MLA Vivekananda
-
‘కూన’పై ఎమ్మెల్యే వివేకానంద దాడి
కుత్బుల్లాపూర్: ఓ టీవీ చానల్ ఏర్పాటు చేసిన చర్చా వేదిక రసాభాసగా మారింది. కుత్బుల్లా పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యలను లేవనెత్తుతూ ఓ టీవీ చానల్ సూరారం రామ్ లీలా మైదానంలో బుధవారం బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ వేదికలో భూకబ్జాల విషయంపై బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఎమ్మెల్యే వివేకానంద మధ్య వాడి వేడిగా చర్చ జరగ్గా, ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ పై దాడి చేసి గొంతు పట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇదే చర్చావేదికలో కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి కూడా ఉన్నారు. కాగా, ఎమ్మెల్యే వివేకానంద బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్‌పై దాడి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. -
అవి అక్రమ నిర్మాణాలే.. కూల్చేయండి..
♦ ఎమ్మెల్యే వివేకానంద భారీ భవన సముదాయాలపై జీహెచ్ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం ♦ భవనంలోని కాలేజీని ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. కుత్బుల్లాపూర్ లో సర్వే నంబర్ 79 నుంచి 82 వరకు గల స్థలంలో వారు నిర్మించిన భారీ వాణిజ్య సముదాయాలు అక్రమ కట్టడాలని తేల్చింది. అనుమతులూ తీసుకోకుండా, సెట్బ్యాక్లు వదలకుండా, పార్కింగ్ ఏర్పాట్లు చేయకుండా చేసిన ఈ నిర్మాణాల్ని కూల్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. అలాగే ఈ అక్రమ కట్టడంలో కాలేజీని జూన్ 1కల్లా ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజ మాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం కల్పించి, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే అక్రమ కట్టడాల కూల్చివేతపై ఓ నివేదికను ఫొటోలతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్‌కు జూన్ 15కల్లా సమర్పించాలని గ్రేటర్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. వివేక్, ఆయన కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్‌లో భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, వీటికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోలేదని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు జారీ చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్ హైకోర్టులో గత ఏడాది ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగైతే నగరాభివృద్ధి సాధ్యమా? ఎమ్మెల్యే వివేక్, ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి వీల్లేదని, ఇటువంటి అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తే ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి ఎన్నటికీ సాధ్యం కాదని న్యాయమూర్తి తన తీర్పులో తేల్చిచెప్పారు. నిర్మాణాల విషయంలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు అన్నీ తెలిసే అనుమతి పొందిన ప్లాన్లకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను కొనసాగించారన్నారు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యమే కారణం.. ‘వివేక్, ఆయన కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గానీ, కిందిస్థాయి అధికారులుగానీ స్పందించ లేదు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం, సోమరితనం, బిల్డర్లతో భాగస్వామ్యం.. ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధిని నాశనం చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకొస్తున్న క్రమబద్ధీకరణ పథకాల వల్ల బిల్డర్లు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఈ పథకాలు అక్రమ నిర్మాణదారుల్లో తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి’ అని జస్టిస్ నాగార్జునరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. అక్రమ కట్టడమని తెలిసి కూడా అందులో విద్యా సంస్థను నిర్వహిస్తున్న నారాయణ యాజమాన్యం తీరును న్యాయమూర్తి తప్పుపట్టారు. ఉభయ రాష్ట్రా ల్లో భారీ స్థాయిలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న సదరు యాజమాన్యానికి అక్రమ కట్టడాల్లో విద్యా సంస్థలను నిర్వహించరాదన్న సామాజిక, నైతిక బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ ఉల్లంఘన యాధృ చ్ఛికంగా జరగలేదు. ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. సామాన్య పౌరుడు అజ్ఞానం వల్ల చేసిన ఉల్లంఘనలకు క్షమాపణ కోరితే అర్థం ఉంది. కానీ చట్టాల గురించి తెలిసిన ఓ శాసనసభ్యుడే చట్టాన్ని ఉల్లంఘించి, తన హోదా ద్వారా ఆ ఉల్లంఘనల నుంచి తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు..? - జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి -
ఎమ్మెల్యేగా ఉండీ చట్టవిరుద్ధమైన పనులా?
♦ ప్రజాప్రతినిధే ఇలా చేస్తే సామాన్యుల సంగతేమిటి? ♦ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేపై హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానందపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టసభలో సభ్యునిగా ఉంటూ చట్ట విరుద్ధమైన పనులు చేయడం ఎంత వరకు సబబని ఆయన్ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధే ఇలా అక్రమ నిర్మాణం చేస్తే, ఇక సామాన్యుల సంగతేమిటని నిలదీసింది. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ అధికారులపైనా హైకోర్టు మండిపడింది. అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించింది. వివేకానంద, ఆయన కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణంపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధంగా భారీ వాణిజ్య సముదాయం నిర్మించారని, దీనిపై అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు, కాంగ్రెస్ నేత కె.ఎం.ప్రతాప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే వివేక్, అతని భార్య కె.సౌజన్య, తల్లి కె.పి.శ్యామలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ నాగార్జునరెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, వివేక్, అతని కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్ గ్రామంలోని 208, 209, 211, 212 సర్వే నంబర్లలో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారని, ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి తగిన అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. పార్కింగ్ కోసం సెల్లార్ నిర్మించలేదని, సెట్ బ్యాక్‌లు కూడా వదల్లేదన్నారు. గృహ నిర్మాణం కోసం దరఖాస్తుచేసుకొని, దానిపై అనుమతులు పొందారని, ఇప్పుడు వాణిజ్య సముదాయాన్ని నిర్మించారని తెలిపారు. తద్వారా ఫీజుల కింద చెల్లించాల్సిన రూ.60 లక్షలను ఎగవేశారని వివరించారు. అంతే కాక ఆ భవనాన్ని ఓ విద్యా సంస్థకు సైతం లీజుకిచ్చారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఎమ్మెల్యేగా ఉంటూ ఈ విధంగా అక్రమ నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపదలచుకున్నారని వివేక్‌ను ప్రశ్నించారు. చట్టసభలో సభ్యునిగా ఉంటూ ఇటువంటి చట్ట విరుద్ధమైన పనులు చేపట్టడం ఎంత వరకు సబబన్న న్యాయమూర్తి, ఎమ్మెల్యేనే ఇలా చేస్తుంటే ఇక సామాన్యుడు ఇలాంటివి చేయడంలో ఆశ్చర్యమేముందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. చట్ట విరుద్ధంగా జరిగిన ఈ నిర్మాణం విషయంలో బాధ్యులపైన, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తప్పవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తరఫు న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, రాజకీయ కారణాలతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశారని వివరించారు.