సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని తమ వారికి దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం గత ప్రభుత్వం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేసింది. పలు పథకాలకు సంబంధించి కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయాల్సిన అవసరం లేకున్నా, ఆ పద్ధతిలో పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి ఖజానాను కొల్లగొట్టింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం మొదటి దశకు సంబంధించిన 14 ప్యాకేజీల్లో మొత్తం రూ.109.7 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కే రూ.37.76 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూర్చినట్లు తేల్చింది. ఇక గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం మొదటి దశలో ఒక్క 26వ ప్యాకేజీలోనే రూ.46.45 కోట్లను కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టినట్లు స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి రాబట్టడంతో పాటు, ఆ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
సాగునీటి ప్రాజెక్టుల పనులలో కఠినమైన బండరాళ్లను తొలగించేందుకు కంట్రోల్ బ్లాస్టింగ్ (పేలుళ్లు) చేయాల్సి వస్తే, అదనపు నిధులు చెల్లించాలన్న నిబంధన ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానంలో ఎక్కడా లేదు. కానీ ఆ సాకు చూపి అదనపు బిల్లులు చెల్లించడానికి నవంబర్ 25, 2016న గత టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. అదీ అప్పుడు జరుగుతున్న పనులకు కాదు. 2003 నుంచి 2014 దాకా చేసిన పనులతోపాటు, 2014 తర్వాత చేపట్టిన పనులకు కూడా అదనపు బిల్లులు చెల్లించేలా ఉత్తర్వు జారీ చేసింది. కంట్రోల్ బ్లాస్టింగ్ చేసినట్లుగా ఆర్డీవో స్థాయి అధికారి ధ్రువీకరిస్తే చాలని నిబంధన పెట్టింది. ఆ ఉత్తర్వును అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దలు తమ వారికి అదనపు బిల్లుల రూపంలో భారీ ఎత్తున దోచిపెట్టారు.
సీఎం రమేష్‌కు రూ.37.76 కోట్ల అదనపు లబ్ధి
ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ దర్యాప్తు చేసింది. విచారణలో వెలుగుచూసిన అంశాలు..
- కంట్రోల్ బ్లాస్టింగ్ చేయకున్నా చేసినట్లు చూపి కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించినట్లు, డీ వాటరింగ్, పూడిక తీత తీయకున్నా– తీసినట్లుగా చూపించి బిల్లులు చెల్లించారు. నేల స్వభావాన్ని తప్పుగా వర్గీకరించి అదనపు ప్రయోజనాన్ని చేకూర్చారు.
- హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువ (–1.150 కిమీ నుంచి 78.670 కిమీ వరకు) విస్తరణ పనుల్లో సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్టు సంస్థ కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేసిన దాఖలాలు లేవు. కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పని చేసినట్లు ఆర్డీవో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోలేదు. అయినప్పటికీ సీఎం రమేష్‌కు 2018లో రూ.32.72 కోట్లను కట్టబెట్టారు.
- హంద్రీ–నీవా తొలిదశలో 23వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 3.4 కిమీ నుంచి 20 కిమీ వరకు తవ్వకం) పనుల్లో డీ వాటరింగ్, పూడిక తీతను సీఎం రమేష్ సంస్థ చేపట్టలేదు. 2005లో చేసిన ఆ పనులకు 2016లో డీవాటరింగ్.. పూడిక తీశారంటూ అదే ఏడాది రూ.94 లక్షలను ఆ సంస్థకు దోచిపెట్టారు.
- హంద్రీ–నీవా తొలి దశలో 32వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 115 కిమీ నుంచి 176 కిమీ వరకు తవ్వకం) పనులను 2005–2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో సీఎం రమేష్ సంస్థ డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేయలేదు. అయినా సరే 2016లో డీ వాటరింగ్, క్రాస్ బండ్స్ వేసి పనులు చేసినట్లు చూపి రూ.4.1 కోట్లను కట్టబెట్టారు.
గాలేరు–నగరిలో రూ.46.45 కోట్లు...
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 26వ ప్యాకేజీ (ప్రధాన కాలువ 25.067 కిమీ నుంచి 56.775 కిమీ వరకూ) పనులను 2005 నుంచి 2009 మధ్య పూర్తి చేశారు. అప్పట్లో కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో పనులు చేయలేదు. డీ వాటరింగ్ చేయలేదు. అయినా సరే.. కంట్రోల్ బ్లాస్టింగ్, డీ వాటరింగ్ చేసినట్లు చూపి 2017లో కాంట్రాక్టర్‌కు రూ.46.45 కోట్లను దోచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment