పత్తికి ప్రాణం పోసిన వర్షం
పత్తికి ప్రాణం పోసిన వర్షం
Published Sun, Aug 28 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
నాలుగు రోజుల్లో మండలంలో 13 సెంమీ వర్షం
అన్నదాతల్లో ఆనందం
నరసరావుపేట రూరల్: అల్పపీడన ద్రోణి కారణంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు పత్తి పంటకు ప్రాణం పోశాయి. దాదాపు 50రోజులుగా చినుకు జాడ లేక పత్తి పంట ఎండుముఖం పట్టింది, అటువంటి సమయంలో కురిసిన వర్షంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. శనివారం సాయంత్రం నుంచి మండలంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 9.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మండలంలో ఇదే అత్యధిక వర్షపాతం. గత నాలుగు రోజులుగా 13.6 సెం.మీ వర్షం మండలంలో కురిసింది. దీంతో పత్తి పొలాల్లో సైతం నీరు నిలిచింది. వరుణుడి జాడ లేకపోవడంతో పంట ఎండిపోతుండటంతో పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇప్పటి వరకు రైతులు ముందుకు రాలేదు. పత్తి పంటకు సరిపోయే వర్షం పడటంతో బలం మందులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కురిసిన వర్షం మరో 20రోజుల వరకు పత్తి పంటను కాపాడుతుందని రైతులు తెలిపారు. ఈ వర్షం 15రోజుల క్రితం కురిస్తే పత్తి రైతులకు ఇంకా ఉపయోగకరంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement