
పోటెత్తిన పత్తి
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం భారీగా పత్తి అమ్మకానికి వచ్చింది. సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి దాదాపు 500 వాహనాల్లో, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే యూర్డులోకి 25 వేల బస్తాల పత్తి వచ్చింది. శని, ఆదివారాలు సీసీఐకు సెలవు దినాలు కావడం, వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో వర్షాలు పడితే సరుకును ఇళ్లలో నిల్వ ఉంచుకోలేక, తడిసి పోతుందనే ఆలోచన తో రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు.
యూర్డు లోపలా.. బయటా రైతులు కూడా బారులుదీరారు. పాసింగ్ సమయం అయిపోయిన తర్వాత కూడా దాదాపు 100 పత్తి వాహనాలు నిలిచిపోయాయి. ఈ వాహనాల్లో ఉన్న సరుకును మంగళవారం పాసింగ్ చేసి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి నాణ్యతను బట్టి రూ.3,700 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ ధరకు, ప్రైవేటు వ్యాపారులు చెల్లించే ధర సమానంగా ఉండటంతో రైతులు వ్యాపారులకు సరుకు విక్ర యించడానికే మొగ్గు చూపుతున్నారు.