సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో బహిర్గతమయ్యాయి. ఏ పనులు ఎవరికి కేటాయించాలో ముందుగానే నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారని, ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించారని పేర్కొంది. రూ.4,057.95 కోట్ల విలువైన నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.751 కోట్లకు పైగా దోపిడీకి పథక రచన జరిగినట్లు విజిలెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది.
నాలుగు రహదారులు... మూడు సంస్థల కుమ్మక్కు
అమరావతిలో నాలుగు రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అంశంలోనూ అంచనాలను ఎలా పెంచాలనే లక్ష్యంతోనే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహరించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. రాజధానిలో 11వ ప్యాకేజీ రహదారి నిర్మాణంలో అంచనాలను రూ.190.86 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ తేల్చింది. 12వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.106.42 కోట్లు, 13వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.195.88 కోట్లు, 14వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.157.74 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ విచారణ నిగ్గు తేల్చింది. ఈ నాలుగు రహదారుల పనులను మూడు కాంట్రాక్టు సంస్థలు కుమ్మకై దక్కించుకున్నాయని, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆ సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను రూపొందించిందని, ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశం లేకుండా నిబంధనలు విధించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది.
విజిలెన్స్ తేల్చిన వాస్తవాలు
– కేవలం అంచనాలను పెంచడం ద్వారానే నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.651 కోట్ల మేర దోపిడీ జరిగింది.
– ఇక అధిక ధరలకు అప్పగించడం ద్వారా మరో రూ.100 కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు.
– ఇప్పటివరకు చేసిన పనుల్లో నిబంధనలను తుంగలోకి తొక్కారు. చేయని పనులకు కూడా అక్రమంగా బిల్లులు చెల్లించారు.
– రాజధాని ప్రాంతం మూడు పంటలు పండే మాగాణి భూమి కాగా రాతి నేల అంటూ లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
– రహదారులకు పక్కన గ్రీనరీ పేరుతో లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
– గ్రీనరీ కోసం మట్టి ఇతర ప్రాంతాల నుంచి తరలించి చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
– పక్కనే అనంతవరంలో క్వారీలు ఉండగా పేరేచర్ల నుంచి గ్రావెల్ తెచ్చినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
– పక్కనే కృష్ణా నదిలో ఇసుక ఉంటే మరోచోట నుంచి తరలించినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
– వరద నీరు, డ్రైనేజీ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
– పవర్ యుటిలిటీ డక్ట్ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment