క్షణికావేశానికి దంపతులు బలి
Published Sat, Mar 4 2017 12:34 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
- మంటల్లో చిక్కుకున్న భార్యాభర్తలు
- చికిత్సపొందుతూ మృతి
- ఆదోని పట్టణంలో విషాదం
ఆదోని టౌన్ : క్షణికావేశానికి రెండు నిండు జీవితాలు బలయ్యాయి. దంపతులు అమరేష్(28), కళావతి(25) మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని హనుమాన్ నగర్‌లో శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, మృతుల బంధువులు అందించిన వివరాల మేరకు..పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన అమరేష్‌తో అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల కేంద్రానికి చెందిన కళావతితో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. దాదాపు ఏడాది పాటు ఇరువురి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగింది. స్థానికంగా హోటల్‌లో పని చేస్తున్న అమరేష్ తాగుడుకు అలవాటు పడడంతో కుటుంబం ఆర్థికంగా దివాలా తీసింది.
ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబంలో అలజడి, గొడవలు మొదలయ్యాయి. తాగుడు మానుకోమని భార్య చెప్పినా వినక పోవడంతో తరుచుగా గొడవలు కూడా జరిగేవి. ఈ నేపథ్యంలో ఓ పూట తిని మరో పూట పస్తులతో గడుపుతున్న కళావతి.. తన పరిస్థితిని తల్లిదండ్రులు సరోజమ్మ, చంద్రశేఖరయ్యకు వివరించి కన్నీళ్లు పెట్టుకుంది. తాగుడును మాన్పిస్తే అంతా సర్దుకుపోతోందని తల్లిదండ్రులు చెప్పేవారు. అయితే భర్తలో మార్పు తేవడం ఆమెకు అసాధ్యం అయింది. కూతురు పస్తులు చూడలేక తల్లిదండ్రులు ఇటీవలె బియ్యం, కంది పప్పు కొంత నగదు కూడా ఇచ్చి పంపారు. అయితే వాటిని కూడా అమరేష్ మార్కెట్‌లో అమ్మేసి తాగుడుకు ఖర్చు పెట్టాడు. దీంతో ఆమెలో అసహనం, కోపం, ఆవేశం తీవ్ర స్థాయికి చేరింది. ఈ విషయమై శుక్రవారం ఇరువురు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డట్లు ఇరుగు పొరుగు వారు చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
గొడవ తరువాత కొద్దిసేపటికి ఇంట్లో చుట్టుముట్టిన మంటలతో ఇరువురు ఆర్తనాదాలు పెట్టడం చూసి తలుపులు పగులగొట్టి వెంటనే మంటలను ఆర్పేశామని స్థానికులు తెలిపారు. ఇరువురు మంటల్లో ఎలా చిక్కుకున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ సీఐ రామానాయుడు, ఎస్‌ఐ మన్యథ విజయ సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇరువురిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కళావతి మృతి చెందంగా.. రాత్రి 7.30 గంటల సమయంలో అమరేష్..ఈ లోకాన్ని వీడారు.
భర్తే చంపేశాడు
తన కూతురు కళావతిని భర్త అమరేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడని తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో రూ. 60వేలు నగదు, 5 తులాలు బంగారం కట్నంగా ఇచ్చామని, చాలా సార్లు బియ్యం, కంది పప్పుతో పాటు ఇతర వంట దినుసులు కూడా పంపామని, అయినా తమ కూతురు లోకం విడిచి వెళ్లిపోయి తమకు తీరని కడుపు కోత మిగిల్చిందని కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సీఐ రామానాయుడు తెలిపారు.
Advertisement
Advertisement