కాంగ్రెస్ పాలనంతా అవినీతే
బీజేపీ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ ధ్వజం
భట్లపెనుమర్రులో తిరంగా ర్యాలీ
భట్లపెనుమర్రు(కూచిపూడి):
జాతీయభావం అవినీతిని అంతమొందిస్తుందని అయితే కాంగ్రెస్ పాలనలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరగటంతో దేశంలో జాతీయభావం ఏస్థాయిలో ఉందో అర్థమవుతుందని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థనాథ్‌సింగ్ అన్నారు. మొవ్వ మండలం భట్లపెనుమర్రులో సోమవారం బిజెపి తిరంగ ర్యాలీ నిర్వహించారు. పింగళి వెంకయ్య స్మారక భవనంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ 62 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశంలో అవినీతి, లంచగొండితనం పెచ్చుపెరిగి, అసాంఘిక శక్తులు విజృంభించాయన్నారు. మజ్లిస్ పార్టీ వంటి స్వార్థ రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ మద్దతు పలికిందన్నారు. ఏపీని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ప్రకటించాలని డిమాండు చేయడం హాస్యాస్పదమన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు ప్రధానమంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. పోలవం ప్రాజెక్టుకు ఆర్థిక సాయానికి తాను, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.