హరిహరా..ఇదేం గ‘లీజు’! | Harihara Kalabhavan Complex in Rental Shops Affair | Sakshi
Sakshi News home page

హరిహరా..ఇదేం గ‘లీజు’!

Published Sun, Jun 28 2015 11:57 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Harihara Kalabhavan Complex in Rental Shops Affair

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ కాంప్లెక్స్ షాపుల అద్దె వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుంటోంది. కొందరు అక్రమార్కులు గ‘లీజు’ దందా నడిపిస్తూ భవన్ అద్దెకు ఎసరుపెడుతున్నారు. అధికారుల అండదండలతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి కొంత మంది కళాభవన్ కాంప్లెక్స్‌లోని షాపుల్లో తిష్టవేసి జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండికొడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
 
సబ్ లీజుల దందా
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో 1989 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో హరిహర కళాభ వన్‌ను నిర్మించారు. భవన్ కింద మొత్తం 16 షాపులు ఉన్నాయి. వీటిని అప్పట్లోనే జీహెచ్‌ఎంసీ అద్దె ప్రాతిపదికన కొందరికి కేటాయించింది. నాటి నుంచి నేటి వరకు కేవలం కొంత మందే ఇందులో తిష్టవేశారు. నిబంధనల ప్రకారం కేవలం రెండు లేదా మూడేళ్ల ప్రాతిపదికన అద్దెకు ఇచ్చి తిరిగి బహిరంగ టెండర్లు పిలవాల్సి ఉన్నా అధికారులు విస్మరించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు నామమాత్రపు అద్దెతో కొంతమంది కొనసాగుతున్నారు. చాలా మంది యజమానులు తమ షాపులను ఇతరులకు సబ్‌లీజుకు ఇచ్చారు. సగానికిపైగా షాపులు సబ్‌లీజుకు నడుస్తున్నాయి. అసలైన యజమానులు కేవలం రూ.8 నుంచి రూ.10 వేలు మాత్రమే జీహెచ్‌ఎంసీకి అద్దె రూపంలో చెల్లిస్తూ వారు మాత్రం సబ్‌లీజుల ద్వారారూ.25-రూ.30 వేలు సంపాదిస్తున్నారు. అడ్వాన్సు కింద రూ.3 నుంచి రూ.10 లక్షలు తీసుకుంటున్నారు. ఇది అధికారులకు తెలిసి నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి.  
 
నిబంధనలు గాలికి...
ఇక జీహెచ్‌ఎంసీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లను ఎలాంటి సంస్థలకు ఇవ్వాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో వైన్ షాపులకు అనుమతి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ కొద్ది సంవత్సరాల నుంచి వైన్‌షాప్ కొనసాగుతోంది. అలాగే మెస్, బేకరీ, టిఫిన్ సెంటర్లకూ అనుమతి ఇవ్వకూడదు. కానీ దీన్నీ అతిక్రమించారు. ఇవన్నీ సబ్ లీజులతో కొనసాగుతున్నాయి.
 ఎస్టేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం
 -ఉప కమిషనర్ విజయరాజు

 
హరిహర కళాభవన్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను ఎస్టేట్ అధికారులు చూస్తారని ఉపకమిషనర్ విజయరాజు అన్నారు. అక్కడి సబ్‌లీజుల అక్రమాలను ఎస్టేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement