- కోర్టు ఆదేశాలను బేఖాతార్ చేసిన ఫలితం
నగర పంచాయతీ ఫర్నిచర్ జప్తునకు కోర్టు ఆదేశాలు
Published Tue, Sep 27 2016 12:36 AM | Last Updated on Sat, Oct 20 2018 5:55 PM
నర్సంపేట : కోర్టు తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నర్సంపేట నగర పంచాయతీలోని ఫర్నిచర్‌ను వరంగల్ లేబర్ కోర్టు జప్తు చేయించిన సంఘటన సోమవారం జరిగింది. నర్సంపేట పట్టణానికి చెందిన ఎండీ.మాషుక్ అనే కార్మికుడు 1988లో నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఎన్‌ఎంఆర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 1994లో విద్యుత్ మోటార్ కాలిపోయిన ఘటనకు మాషుక్‌ను బాధ్యుడిని చేస్తూ అప్పటి పాలకవర్గం అతడిని విధుల్లో నుంచి తొలగించింది. దీంతో మాషుక్ 1998లో వరంగల్‌లోని లేబర్‌కోర్టును ఆశ్రయించడంతో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి 2001లో అతడిని విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ అప్పటి గ్రామ పంచాయతీ పాలకులు లేబర్‌కోర్టులో రీపిటిషన్ దాఖలు చేశారు. మరోసారి వాదనలు విన్న కోర్టు మరోసారి మాషుక్‌కు అనుకూలంగానే తీర్పు వెలువడింది. అయినా అప్పటి పాలకవర్గం, అధికారులు అతడిని విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మాషుక్ 2015లో మరోసారి లేబర్‌కోర్టును ఆశ్రయించాడు. దీంతో నగర పంచాయతీ కమిషనర్‌ను బాధ్యులను చేస్తూ కోర్టుకు పిలిపించారు. కోర్టులో అప్పటి కమిషనర్ మాషుక్‌ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాటవేశారు. దీంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రూ.ఽ13 లక్షల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులకు అధికారులు స్పందించకపోవడంతో నగరపంచాయతీలోని ఫర్నిచర్‌ను సోమవారం కోర్టు అడ్మినిస్టర్ గురునాథ్ వచ్చి జప్తు చేశారు.
Advertisement
Advertisement