-నలుగురు మైనర్ బైక్ రైడర్ల తల్లిదండ్రులపై ఎంవీఐ యాక్ట్
చాంద్రాయణగుట్ట
రాత్రి పూట బస్తీలలో లేట్ నైట్ రోమియోల సంచారం పూర్తిగా తగ్గేంత వరకు ఆపరేషన్ చబుత్రా మిషన్‌ను కొనసాగిస్తామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. దక్షిణ మండలంలోని 17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలలో చబుత్రాలపై కూర్చొని బాతాఖానీలు చేస్తున్న 221 మంది అవారాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బైక్‌లు నడుపుతున్న నలుగురు మైనర్ బాలలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరందరిని ఫంజెషాలోని గుల్జార్ ఫంక్షన్‌హాల్‌కు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ రోమియోలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రాత్రి పూట రోడ్లపై తిరగడం ద్వారా కలుగుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు. ముఖ్యంగా 18-25 ఏళ్ల వయసు గల యువకులే చబుత్రాలపై తిష్ట వేస్తున్నారన్నారు. ఇటీవల ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఆయన ఉదహరించారు. రాత్రి పూట బస్తీలలో ఒంటరిగా వెళ్లే మహిళలు, యువతల పట్ల వెకిలి చేష్టలకు దిగుతుండడం, రోడ్లపై మద్యం సేవించడం, తాగిన మైకంలో వాహనాలు నడపడం వంటి చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
ఇలాంటి క్రమంలోనే ఇటీవల పంజగుట్టలో జరిగిన ప్రమాదంలో రమ్య కుటుంబం బలయ్యిందన్నారు. ఇటీవల రంజాన్, బోనాలు ఉండడంతో ఈ మిషన్‌ను కొన్నాళ్లుగా నిలిపి వేశామన్నారు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ల పరిధిలో రోమియోల సంచారం అధికంగా ఉందన్నారు. రోమియోలలో మార్పు వచ్చేంత వరకు ఈ డ్రై వ్‌ను కొనసాగిస్తామన్నారు. ఇకపై వారంలో ఒక రోజు తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. బైక్ రైడింగ్‌లకు పాల్పడిన మైనర్ బాలల తల్లిదండ్రులపై మోటార్ వెహికల్ యాక్ట్ (181 సెక్షన్) కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మరోసారి మైనర్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులు ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఇకపై రాత్రి పూట బస్తీలలో తిరగబోమని వారితో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్లు శ్యాం సుందర్, వై.ప్రకాష్ రెడ్డి, పి.యాదగిరి, లింగయ్య, శ్రీనివాసారావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
221 మంది రోమియోలకు కౌన్సెలింగ్
Published Tue, Aug 9 2016 5:27 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement