ఆధిపత్యం కోసమే హత్య
►కలకలం రేపుతున్న బీసీ నేత, కౌన్సిలర్ గోపాలకృష్ణ హత్యోదంతం
► ఔరంగాబాద్ ఇసుక ర్యాంపుపై కన్నేసిన టీడీపీలోని ఓ వర్గం నేతలు
► అతని ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు గతంనుంచీ యత్నాలు
► ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
► సీసీ కెమెరా పుటేజీ సాయంతో కేసు ఛేదన
► తెరవెనుక ఎవరున్నారనే అంశంపై దృష్టి సారించిన పోలీసులు
కొవ్వూరు : ఇసుకు ర్యాంపుపై ఆధిపత్యం చెలాయించే విషయంలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు బీసీ నాయకుడు, కొవ్వూరు మునిసిపల్ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52)ను హత్యచేసే స్థాయికి వెళ్లిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు మరో వర్గం నేతలు. పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కౌన్సిలర్ గోపాలకృష్ణ రోడ్ కం రైలు వంతెన సమీపంలోని ఔరంగాబాద్ మలుపులో శుక్రవారం పట్టపగలే నడిరోడ్డుపై హత్యకు గురైన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.
ఆధిపత్య పోరే ప్రాణం తీసింది
ఔరంగాబాద్‌లోని ఇసుక ర్యాంపులో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరాటం నేపథ్యంలోనే గోపాలకృష్ణ హత్యకు గురయ్యాడని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గోపాలకృష్ణ ఔరంగబాద్ ఇసుక ర్యాంపు నిర్వహణలో మూడు దశాబ్ధాల నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు.
పడవలు, వాహనాలు, కూలీలు అతని చేతిలో ఉండటంతో అక్కడి ర్యాంపులో ఆయన హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఓ వర్గం నేతలు అతడి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ఇసుక ర్యాంపులు అక్రమంగా సొమ్ము సంపాదించిపెట్టే బంగారు బాతులుగా మారడంతో ఔరంగాాబాద్‌లోని ఇసుక ర్యాంపుపై ఆ వర్గం నేతలను కన్నేశారని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇటీవల గోపాలకృష్ణ, అతడి కుటుంబ సభ్యులపై టీడీపీలోని ఓ వర్గానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. టీడీపీలోని ఒక వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని గోపాలకృష్ణ పార్టీ ముఖ్యనేతలకు చెప్పారని సమాచారం. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినా పార్టీ నాయకులు పెడచెవిన పెట్టారనే విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ నేత గోపాలకృష్ణ ఓ సాధారణ పడవ యజమాని చేతిలో హత్యకు గురికావడం చర్చనీయాంశమైంది.
పోలీసుల కథనం ఇలా
గోపాలకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు శనివారం వెల్లడించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఔరంగాబాద్‌కు చెందిన గోపాలకృష్ణను అదే గ్రామానికి చెందిన తోట శ్రీరాములు, అతని బంధువు చదలవాడ మధుబాబు కలసి చెరకు నరికే కత్తితో హత్య చేశారని డీఎస్పీ చెప్పారు. శ్రీరాములు తనకున్న 20 సెంట్ల భూమిని అమ్ముకుని ఇటీవలే ఇసుక తరలించే పడవను కొనుగోలు చేశాడన్నారు.
ఔరంగాబాద్ వద్ద గోదావరి నది ఒడ్డున ఇసుక దిగుమతి చేసుకునేందుకు అవసరమైన స్థలం లీజు వ్యవహారంలో గోపాలకృష్ణకు, శ్రీరాములుకు మధ్య వివాదం ఏర్పడిందని తెలిపారు. శ్రీరాములు ఔరంగాబాద్ ర్యాంపులోఇసుక దిగుమతి చేసుకునేందుకు కబాబ్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు యత్నించగా, అతడి పడవను ర్యాంపులోకి రాకుండా అడ్డుకునేందుకు గోపాలకృష్ణ ఆ స్థలాన్ని తాను లీజుకు తీసుకున్నట్టుగా ఒప్పంద పత్రాలు రాయించుకున్నాడన్నారు. దీంతో శ్రీరాములు పక్కనే ఉన్న మరో స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించగా, గోపాలకృష్ణ అడ్డుపడినట్టు నిందితులు చెప్పారని పేర్కొన్నారు.
తన పడవను ఔరంగాబాద్ ర్యాంపులోకి రాకుండా గోపాలకృష్ణ అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన శ్రీరాములు అతడిని హతమార్చేందుకు పథకం రూపొందించాడని డీఎస్పీ వివరించారు. నెల రోజులుగా గోపాలకృష్ణను హతమార్చేందుకు శ్రీరాములు యత్నిస్తున్నాడని, శుక్రవారం మధ్యాహ్నం గోపాలకృష్ణ ఒంటరిగా మోటార్ సైకిల్ కొవ్వూరు వెళ్లాడాన్ని గుర్తించిన శ్రీరాములు అదే గ్రామానికి చెందిన తన బంధువైన చదలవాడ మధుబాబు అనే యువకుడి సహాయం తీసుకున్నాడన్నారు. మధుబాబు తన స్నేహితుడి నుంచి పల్సర్ మోటార్ సైకిల్ తీసుకుని, శ్రీరాముల్ని ఎక్కించుకుని కొవ్వూరు వైపు వెళ్లాడని తెలిపారు.
గోపాలకృష్ణ కోసం పాత రైలు వంతెన వద్ద కొద్దిసేపు మాటు వేశారని, వివాహ విందుకు హాజరై తిరుగు ప్రయాణమైన గోపాలకృష్ణను మోటార్ సైకిల్‌పై వెంబడించి రోడ్ కం రైలు వంతెన దాటిన తరువాత మలుపులో అటకాయించారని డీఎస్పీ వివరించారు. మధుబాబు మోటార్ సైకిల్ అడ్డుపెట్టడంతో గోపాలకృష్ణ అదుపు తప్పి కిందపడిపోయాడని, శ్రీరాములు వెంట తెచ్చుకున్న చెరకు నరికే కత్తితో గోపాలకృష్ణపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడని చెప్పారు. అనంతరం నిందితులిద్దరూ వేములూరు పుంత రోడ్డు మీదుగా పరారయ్యారన్నారు. టోల్‌గేట్ జంక్షన్ వద్ద గల సీసీ కెమెరాలోని పుటేజీల ఆధారంగా గోపాలకృష్ణను పల్సర్ మోటార్ సైకిల్‌పై ఇరువురు వ్యక్తులు వెంబడించినట్టు గుర్తించామన్నారు.
మధుబాబును అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, హత్యోదంతం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేశామని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు ఇరువురూ వేసుకున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించడంలో సీఐ పి.ప్రసాదరావు, పట్టణ ఎస్సైలు ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, డి.గంగాభవాని, క్రైమ్ పార్టీ ఎస్సై కె.వెంకటరమణ, హెచ్‌సీలు ఎస్.నాగేశ్వరరావు, ప్రసాద్‌బాబు, ఆర్‌ఎస్ వాసు, పీవీ రమణ, ఏడు కొండలు సహకరించారని డీఎస్పీ వెల్లడించారు. వీరికి రివార్డు నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఔరంగబాద్ ర్యాంపులో పాగా వేసిన పాక గోపాలకృష్ణ
ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులో గత మూడు దశాబ్ధాల నుంచి గోపాలకృష్ణ ఇసుక వ్యాపారంలో చక్రం తిప్పుతున్నారు. అలాగే ర్యాంపులో తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ర్యాంపు నిర్వహణ ఎవరు చేపట్టినా ఇక్కడ ఇసుక తవ్వకానికి, తరలించడానికి పనిచేసే పడవల నుంచి లారీలు, కూలీలు వరకు అన్నింటిలో గోపాలకృష్ణ హవానే నడుస్తోంది. ఇతని ఆదిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇటీవల తీవ్ర ప్రయత్నాలు సాగాయి. సుమారు 6 నెలల క్రితం ర్యాంపులో ఇసుక లోడింగ్ వ్యవహారంలో వాహనాలను వరుస క్రమంలో పెట్టే ప్రయత్నంలో కొవ్వూరుకు చెందిన కొందరు యువకులు గోపాలకృష్ణ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు.
అంతేకాక ఇక్కడ ర్యాంపులో గోపాలకృష్ణ ఆదిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొవ్వూరుకు చెందిన నాయకులు కొన్ని పడవలును సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం నుంచి ఇసుక వ్యాపారంలో కొనసాగుతున్న గోపాలకృష్ణ ఆర్ధికంగా స్ధిరపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక వ్యాపారం కాసులు కురిపించడంతో, అందరికళ్లు ర్యాంపులపై పడ్డాయి. ఈ నేపద్యంలో ర్యాంపులో పడవలు నిలిపేందుకు , ఇసుకను అన్‌లోడింగ్ చేసుకునేందుకు స్థలం లీజు వ్యవహారంలో గోపాలకృష్ణకు హత్యకు దారితీసింది.