత జరిగినా అప్పటి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు, దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఉన్నతాధికారులు వెనుకంజ వేయటం అనుమానాలకు తావిస్తోంది.

ఈలోగా విచారణ పేరుతోమరో రూ.10 లక్షలకు పైగా సెస్ ఖజానాకు గండి పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అవినీతి హయాంగా ముద్రవేసుకున్న అధికారికే మరోసారి సెస్ ఎండీగా బాధ్యతలు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సెస్‌లో జరిగిన అవినీతికి ఉన్నత స్థాయిలోనే లింక్‌లున్నాయా.. అప్పటి అవినీతి ఫైళ్లను తొక్కిపెట్టేందుకు కొత్తగా మళ్లీ పాత ఎండీని రంగంలోకి దింపారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులతో ముడిపడి ఉన్న సహకార సంఘం కావటంతో సెస్ ఎండీ నియామకం అందరి నోటా హాట్ టాపిక్‌గా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement