సాక్షి, అమరావతి: కార్మిక రాజ్యబీమా ఆస్పత్రుల (ఈఎస్‌ఐ)లో ఇకపై డిస్ట్రిబ్యూటర్ల నుంచి మందుల కొనుగోళ్లు చేయకూడదని, ఉత్పత్తి దారుల (మాన్యుఫాక్చరర్స్) నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు చేయడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయడం వల్ల నాసిరకం మందులు సరఫరా అయ్యే అవకాశం ఉండదని, అలా చేస్తే వారిని బాధ్యులు చేయవచ్చునని, పైగా తక్కువ ధరలకే వచ్చే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం.
డిస్ట్రిబ్యూటర్ల నుంచి గానీ, వ్యక్తుల నుంచి గానీ, ఏజెంట్ల నుంచి గానీ కొనుగోలు చేస్తే నాసిరకం మందులు సరఫరా అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాంటి వారి నుంచి కొనుగోలు చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఉత్పత్తి దారుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఈఎస్‌ఐ అధికారులు మాత్రం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నేడో రేపో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక
రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.300 కోట్ల వరకు మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో గత మూడు మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేశారు. విచారణ పూర్తికావడంతో త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. కొంతమంది అధికారులతో పాటు ఒకరిద్దరు ప్రముఖ కాంట్రాక్టర్లు, తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి కొడుకు మందుల కొనుగోళ్ల అవినీతిలో కీలక పాత్ర పోషించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది.
మంత్రి కొడుకు చిన్న చిన్న స్లిప్పుల్లో సంతకాలు చేసి ఇచ్చినా కూడా దాని ఆధారంగా నామినేషన్ కింద మందులు సరఫరా చేశారని వెల్లడైంది. వంద రూపాయల సరుకు సరఫరా చేస్తే, వెయ్యి రూపాయలకు చేసినట్టు చూపించారు. పైగా రూపాయి మాత్రను పది రూపాయల రేటుకు కొనుగోలు చేసినట్టు కూడా విచారణాధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. ఇదిలా ఉండగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలపై తెలంగాణ ఏసీబీ అధికారులు బుధవారం ఏపీ ఈఎస్‌ఐ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ల పాత్ర ఇక్కడ కూడా ఉండటంతో విచారణలో భాగంగా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది.
డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోళ్లు వద్దు
Published Thu, Jan 30 2020 3:56 AM | Last Updated on Thu, Jan 30 2020 3:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment