ఎమ్మెల్యేగా ఉండీ చట్టవిరుద్ధమైన పనులా?
♦ ప్రజాప్రతినిధే ఇలా చేస్తే సామాన్యుల సంగతేమిటి?
♦ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేపై హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానందపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టసభలో సభ్యునిగా ఉంటూ చట్ట విరుద్ధమైన పనులు చేయడం ఎంత వరకు సబబని ఆయన్ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధే ఇలా అక్రమ నిర్మాణం చేస్తే, ఇక సామాన్యుల సంగతేమిటని నిలదీసింది. ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ అధికారులపైనా హైకోర్టు మండిపడింది. అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించింది. వివేకానంద, ఆయన కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణంపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే వివేకానంద్ జీహెచ్‌ఎంసీ చట్టానికి విరుద్ధంగా భారీ వాణిజ్య సముదాయం నిర్మించారని, దీనిపై అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారంటూ వివేక్ సమీప బంధువు, కాంగ్రెస్ నేత కె.ఎం.ప్రతాప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎమ్మెల్యే వివేక్, అతని భార్య కె.సౌజన్య, తల్లి కె.పి.శ్యామలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ నాగార్జునరెడ్డి విచారించారు.
పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, వివేక్, అతని కుటుంబ సభ్యులు కుత్బుల్లాపూర్ గ్రామంలోని 208, 209, 211, 212 సర్వే నంబర్లలో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారని, ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి తగిన అనుమతులు కూడా తీసుకోలేదని వివరించారు. పార్కింగ్ కోసం సెల్లార్ నిర్మించలేదని, సెట్ బ్యాక్‌లు కూడా వదల్లేదన్నారు. గృహ నిర్మాణం కోసం దరఖాస్తుచేసుకొని, దానిపై అనుమతులు పొందారని, ఇప్పుడు వాణిజ్య సముదాయాన్ని నిర్మించారని తెలిపారు. తద్వారా ఫీజుల కింద చెల్లించాల్సిన రూ.60 లక్షలను ఎగవేశారని వివరించారు.
అంతే కాక ఆ భవనాన్ని ఓ విద్యా సంస్థకు సైతం లీజుకిచ్చారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఎమ్మెల్యేగా ఉంటూ ఈ విధంగా అక్రమ నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపదలచుకున్నారని వివేక్‌ను ప్రశ్నించారు. చట్టసభలో సభ్యునిగా ఉంటూ ఇటువంటి చట్ట విరుద్ధమైన పనులు చేపట్టడం ఎంత వరకు సబబన్న న్యాయమూర్తి, ఎమ్మెల్యేనే ఇలా చేస్తుంటే ఇక సామాన్యుడు ఇలాంటివి చేయడంలో ఆశ్చర్యమేముందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. చట్ట విరుద్ధంగా జరిగిన ఈ నిర్మాణం విషయంలో బాధ్యులపైన, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తప్పవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తరఫు న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, రాజకీయ కారణాలతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశారని వివరించారు.