అవి అక్రమ నిర్మాణాలే.. కూల్చేయండి..
♦ ఎమ్మెల్యే వివేకానంద భారీ భవన సముదాయాలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం
♦ భవనంలోని కాలేజీని ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కుత్బుల్లాపూర్ లో సర్వే నంబర్ 79 నుంచి 82 వరకు గల స్థలంలో వారు నిర్మించిన భారీ వాణిజ్య సముదాయాలు అక్రమ కట్టడాలని తేల్చింది. అనుమతులూ తీసుకోకుండా, సెట్‌బ్యాక్‌లు వదలకుండా, పార్కింగ్ ఏర్పాట్లు చేయకుండా చేసిన ఈ నిర్మాణాల్ని కూల్చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. అలాగే ఈ అక్రమ కట్టడంలో కాలేజీని జూన్ 1కల్లా ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజ మాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.
నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం కల్పించి, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే అక్రమ కట్టడాల కూల్చివేతపై ఓ నివేదికను ఫొటోలతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్‌కు జూన్ 15కల్లా సమర్పించాలని గ్రేటర్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. వివేక్, ఆయన కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్‌లో భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, వీటికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకోలేదని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు జారీ చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్ హైకోర్టులో గత ఏడాది ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇలాగైతే నగరాభివృద్ధి సాధ్యమా?
ఎమ్మెల్యే వివేక్, ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి వీల్లేదని, ఇటువంటి అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తే ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి ఎన్నటికీ సాధ్యం కాదని న్యాయమూర్తి తన తీర్పులో తేల్చిచెప్పారు. నిర్మాణాల విషయంలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు అన్నీ తెలిసే అనుమతి పొందిన ప్లాన్లకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను కొనసాగించారన్నారు.
అధికారుల అవినీతి, నిర్లక్ష్యమే కారణం..
‘వివేక్, ఆయన కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గానీ, కిందిస్థాయి అధికారులుగానీ స్పందించ లేదు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం, సోమరితనం, బిల్డర్లతో భాగస్వామ్యం.. ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధిని నాశనం చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకొస్తున్న క్రమబద్ధీకరణ పథకాల వల్ల బిల్డర్లు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఈ పథకాలు అక్రమ నిర్మాణదారుల్లో తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి’ అని జస్టిస్ నాగార్జునరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. అక్రమ కట్టడమని తెలిసి కూడా అందులో విద్యా సంస్థను నిర్వహిస్తున్న నారాయణ యాజమాన్యం తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. ఉభయ రాష్ట్రా ల్లో భారీ స్థాయిలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న సదరు యాజమాన్యానికి అక్రమ కట్టడాల్లో విద్యా సంస్థలను నిర్వహించరాదన్న సామాజిక, నైతిక బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ఈ కేసులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ ఉల్లంఘన యాధృ చ్ఛికంగా జరగలేదు. ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. సామాన్య పౌరుడు అజ్ఞానం వల్ల చేసిన ఉల్లంఘనలకు క్షమాపణ కోరితే అర్థం ఉంది. కానీ చట్టాల గురించి తెలిసిన ఓ శాసనసభ్యుడే చట్టాన్ని ఉల్లంఘించి, తన హోదా ద్వారా ఆ ఉల్లంఘనల నుంచి తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు..?
- జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి