‘నీరు–చెట్టు’ నేతలకు దోచిపెట్టు
అధికారపార్టీ నేతలకు కాసులు కురిపిస్తున్న పథకం
వంకల్లో, వాగుల్లో ఇష్టారాజ్యంగా పనులు
పాత పనులకు కొత్త సోకులు
పథకం: నీరు–చెట్టు
జిల్లా: అనంతపురం
మంజూరైన పనులు:1,882
తీయాల్సిన పూడికతీత:–3,90,379 క్యూబిక్ మీటర్లు
పరిపాలన అనుమతి : రూ.12,806 లక్షలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీరు–చెట్టు’ లక్ష్యం ఒకటైతే పాలకులు లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తూ నిధులు దోచుకునేందుకు వినియోగించుకుంటున్నారు. చెరువులు, వంకలను అభివద్ధి చేసి, భూగర్భజలాలను పెంపొందింపజేసేందుకు ప్రభుత్వం ‘నీరు–చెట్టు’ ప్రవేశపెట్టింది. కానీ ఆచరణలో టీడీపీ నాయకులకు కాసుల పంటగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పథకం కాస్త మరో పనికి ఆహార పథకంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.
నీరు– చెట్టు కార్యక్రమం కింద ఇటీవల చెరువులు, కుంటల్లో పూడిక తీత పనులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,882 పనులకు గాను ప్రభుత్వం రూ. 12,806 లక్షలు మంజూరు చేసింది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాత గుంతలను చదును చేసి, కొత్త గుంతలుగా మెరుగులు దిద్దుతున్నారు. నీరు– చెట్టు కింద జరుగుతున్న పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వల్ల భూగర్భ జలాలు వద్ధి చెంది, బోరుబావుల్లో నీరు ఉబికి వస్తుందని రైతులు భావించారు. అయితే రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం టీడీపీ కార్యకర్తల లబ్ధికోసమే ఈ పనులు అన్నట్లుగా ‘పథకం’ అమలవుతోంది. పాత గుంతలను చదును చేసి, కొత్తగా తవ్వినట్లు రికార్డులు సష్టించి బిల్లులు స్వాహా చేస్తున్నారు.
ధర్మవరం మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ధర్మవరం మండల పరిధిలోని సుబ్బరావుపేట పంచాయతీకి–2, నేలకోట–7, చిగిచెర్ల–29, కుణుతూరు–19, ఏలుకుంట్ల–8, గొట్లూరు–22, రావులచెరువు–14, మల్లాకాల్వ–9, రేగాటిపల్లి–2, దర్శినమల–15, పోతులనాగేపల్లి–16, తుమ్మలలో–4 పనులు చేపడుతున్నారు. మొత్తం మండల వ్యాప్తంగా ఉన్న 147 పనులకు గాను రూ. 887.39 లక్షలకు పరిపాలనా అనుమతులు లభించాయి.
వీటిలో అధిక శాతం పనులను టీడీపీ మండల నేత ఒకరు గుడ్‌విల్ ఇచ్చి కొనుగోలు చేశారు. ఫైనాన్స్ పర్సన్‌గా గుర్తింపు పొందిన ఆయన పని ప్రారంభించే ముందు గుడ్ విల్ ఇస్తుండడం, గత ప్రభుత్వ హయాంలో సదరు నేతను పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారన్న సానుభూతితో పనులన్నీ ఆయనొక్కడే ఇష్టారాజ్యంగా చేస్తున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలు టీడీపీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. ‘గుడ్‌విల్ ఇంత.. అధికారులకు కొంత’ అన్న రీతిలో ధర్మవరంలో 40 శాతానికి పైగా పనులు ఆయనే చేస్తున్నాడు.
ఇదిగో సాక్ష్యం
ఫొటో: 23డిఎంఎం 01 – ఈ ఫొటోలో కనిపిస్తున్నది ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి చెరువులో పూడిక తీసిన ప్రాంతం. సమీపంలోనేlఉన్న నేషనల్ హైవే వేసేటప్పుడు ఇక్కడి నుంచి మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి తరలించారు. అప్పుడు పడిన గుంతలను తమకు అనుకూలంగా మార్చుకొని, నీరు–చెట్టు పథకం కింద నిధులు కాజేసేందుకు చేసిన సోకులివి. ఈ పని చేసేందుకు ప్రభుత్వం రూ.7.45 లక్షలు, ఇదే చెరువులో మరో ప్రాంతంలో పూడిక తీసేందుకు రూ. 4.85 లక్షలు మొత్తం రూ.12.20 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ చెరువు పూడిక తీత పనులు కామిరెడ్డిపల్లికి చెందిన అధికార పార్టీ నేతలకు అప్పగించారు. అయితే ఆ పనులను ధర్మవరం మండల కీలక నేత,S సర్పంచ్‌గా టీడీపీ పోటీ చేసి ఓడిపోయిన ఆయన గుడ్‌విల్ కింద తీసుకుని పనులు చేశాడు. సదరు నేత ఆ పనులకు కేటాయించిన నిధుల్లో 30 శాతం కూడా ఖర్చు చేయలేదు.
క్యూబిక్ మీటర్‌కు ఎంత ఇస్తారంటే...
చెరువులు, కుంటల్లో తీసిన మట్టికి క్యూబిక్ మీటర్‌కు రూ.24 నుంచి రూ.29లు చెల్లిస్తారు. అదే జంగిల్ క్లియరెన్స్‌తో(ముళ్ల పొదలను తొలగించి మట్టిని తీస్తే) అయితే రూ. 41 చెల్లిస్తారు. తీసిన మట్టిని కిలో మీటర్ లోపు ట్రాక్టర్‌తో తోలితే రూ.85, రెండు కిలో మీటర్ల దూరం అయితే 93, అలాగే మూడు కిలో మీటర్లు ఆపై ఎంత దూరం వున్నా రూ.105 ప్రభుత్వం చెల్లిస్తుంది.
మట్టిని ఎక్కడికి తీసుకురావాలంటే
అధికారులు సూచించిన మేరకు (ఎస్టిమేట్ ఆధారంగా) మట్టిని వేయాలి. గ్రామాల్లోని గుంతలు పడిన రహదారికి లేదా గ్రామాల్లో ఉన్న ప్రమాదభరితంగా ఉన్న పాడుబడిన బావులు, రైతుల పొలాలకు మట్టిని తోలాల్సి ఉంది. అదే విధంగా చెక్ డ్యాంలలో అయితే గట్టుపైకి మట్టిని వేయాలి. కేవలం డ్యాంలో మధ్య భాగాన వున్న మట్టిని మాత్రమే వాహనాల ద్వారా తోలాల్సి ఉంటుంది.
బాగున్న రహదారులకు చౌడుమట్టి తరలింపు :
గ్రామాల్లో ఇది వరకు బాగా ఉన్న మట్టిరోడ్లకు చౌడుమట్టి, బంకమట్టి, రాళ్లతో కూడిన మట్టిని తోలుతున్నారు. దీంతో రహదారులు పాడవుతున్నాయి. ఇలాంటి మట్టిని వద్దన్నా గ్రామాల్లోని కాలనీలో తోలుతుండడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక వాహన దారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అధికారులు మట్టిని తోలమని ఆదేశించకున్నా బిల్లుల కోసం మట్టిని తోలుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ :– ఈ పథకం అమలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఒక్కో అధికారి పరిధి కిందకు అధిక సంఖ్యలో పనులు రావడం, ఇరిగేషన్ శాఖలో ఉన్న అధిక ఖాళీలు టీడీపీ నాయకుల దోపిడీకి మార్గం సుగమమవుతోంది.