
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పెచ్చరిల్లిన అవినీతి అవినీతి అధికారుల జేబులు నింపుతోందని కాగ్ నివేదిక సాక్షిగా తేలింది. 2012–2017 కాలానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో మచ్చుకు 75,387 ఇళ్లను తనిఖీ చేసిన కాగ్, అతిక్రమణల స్థాయి చూసి అవాక్కైంది. ఏకంగా 30,864 ఇళ్ల నిర్మాణంలో అతిక్రమణలు బయటపడ్డాయి. అంతేకాదు, వీటిలో 10,460 అక్రమ నిర్మాణాలేనని కూడా తేలింది! అలాగే జీహెచ్‌ఎంసీ సిబ్బందిలో కొందరు ఆస్తి పన్ను మదింపులో చేతివాటం ప్రదర్శించి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలకూ కాగ్ నివేదిక బలం చేకూర్చింది.
708 కట్టడాలను పరిశీలించగా, రూ.5.24 కోట్ల మేర ఆస్తి పన్ను తక్కువగా మదింపు చేసినట్టు కాగ్ గుర్తించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ సమయంలో పన్ను చెల్లించేప్పుడు కూడా ఇలాంటి మతలబులే చోటుచేసుకుంటున్నట్టు తేలింది. ఆయా భవనాల విస్తీర్ణం టౌన్ ప్లానింగ్‌లోని వివరాలకు, ఆస్తి పన్ను మదింపులోని వివరాలకు చాలా తేడా ఉంది. ఆరు సర్కిళ్ల పరిధిలో కేవలం 287 నిర్మాణాలను పరిశీలించగా రూ.1.25 కోట్ల మేర పన్ను తక్కువగా చెల్లించినట్టు తేలింది.
పదేళ్లలో 26 చెరువుల్ని మింగారు
జీహెచ్‌ఎంసీ ఆవిర్భవించే నాటికి (2007) దాని పరిధిలో 185 చెరువులుండగా వాటిలో 26 చెరువులు ఇప్పుడు ‘కనపడుట లేదు’. మిగతా వాటిలోనూ 17 చెరువులు ఎక్కడుండాలో కూడా జాడ కనుక్కోలేని దుస్థితి ఉందని కాగ్ తేల్చింది! మరో 9 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని జీహెచ్‌ఎంసీ నివేదిక ఆధారంగా కాగ్ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment