అక్రమ లేఅవుట్లపై విజి‘లెన్స్’
కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం సిద్ధం
పంచాయతీలవారీగా ప్లాట్ల వివరాల సేకరణ
రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్ల గుండెల్లో రైళ్లు
నక్కపల్లి : అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు నిబంధనల మేరకు ఏర్పాటు చేశారా లేదా అన్నది నిర్థారించేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. డీపీవో ఆదేశాల మేరకు అక్రమ లేఅవుట్ల విషయంపై నివేదిక సిద్ధం చేస్తున్నామని ఈవోఆర్‌డీ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన లేఅవుట్లకు వుడా, డీటీసీపీ అప్రూవల్‌లు లేవు. స్థానిక పంచాయతీలు డెవలపర్స్ నుంచి మామ్మూళ్లు తీసుకుని తీర్మానాలు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము వేసిన లేఅవుట్లకు అనుమతులున్నాయంటూ కొనుగోలుదార్లను మోసం చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లను విక్రయించారు. లేఅవుట్లకు అనుమతి మంజూరు చేసే అధికారం పంచాయతీలకు లేదు. కేవలం వుడా అధికారులకు సిఫార్సు మాత్రమే చేయాలి. ఈ సిఫార్సు లేఖలనే అప్రూవల్స్‌గా చూపించి డెవలపర్స్ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పాయకరావుపేట పట్టణంలో అత్యధికంగా 119 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇలా అనుమతి లేని లేఅవుట్లు కొనుగోలు చేసి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టినవారికి కరెంటు, తాగునీరు సరఫరా నిలిపివేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్లాట్లుకొని ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ మీటర్లుకోసం దరఖాస్తు చేస్తే అటువంటివి పెండింగ్‌లో పెట్టేందుకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు భోగట్టా. చాలాచోట్ల ఏర్పాటు చేసిన లేఅవుట్లలో సామాజిక అవసరాల నిమిత్తం పంచాయతీలకు, మున్సిపాలిటీలకు 10 శాతం స్థలాన్ని కేటాయించాలి.
ఈ విధంగా స్థలం కేటాయించకపోవడం, కొన్ని చోట్ల ఇలా కేటాయించిన స్థలాలను కూడా విక్రయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల వారీగా లే అవుట్ల వివరాలు సమర్పించాలని డీపీవో ఆదేశించారు. ఆ వివరాల మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు.
లే అవుట్లు ఇలా వేయాలి..
2002లో ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం 67 ప్రకారం లేఅవుట్లు వేయాలి. అప్రోచ్ రోడ్డు 40 అడుగులు, ఇంటర్నల్ రోడ్లు 30 అడుగులు ఉండాలి. తాగునీరు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ అవసరాలకు స్థలం కేటాయించి పంచాయతీకి రాతపూర్వకంగా అందజేయాలి.
గుర్తించిన అక్రమలే అవుట్లు
నర్సీపట్నం డివిజనల్‌లో సుమారు 218.11 ఎకరాల్లో అక్రమలే అవుట్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. నక్కపల్లి మండలంలో 51.96 ఎకరాలు, పాయకరావుపేటలో 119.74 ఎకరాలు, రావికమతం మండలంలో 7.46 ఎకరాలు, ఎస్.రాయవరం మండలంలో 13 ఎకరాలు, కోటవురట్ల మండలంలో 2.93 ఎకరాలు, మాకవరపాలెం మండలంలో 20.16 ఎకరాల్లో అక్రమలేఅవుట్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. వందమంది డెవలపర్స్‌ను దీనికి బాధ్యులను చేశారు. ఆయా పంచాయతీల వారీగా లేఅవుట్లు వేసిన సర్వే నెంబర్లు, డవలపర్స్ పేర్లు, విస్తీర్ణం, ఎన్నిప్లాట్లుగా విభజించారనే వివరాలు సేకరించి విజిలెన్స్ అధికారులకు అందజేసేప్రక్రియ చురుగ్గాసాగుతోంది. అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ఈ లేఅవుట్లను నాలాకింద మార్చి రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించారా లేదా అన్న కోణంలో కూడా విజిలెన్స్ ద్వారా విచారణ చేయించనున్నారు. ప్రభుత్వ చర్యలతో రియల్ ఎస్టేట్‌వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.