అవినీతి కూపం!
జీహెచ్‌ఎంసీలో పెరుగుతున్న అక్రమాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది
లంచాలతో అక్రమంగా ఆస్తుల బదిలీ
తాజాగా విజిలెన్స్ విచారణలో వెల్లడి
పోలీసు కేసు నమోదు
సిటీబ్యూరో: సినిమాలు.. కామెడీ సీన్లలో జరిగినట్లుగానే ఘనత వహించిన జీహెచ్‌ఎంసీలో ఇలాంటి అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. అడపాదడపా బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తగిన విచారణ జరిపితే ఒకటో, అరో వెలుగు చూస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులపై చర్యలు లేకపోవడంతో వారు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కిందిస్థాయిలోని ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అక్రమాల కారణంగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. విచారణలో నిజాలు వెలుగు చూసినప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. కొంతకాలం గడిచాక తిరిగి వారు మళ్లీ ఏదో ఒక సర్కిల్‌లో విధుల్లో చేరుతూ అక్రమాల పరంపరను కొనసాగిసున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ పరిధిలోని ఒక భవన యజమాని పేరునే మార్చిన ఘటన(తప్పుడు మ్యుటేషన్)తో జీహెచ్‌ఎంసీలో అక్రమాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అయిన ఘటనలు మరువకముందే ఈ ఘటన వెలుగు చూసింది.
అన్ని విభాగాల్లోనూ...
టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి బహిరంగంగా కనిపిస్తుండగా, ఇంజినీరింగ్‌లో చేయని పనులకు బిల్లులు, నాణ్యత లోపాలతో అవినీతి వెల్లడవుతోంది. రవాణా విభాగంలో డీజిల్, వాహన విడిభాగాల్లో అక్రమాలు చోటుచేసుకుంటుండగా..ఆస్తిపన్ను వసూళ్లు, మ్యుటేషన్ పనులు చేసే ట్యాక్స్ సెక్షన్‌లో ఊహించని విధంగా అవినీతి జరుగుతోంది. ఆస్తిపన్ను తక్కువ అసెస్ చేసేందుకు ఒకరేటు.. చేయి తడపకపోతే ఎక్కువ ఆస్తిపన్ను విధిస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ మరో రేటు వంతున వసూలు చేస్తున్నారు. ఇలా విచ్చలవిడిగా సంపాదించిన ఆదాయంతో ఆర్థికసంవత్సరం ఆఖరినెల మార్చి ముగిశాక జల్సాలు, విలాసాలు, విదేశీయాత్రలు సంప్రదాయంగా మారాయి.
ఔట్‌సోర్సింగ్ అంటే పండగే..
ఎక్కడైనా ఔట్‌సోర్సింగ్ అంటే డిమాండ్ ఉంటుందో ఉండదోకానీ జీహెచ్‌ఎంసీలో మాత్రం పండగే. ఎందుకంటే పేరుకు ఔట్‌సోర్సింగ్ అయినా అధికారులు చేయాల్సిన పనులన్నీ దాదాపుగా ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లే నిర్వహిస్తుంటారు. అధికారుల పని ఒత్తిడి వల్ల కావచ్చు. ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు వారి డిజిటల్ కీలు, పాస్‌వర్డ్‌లు సైతం ఆపరేటర్లకప్పగించి పనులు చేయిస్తున్న అధికారులు తక్కువేమీ లేరు. దీంతో ఆపరేటర్లు ఆడింది ఆట..పాడింది పాటగా కొనసాగుతోంది. ఔట్‌సోర్సింగ్‌పై పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం గతంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో ఎక్కువగా జరిగేది.
ప్రస్తుతం అది అన్ని విభాగాలకూ వ్యాపించింది. ఆస్తిపన్నును ఆన్‌లైన్‌లో తక్కువ చేసేందుకు బిల్ కలెక్టర్లు, ఆపరేటర్లు కుమ్మక్కై జీహెచ్‌ఎంసీ ఖజానాను ముంచుతున్నారని గుర్తించి రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతల్ని సీజీజీకి అప్పగించారు. అయినప్పటికీ అక్రమార్కుల అవినీతి దందా ఆగడం లేదు. ఉన్నతాధికారుల సహకారం, సమన్వయంలతో ఈ అవినీతికి పాల్పడుతున్నవారు కొందరైతే, ఆన్‌లైన్‌లో డేటా మార్చి లంచాలకు పాల్పడుతున్నవారు మరికొందరు.