ప్రభుత్వాస్పత్రి (ఫైల్)
లబ్బీపేట(విజయవాడ తూర్పు) : ప్రభుత్వాస్పత్రిలో రూ.3 కోట్లు గోల్‌మాల్‌పై విజిలెన్స్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. రెండో రోజు గురువారం కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకసారి బిల్లులు చెల్లించిన తర్వాత, ఎరియర్స్ పేరుతో రెండోసారి ఎలా చెల్లిస్తారని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆ కాలానికి సంబంధించి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో పనిచేసిన సిబ్బంది వివరాలు, అటెండెన్స్, పీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలు సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.చక్రధర్‌ను విజిలెన్స్ డీఎస్సీ విజయపాల్ కోరారు. కాగా సాయంత్రం వరకు ఆ వివరాలు అందించకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి మరోసారి విచారించేందుకు విజిలెన్స్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
బిల్లుల చెల్లింపు ఎలా అంటే...
ప్రభుత్వాస్పత్రిలో ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 వరకు సెక్యురిటీ గార్డులు 45 నుంచి 50 మంది వరకు పనిచేశారు. వారికి బిల్లులు చెల్లించారు. శానిటేషన్‌కు అదే విధంగా చేశారు. ఒకసారి కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లులను వందశాతం చెల్లించిన తరువాత మళ్లీ ఏరియర్స్ పేరుతో రెండోసారి ఎలా చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ కాలానికి సంబం«ధించి కాంట్రాక్టర్‌లు సమర్పించిన బిల్లులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అప్పట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనుగుణంగా బిల్లులు సమర్పించడం, చెల్లించడం జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎరియర్స్ పేరుతో మరోసారి కోట్లాది రూపాయలు ఎలా చెల్లిస్తారనేది ప్రభుత్వాస్పత్రిలో చర్చానీయాంశంగా మారింది.
సెక్యూరిటీ దోపిడీ..
ప్రభుత్వాస్పత్రిలో నెలకు రూ.18 లక్షలు సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు. అసలు ఎంత మంది గార్డులు పనిచేస్తున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారో అధికారులకు తెలియని పరిస్థితి. ప్రభుత్వాస్పత్రితోపాటు, సిద్ధార్థ వైద్య కళాశాల, డెంటల్ కాలేజీ కాంట్రాక్టు కూడా ఉండటంతో ఇక్కడి వారిని అక్కడ, అక్కడి వారిని ఇక్కడ, ఒక్కరినే రెండు చోట్ల చూపుతూ బిల్లులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారు. ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు అటెండెన్స్, పీఎఫ్ వివరాలు పరిశీలిస్తే కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.
ఉన్నతాధికారులపాత్ర ఉందా?
ప్రభుత్వాస్పత్రి శానిటేషన్, సెక్యురిటీ, పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టు బిల్లులు టెండర్ ధరను అమాంతం మూడు రెట్టు పెంచడంతో పాటు, ఏరియర్స్ పేరిట రెండోసారి రూ.3 కోట్లు బిల్లులు చెల్లించిన విషయంలో ఆస్పత్రి అధి కారులతో పాటు, రాష్ట్ర వైద్య విద్యా సంచా లకుల కార్యాలయం పాత్ర కూడా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు అంచనాకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment