
పత్తి ధర ధగధగ
కడప అగ్రికల్చర్:
పసిడి ధరతో పత్తి ధర పోటీ పడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య ధరలను అనుసరించి పత్తి ధర పలుకుతోంది. దీంతో పత్తి ధర ఆశాజనంగా ఉంటోంది. మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు సృష్టిస్తూ పత్తి ధర క్వింటాలుకు రూ. 6800 నుంచి రూ. 7 వేల వరకు తాకింది. పంట చరిత్రలో ఇంత ధర ఎప్పుడూ లేదని అటు వ్యాపారులు, ఇటు రైతులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే పంట నిల్వలు లేకనే పత్తికి డిమాండ్ ఉందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పంట చరిత్రలో ఇదే గరిష్ట ధర...ఈ ఏడాది 5948 హెక్టార్లలో సాగు..
జిల్లాలో పంటను దాదాపు 5 దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 6800 నుంచి రూ.7 వేలు ధర పలికిన దాఖలాలు లేవని రైతులంటున్నారు. జిల్లాలో చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, పులివెందుల, వేముల, వేంపల్లె, తొండూరు, ముద్దనూరు,వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, పెద్దముడియం, మైలవరం, చాపాడు, రాజుపాలెం మండలాల్లో అధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువ విస్తీర్ణంలోను కలిపి 25 వేల హెక్టార్ల సాధారణ సాగుకుగాను ఇప్పటి వరకు 5948 హెక్టార్లలో సాగు చేశారు. మూడు నాలుగేళ్లుగా క్వింటా పత్తి ధర రూ. 3500 దాటలేదు. ఈ ధర పంట సాగునుంచి చేతికందే వరకు ఇలానే ఉండేది. అయితే ప్రస్తుతం పంట సాగు చేసినప్పటి నుంచి ఇప్పటికి రూ. 6800 ధర పలుకుతోంది. ధరలు ఇలానే ఉంటే సాగు చేసిన రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.
సాగు తగ్గి దిగుబడి లేకనే ఎగబాకిన ధర..
దాదాపు రెండు సంవత్సరాలుగా దేశీయంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగాను, గులాబీ పువ్వు రంగు పురుగుల వల్ల పంట దిగుబడులు బాగా పడిపోయాయి. జిల్లాలో ఎకరాకు సగటున 3–4 క్వింటాళ్ల దిగుబడి మించలేదు. పంట ఆశించిన విధంగా లేకపోవడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు కూడా నిల్వ చేయలేక పోయారు. వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు ఏటా పత్తి నిల్వ చేసి అన్‌సీజన్‌లో బయటకు తీసి బేళ్లు, కండెలు తయారు చేసి విృకయించేవారు. అయితే రెండు సంవత్సరాలుగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ నిల్వ చేసిన పత్తికి మాత్రం ఊహించని ధర పలుకుతోంది.
కండెలకు..గింజలకు పెరిగిన డిమాండ్‌తోనే..
అంతర్జాతీయ వాణిజ్య సరళిని చూస్తే పత్తి కండెలకు, గింజలకు పెరిగిన డిమాండ్‌తోనే పత్తి ధర పెరిగింది. 350 కిలోల కండె ధర రూ. 53,000 పలుకుతోందని స్పిన్నింగ్ మిల్లుల మేనేజర్లు చెబుతున్నారు. అలాగే బేలు ధర కూడా రూ. 26,500 ఉంటోందన్నారు. విత్తన క్వింటా ధర రూ. 2500 పలుకుతున్నట్లు గుంటూరుకు చెందిన పత్తి వ్యాపారి రాజా సదానందయ్య సాక్షికి తెలిపారు. సీజన్‌లో కండె ధర రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఉంటుంది. అదే విధంగా గింజ ధర సీజన్‌లో రూ. 1600 మించలేదు. కండె, గింజకు డిమాండ్ పెరుగుతుండడంతో పత్తికి బాగా డిమాండ్ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ ధరలు ఇట్లే ఉంటే గిట్టుబాటు అవుతుంది..
ప్రస్తుతం పంట ఇప్పుడిప్పుడే కాయలు ఇడుగుతున్నాయి. ధరలు బాగున్నాయి. ఈ ధరలు కనీసం పంట చేతికొచ్చే సమయానికైనా ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం ఈ ధరను కొన్నేళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
–వెంకటసుబ్బయ్య, పత్తిసాగు రైతు, యాదవాపురం, పెండ్లిమర్రి మండలం.
గిట్టుబాటు అయితేనే పెట్టుబడులు వస్తాయి..
పత్తికి ఇంత భారీ ధర ఉండడం సంతోషకరం. అయితే పంట సాగు చేసేటప్పుడు ఉన్న ధరను చేతికొచ్చాక వ్యాపారులు తగ్గిస్తున్నారు. గిట్టుబాటు ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే పత్తి సాగు చేసిన ప్రతి రైతు బాగుపడతాడు.
–నరసింహులు, పత్తిసాగు రైతు, ద్వారకానగర్, పెండ్లిమర్రి మండలం.