పాడికి ని'బంధనాలు'
ఎస్సీ కార్పొరేషన్ వింత పోకడ
→ ఆవుల కొనుగోలుకు రుణాలు ఇస్తూనే షరతులు
→ కర్ణాటకలో మాత్రమే కొనాలని మెలిక
→ ఆందోళనలో లబ్ధిదారులు
తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన గార్లదిన్నె నరసింహులు సంకర జాతి ఆవులు కొనేందుకు (ఐడీ నంబరు 20150585923) గత నెల 8న ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష మంజూరైంది. అయితే ఆవులను కర్ణాటకలో కొనుగోలు చేయాలని, ఆవును అమ్మిన రైతు ఆధార్ పొందుపర్చాలని అధికారులు షరతులు పెట్టారు. తనకు నచ్చిన చోట సంకర జాతి ఆవుల్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నా అధికారులు అంగీకరించలేదు. దీంతో నరసింహులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇది నరసింహులు ఒక్కడి పరిస్థితే కాదు. పాడి ఆవుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులందరిదీ ఇదే పరిస్థితి.
అనంతపురం అర్బన్ : ప్రభుత్వం దళితుల అభ్యున్నతే ధ్యేయమని చెప్తూనే ఆవర్గాలకు రుణాల మంజూరులో ని‘బంధనాలు’ విధిస్తోంది. దీంతో పాడిపోషణతో కుటుంబాన్ని పోషించుకునే దళిత వర్గాలకు ఎస్సీకార్పొరేషన్ ద్వారా సంకర జాతి పాడి ఆవుల్ని కొనుగోలు చేసేందుకు రుణం ఇస్తూనే షరతులు విధిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
పాడి ఆవుల్ని కొనేందుకు రూ.లక్ష రుణం మంజూరు చేస్తున్నారు. ఇందులో రూ.60 వేలు సబ్సిడీ, రూ.40 వేలు బ్యాంక్ రుణం. మొత్తం రూ.లక్షతో సంకర జాతి ఆవుల్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలంటూ ఎస్సీ కార్పొరేషన్ మెలిక పెట్టింది. సంకర జాతి ఆవులు లేదా గేదెలు (బర్రె) తప్పనిసరిగా కర్ణాటకలోనే కొనుగోలు చేయాలని షరతు పెడుతోంది. ఆవుల్ని అమ్మిన రైతు ఆధార్ తప్పనిసరిగా పొందపర్చాలనే నిబంధన పెట్టడంతో ఇవి లబ్ధిదారుల పాలిట కంటకంగా మారాయి. మంజూరైన రుణంతో తమకు నచ్చిన చోట సంకర జాతి ఆవుల్ని లేదా ఎనుములను కొనుగోలు చేసుకునే స్వేచ్ఛలేకుండా చేసింది. దూర ప్రాంతాల నుంచి ఆవుల్ని కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చుకునేందుకు రవాణా ఖర్చు తడిసిమోపెడవుతాయని వాపోతున్నారు.
ఒక రకంగా లబ్ధిదారుడికి ఇది అదనపు భారమే అవుతోంది. ఇలాంటి షరతులతో రుణం మంజూరైనా యూనిట్లు నెలకొల్పలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. కర్ణాటకలోనే ఆవుల్ని కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించి, నచ్చిన చోట కొనుగోలు చేసుకునే సౌలభ్యం కల్పించాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.
కర్ణాటకలో కొనుగోలు చేయాలనేది పాలసీ : – రాము నాయక్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణంతో ఆవులు, గేదెలను కర్ణాటకలో కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఇదే విషయంపై ఇటీవల సంస్థ ఎండీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. అది ప్రభుత్వ పాలసీ అని ఆయన చెప్పారు.