court order
-
ఫుడ్ ఆర్డర్లో నిర్లక్ష్యం.. జొమాటోకు రూ.60 వేల జరిమానా
జొమాటో, స్విగ్గీ వంటివి అందుబాటులో వచ్చిన తరువాత కావలసిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఉన్న చోటుకే తెప్పించుకుని ఆరగిస్తున్నారు. అయితే ఈ సర్వీసుల్లో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటన ఇటీవల కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. దీనిని విచారించిన కోర్టు జొమాటోకు రూ. 60వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన శీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న జొమాటోలో మోమోస్ ఆర్డర్ చేశారు. దీనికి 133 రూపాయలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల తరువాత డెలివరీ అయినట్లు జొమాటో యాప్ చూపించింది. నిజానికి ఆమెకు మోమోస్ డెలివరీ కాలేదు.ఆర్డర్ పెట్టిన మోమోస్ డెలివరీ కాకపోవడంతో రెస్టారెంటుకు కాల్ చేయగా, డెలివరీ ఏజెంట్ ఆర్డర్ తీసుకున్నారని, ఇతర వివరాలు కోసం డెలివరీ ఏజెంట్‌ను సంప్రదించమని వెల్లడించారు. అయితే ఏజెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ అతను స్పందించలేదు. దీంతో శీతల్ జొమాటోకు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రతిస్పందన కోసం 72 గంటల పాటు వేచి ఉండాల్సిందిగా కంపెనీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. అయినా శీతల్‌ను ఎలాంటి రిప్లై అందలేదు.ఇదీ చదవండి: పెరిగిన ఎస్బీఐ వడ్డీ రేట్లు: ఈ రోజు నుంచే అమలు..జొమాటో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో 2023 సెప్టెంబర్ 13న కంపెనీకి లీగల్ నోటీసు పంపించారు. నోటీసుకు ప్రతిస్పందనగా, కోర్టుకు హాజరైన జొమాటో తరపు న్యాయవాది ఈ ఆరోపణ తప్పు అని పేర్కొన్నారు. ఆ తరువాత పొంతనలేని సమాధానాల ఆధారంగా కోర్టు తీర్పునిస్తూ.. జొమాటో నిర్లక్ష్యం వల్ల మహిళ మానసిక వేదనకు గురైందని.. దీనికి పరిహారంగా రూ. 50000, కేసు.. ఇతర ఖర్చుల కారణంగా మరో పదివేలు.. ఇలా మొత్తం జొమాటోకు రూ. 60000 జరిమానా విధించింది.Lady Ordered Momos on Zomato For ₹133She Didn’t Receive The OrderBut Zomato Marked Delivered in The AppShe Sent a Legal Notice and Filed a ComplaintNow Consumer Forum Ordered Zomato To Pay ₹60,000 Compensation To Complainant— Ravisutanjani (@Ravisutanjani) July 14, 2024 -
జయప్రదను అరెస్ట్ చేయండి..
రామ్‌పూర్(యూపీ): గత లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినపుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను అరెస్ట్‌చేయాలని అక్కడి రామ్‌పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అరెస్ట్‌చేసి మార్చి నెల ఆరోతేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని సూచించింది. 2019లో ఎన్నికల ప్రవర్తనానిబంధనావళి ఉల్లంఘనపై కేమారి, స్వార్ పోలీస్స్టేషన్లలో జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయమై తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక ఎంపీ – ఎమ్మెల్యే కోర్టు జయప్రదకు సూచించింది. అయినా ఆమె రాకపోవడంతో ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ – బెయిలబుల్ వారెంట్లు జారీఅయ్యాయి. ఇంత జరిగినా ఆమె కోర్టుకు రాకపోవడంతో జయను ‘పరారీలో ఉన్న వ్యక్తి’గా జడ్జి ప్రకటించారు. -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్‌ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్‌సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్‌ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్‌ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్‌లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి -
పుల్లారెడ్డి మనవడి ఇంట అడ్డుగోడ తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జి. పుల్లారెడ్డి మనవడు ఏకనాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి ఇంట్లోకి రాకుండా కట్టిన అడ్డుగోడను తొలగించాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సోమవారం ప్రొటెక్షన్ అధికారులు అమలు చేశారు. ఉదయం ఇంటికి చేరుకున్న ప్రొటెక్షన్ అధికారి అక్కేశ్వర్రావు పంజగుట్ట పోలీసుల సహకారం తీసుకుని అడ్డుగా ఉన్న గోడను తీయించారు. మొదట ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రొటెక్షన్ అధికారిని అనితారెడ్డి అక్కడకురాగా ఏకనాథ్‌రెడ్డి తరఫు న్యాయవాది గోడకూల్చే విషయంలో పునరాలోచించుకోవాలని గతంలో వీరికి అనుకూలంగా ఇచ్చిన కోర్టు ఆదేశాలు చూపగా పరిశీలించిన అధికారులు జిల్లా ప్రొటెక్షన్ అధికారి అక్కేశ్వర్రావుకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అక్కేశ్వర్రావు అడ్డుగా నిర్మించిన గోడను తొలగించారు. న్యాయస్థానం ప్రజ్ఞారెడ్డి ఫిర్యాదు మేరకు ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేందుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆదేశించిందని, దాన్ని తాము అమలు చేసినట్లు ఆయన తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలు ఎంతో సంతోషాన్నిచ్చాయి న్యాయస్థానం ఆదేశాలు ఎంతో సంతోషాన్నిచ్చాయని ఏకనాథ్‌రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి అన్నారు. ఏకనాథ్‌రెడ్డి కుటుంబంతో తాను న్యాయపోరాటం చేస్తుండగా ఈ నెల 15వ తేదీన అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. గోడను తొలగించిన ప్రొటెక్షన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రెండు నెలలుగా తాను తన పాప కిందకు, పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. (క్లిక్: నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేయాలి) -
కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి
బరంపురం: నవ వధువు తపస్విని దాస్ న్యాయ పోరాటం ఫలించింది. తనను ప్రేమించి, పెళ్లాడిన వైద్యుడు సమిత్ సాహు కొన్నిరోజుల కాపురం తర్వాత తనను ఒంటరిగా వదిలేసి, ముఖం చాటేశాడు. దీంతో ఆమె తన భర్త కోసం అత్తవారింటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఈమెకి స్థానిక ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి పెద్దఎత్తున మద్దతు తెలిపి, కోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు దాదాపు 44 రోజుల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆమె ఆందోళన చేసింది. ఈ క్రమంలో మంగళవారం విచారణ చేపట్టిన బరంపురంలోని జిల్లా కోర్టు తపస్విని దాస్‌కు అత్తవారింట్లోనే అత్తమామలతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని, ప్రతి నెలా ఆమె ఖర్చుల కోసం రూ.17 వేలు ఇవ్వాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో బాధితురాలు, ఆమెకు మద్దతుగా నిలిచిన ప్రజలు న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఓ వైపు భర్త స్నేహితుడు.. మరో ఇద్దరితో మహిళ వివాహేతర సంబంధం -
శరణం అయ్యప్ప!
శబరిమల/తిరువనంతపురం: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేవాలయ తంత్రి(ప్రధాన పూజారి) కందరారు మహేశ్ మోహనరు, మెల్షంటి(ముఖ్య పూజారి) సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి పడి పూజ చేశారు. అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తుల అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది యువతులను తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే దేవస్థానం బోర్డు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ కనుమల్లోని పెరియార్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులతోపాటు మండలపూజ మకరవిళక్కు, విషు పండగల సమయాల్లో మాత్రమే భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. మండల–మకరవిళక్కు సందర్భంగా రెండు నెలలపాటు ఆలయం తెరిచి ఉండనుంది. నిషేధాజ్ఞలు లేవు: కలెక్టర్ రుతుక్రమం వయస్సు మహిళలను కూడా ఆలయంలోకి పూజలకు అనుమతించవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు, వేలాదిగా పోలీసులను మోహరించినప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. శబరిమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. భక్తుల కోసం దేవస్వోమ్ బోర్డు పలు సౌకర్యాలు కల్పించింది. నీలాకల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 6,500 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ మహిళల బృందం వెనక్కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన 30 మంది మహిళల బృందాన్ని పోలీసులు పంబలో అడ్డుకున్నారు. వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన మీదట అందులోని నిషేధిత 10–50 మధ్య వయస్సున్న 10 మందిని తిప్పిపంపి వేశామని పోలీసులు తెలిపారు. పంబ నుంచి శబరిమల ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ ఖండించింది. ప్రభుత్వ విధానం కారణంగా ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న వైఖరి క్రమంగా పలుచన కానుందని ఆ కమిటీ జనరల్ సెక్రటరీ పున్నల శ్రీకుమార్ తెలిపారు. శబరిమల రావాలనుకునే మహిళలు తమతో పాటు కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ స్పందించారు. ఆ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించడంలేదని వ్యాఖ్యానించారు. కేరళ సర్కారు తనకు భద్రత కల్పించినా కల్పించకున్నా ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల ఆలయ సందర్శనకు వెళ్తానని ఆమె ప్రకటించారు. గత ఏడాది ఉద్రిక్త పరిస్థితుల మధ్య తృప్తి దేశాయ్ ఆలయ సందర్శనకు ప్రయత్నించగా భారీ స్థాయిలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నారి భక్తురాలిని గుడిలోకి పంపిస్తున్న దృశ్యం -
కలెక్టర్ వాహనం జప్తునకు కోర్టు ఆదేశం
ఒకటి కాదు...రెండు కాదు... ఏకంగా పాతికేళ్లుగా పరిహారం కోసం బాధితులు పోరాడుతు న్నారు. ప్రభుత్వం సేకరించిన తమ భూమికి తగిన పరిహారం ఇవ్వాలంటూ ఏళ్లుగా వేడుకుం టున్నారు. పరిహారం కోసం తొలుత కార్యాలయాల చుట్టూ తిరిగిన చాలా మంది కాలం చేశారు. కానీ ఇప్పటికీ ఆ కుటుంబాలకు పరిహారం అందనే లేదు. రెవెన్యూ విభాగంలో అంతులేని నిర్లక్ష్యంపై కోర్టు పలుమార్లు మెట్టికాయలు వేసింది. అయినా స్పందన రావడం లేదు. చివరికి కలెక్టర్ వాహనం జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 28లోగా వాహనాన్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సాక్షి, పెద్దపల్లి: రామగుండం మండలం జనగామ శివారులో 1994లో వాటర్‌ట్యాంక్ నిర్మించారు. సర్వేనంబర్ 599లో ఎకరా పది గుంటల భూమిని వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం నిర్ణయించింది. అయితే ఆ పరిహారం తమకు ఆమోదయోగ్యం కాదంటూ గౌసియా బేగం తదితర కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. ఇందుకు స్పందించిన కోర్టు ఎకరాకు రూ.3.50లక్షల చొప్పున చెల్లించాలంటూ 2012 జూలై 31న తీర్పునిచ్చింది. అన్ని లెక్కలు కలిపి మొత్తం రూ.31లక్షల 24వేల 968 పరిహారం కింద చెల్లించాలని పెద్దపల్లి కోర్టు తేల్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎ లాంటి చెల్లింపులు జరపలేదు. సంవత్సరాలు గడుస్తున్నా సమస్య కొలిక్కిరాలేదు. తమకు రావాల్సిన పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే.. ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశం పరిహారం కోసం పోరాటం చేస్తున్న బాధిత కుటుంబాలకు కోర్టు బాసటగా నిలిచింది. మొ త్తం రూ.31,24,968 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పరిహారంపై రెవెన్యూ అధికారులు అదే రీతిన నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లా కలెక్టర్ వాహనం జప్తు చేయాలంటూ పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. వరుస సెలవులు రావడంతో ఈనెల 28లోగా కలెక్టర్ వాహ నం జప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఆ లోగా నే డబ్బులు చెల్లించి, వ్యవహారం కలెక్టర్ వాహ నం జప్తు కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం లోని సామగ్రిని జప్తు చేయాలని కోర్టు 2016లో ఆదేశించింది. దీంతో కార్యాలయంలోని కంప్యూటర్, బీరువాలు, టేబుళ్లను బాధితులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేలం వేయాల్సి ఉండగా, రూ.84,500 చెల్లించి ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేసింది. సామగ్రి విలువ ప్రకారం చెల్లించి న, పరిహారం మాత్రం పూర్తిగా దక్కలేదు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఏకంగా కలెక్టర్ వాహనాన్ని పరిహారం కింద జప్తు చేయాలని కో ర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. కాగా పాతికేళ్లుగా పరిహారం ఇవ్వకుండా తమను మా నసికంగా వేధిస్తున్నారని, ఇప్పటికైన పూర్తి పరిహారం ఇవ్వాలని బాధితులు వేడుకొంటున్నారు. జప్తు కానివ్వం కలెక్టర్ వాహనం జప్తు కావట్లేదు. మేమున్నంత వరకు జప్తు కానివ్వం. ప్రజా ఆరోగ్యశాఖ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ శాఖ డబ్బులు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మున్సిపల్ (ప్రజా ఆరోగ్యశాఖ) నుంచి రూ.10 లక్షల చెక్‌ను కోర్టుకు పంపిస్తున్నాం. ఏ వాహనం కూడా జప్తు కాదు.–పుప్పాల హన్మంతరావు, తహసీల్దార్, రామగుండం -
మాజీ అధ్యక్షుడి అరెస్టుకు రంగం సిద్ధం
సియోల్ : అవినీతి ఆరోపణల కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు లీ ముంగ్-బక్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను వెంటనే అరెస్టు చేయాలంటూ దక్షిణ కొరియా కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. ఆయనపై చాలా అవినీతి ఆరోపణల కేసులు వచ్చాయని, అవన్నీ చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయంటూ కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. లీ ముంగ్ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే, ఆయనపై పలు అవినీతి కేసులు వచ్చాయి. దీంతో విచారణకు పిలిచిన సందర్భంలో ఆయన తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. దీంతో దర్యాప్తును సీరియస్‌గా చేసిన పోలీసులు కేసు విచారిస్తున్న సెంట్రల్ డిస్ట్రిక్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. తాను అమాయకుడినని చెప్పుకుంటూనే సాక్ష్యాలు మాయం చేసే చర్యలకు లీముంగ్ దిగారని, సాక్షులను బెదిరించారని కూడా కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా, తన అరెస్టుకై ఆదేశాలు వచ్చిన వెంటనే లీముంగ్ సోషల్ మీడియాలో స్పందించారు. తాను అధ్యక్షుడిగా పనిచేసినంతకాలం ప్రజలకు మంచి సేవలు అందించేందుకే కృషిచేశానని అన్నారు. ఏ క్షణంలో అయినా ఆయనను పోలీసులు అరెస్టు చేయవచ్చు. మోసం, అవినీతి, పన్ను ఎగవేత, బోగస్ చెల్లింపులువంటి ఆరోపణలు లీముంగ్పై నమోదు అయ్యాయి. సోమవారం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. -
కోర్టు దారి ఎటో?
► నగర, గ్రామీణ పరిధిలోకి రహదారులు ► టాస్మాక్‌ల కోసం స్థాయి తగ్గింపు ► కోర్టుకు వ్యవహారం ► వాడివేడిగా వాదనలు సాక్షి, చెన్నై: రాష్ట్రంలో రెండు వేల కిమీ దూరం మేరకు జాతీయ, రాష్ట్ర రహదారులు నగర, గ్రామీణ రోడ్లుగా మారనున్నాయి. టాస్మాక్ మద్యం దుకాణాల ఏర్పాటు లక్ష్యంగా రోడ్ల స్థాయిని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వ్యవహారం కోర్టుకు చేరడంతో మంగళవారం వాదనలు వాడివేడిగా సాగాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని టాస్మాక్ మద్యం దుకాణాల్ని తొలగించాల్సిందేని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్రంలో మూడు వేలకు పైగా దుకాణాలు మూత పడ్డాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. మరో చోటకు దుకాణాల్ని మార్చే ప్రయత్నాలు సాగుతున్నా, ప్రజల్లో బయలు దేరిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో మాత్రమే దుకాణాలు ఉండ కూడదంటూ కోర్టు ఆదేశించిన దృష్ట్యా, తమ అధికారాల్ని ప్రయోగించి ఆ రహదారుల్ని గ్రామీణ, నగర రోడ్లుగా మార్చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగ్గ ఉత్తర్వుల స్థానిక సంస్థలకు ఇటీవల జారీ అయ్యాయి. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సిద్ధమైంది. డీఎంకే కోర్టును ఆశ్రయించేలోపు తమ పనితనాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగమేఘాలపై స్థానిక సంస్థల నుంచి వివరాలను సేకరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు ఏఏ గ్రామాలు, నగర పరిధిలో ఎన్ని కిలోమీటర్ల దూరం మేరకు ఉన్నాయో వివరాలను సేకరించి. అందుకు తగ్గ కార్యచరణను వేగవంతం చేశారు. మంగళవారం సీఎం కే పళనిస్వామి నేతృత్వంలో మంత్రులు తంగమణి, వేలుమణి, జయకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, రెవెన్యూ, మార్కెటింగ్, నగర, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో కూడిన సమావేశంలో ఈ చర్చ సాగింది.మొత్తంగా 2వేల కిమీ దూరం మేరకు ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్ని ఇక, స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. రెండు వేల కిమీ దూరం : రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో, నగర, మహానగర, పట్టణ, గ్రామ పంచాయతీల మీదుగా 2,193 కీ.మీ దూరం మేరకు రాష్ట్ర, జాతీయ రహదారులు సాగుతున్నట్టు తేల్చారు. ఆయా గ్రామాలు, నగరాల పరిధి, సరిహద్దుల ఆధారంగా ఈ వివరాలను సేకరించారు. ఈ రోడ్ల అభివృద్ధికి రహదారుల శాఖతో పాటు స్థానిక సంస్థలు నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నాయి. ఇక, ఆయా సంస్థల పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ఆయా స్థానిక సంస్థల నిధులు వెచ్చించబోతున్నారు. రహదారుల్ని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఇది వరకు ఉన్న చోట్లే టాస్మాక్ మద్యం దుకాణాలను మళ్లీ పునర్ ప్రారంభించుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తుండడం గమనార్హం. ఆ మేరకు రాజధాని నగరం చెన్నైలోని అన్నా సాలై, పూందమల్లి హైరోడ్డు, జవహర్లాల్రోడ్డు, పరింగి మలై – పూందమల్లి రోడ్డు, పల్లావరం –తురైపాక్కం వంటి రాష్ట్ర రహదారులను కార్పొరేషన్ రోడ్డులుగా మార్చేయనున్నారు. నగరం పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇది వరకు కార్పొరేషన్ రూ. 550 కోట్లు కేటాయిస్తుండగా, రహదారుల శాఖ కేవలం 120 కోట్లు అప్పగించేది. కార్పొరేషన్ అత్యధికంగా నిధుల్ని వెచ్చిస్తున్న దృష్ట్యా, ఇక ఆ రహదారులు నగర రోడ్లుగా మార్చేయనున్నారు. ఈ దిశగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 562 కీ.మీ దూరం మేరకు ఉన్న రహదారులు, నగరæ రోడ్లు గా మార్చేందుకు నిర్ణయించడం గమనించాల్సిన విష యం. ఇక, కొన్ని చోట్ల విస్తరణలో ఉన్న రహదారుల్ని సైతం స్థానిక సంస్థల పరి ధిలోకి తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కోర్టుకు వ్యవహారం: ప్రభుత్వం వేగం పెంచిన దృష్ట్యా, డిఎంకే కోర్టు తలుపుల్ని తట్టింది. డిఎంకే ఎంపి ఆర్ఎస్ భారతీ, న్యాయవాది బాలుల నేతృత్వంలో మంగళవారం రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందరేష్‌లతో కూడిన బెంచ్ ముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు విల్సన్, ఎల్ఎస్ రాజాలు వాదనలు వినిపించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్ని గ్రామీణ, నగర రోడ్లుగా మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. సుప్రీం కోర్టును బురిడీ కొట్టించి, టాస్మాక్ మద్యం దుకాణాల ఏర్పాటు లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని కోరారు. ప్రభుత్వం తరఫుడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి హాజరై, ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల పరిధిలోని స్థానిక సంస్థల్లో కింద ఉన్న ఈ రోడ్లను విస్తరణ, అభివృద్ధిలో భాగంగా కేంద్రం జాతీయ రహదారులుగా, కొత్త నిబంధనల మేరకు రాష్ట్ర రహదారులుగా మార్చారని వివరించారు. ఆయా స్థానిక సంస్థల పరిధిలో ఉన్న రహదారులు మాత్రమే రోడ్లుగా మారనున్నాయన్న విషయాన్ని పరిగణించాలని సూచించారు. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, తొసి పుచ్చాలని పట్టుబట్టారు. అత్యవసర పిటిషన్లు కావడంతో బుధవారం నుంచి విచారణ వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
ఉత్సాహ‘బరి’తంగా..
కోడిపందేలకు సై సిద్ధమవుతున్న బరులు యుద్ధప్రాతిపదికన పనులు కోడి పందేలు వలదంటూ సర్వోన్నత న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చినా.. సర్కారు ఉదాసీన వైఖరి నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా జిల్లాలో పందేల నిర్వహణకు భారీ ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయి. క్రీడా ప్రాంగణాలను తలపించేలా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. తణుకు టౌన్ : పందేలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. బరులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఒకవైపు కోడి పందేలను నిషేధిస్తూ.. రాష్ట్ర అత్యుతన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. అయితే అధికారులు చేసే దాడులు, తనిఖీలకు కొన్ని షరతులు విధించింది. దీనిని సాకుగా చేసుకుని సర్కారు ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. ఇది నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా పందేలకు బరులు భారీ ఎత్తున సిద్ధమవుతున్నాయి. బరుల చదును పనులను నిర్వాహకులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. రెండు రోజులుగా తణుకు మండలంలోని తేతలి గ్రామంలో బరులను నిర్వాహకులు శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ భారీస్థాయిలో కోడి పందేలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా పందేల నిర్వహణకు నిర్వాహకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం పండగ నాలుగు రోజులూ పందేలకు అనుమతులు ఇస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట నిర్వహణకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. అనుమతివ్వకుంటే ఎద్దుల పోటీ ఒక వేళ కోడి పందేలకు సర్కారు అనుమతి ఇవ్వకపోతే ఎద్దుల పోటీలను నిర్వహించేందుకు తణుకు మండలం తేతలి గ్రామంలో బరిని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. దీని కోసం నిర్వాహకులు ఇప్పటికే గుంటూరు, నరసరావుపేట వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ జరిగే ఎద్దుల పోటీలను పరిశీలించి వచ్చారు. ఎద్దుల పోటీకి తగ్గట్టుగా భారీ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. వెయ్యి కిలోల బరువు గల సిమ్మెంట్ దిమ్మెను తయారు చేశారు. కోళ్లకు పౌష్టికాహారం పందేల కోసం జిల్లాలోని జూదరులు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. వాటికి వేల రూపాయలు ఖర్చు చేసి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏదేమైనా కోడి పందేలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే బరులను ఏర్పాటు చేస్తుండడం వల్ల జూదరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
నగర పంచాయతీ ఫర్నిచర్ జప్తునకు కోర్టు ఆదేశాలు
కోర్టు ఆదేశాలను బేఖాతార్ చేసిన ఫలితం నర్సంపేట : కోర్టు తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నర్సంపేట నగర పంచాయతీలోని ఫర్నిచర్‌ను వరంగల్ లేబర్ కోర్టు జప్తు చేయించిన సంఘటన సోమవారం జరిగింది. నర్సంపేట పట్టణానికి చెందిన ఎండీ.మాషుక్ అనే కార్మికుడు 1988లో నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఎన్‌ఎంఆర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 1994లో విద్యుత్ మోటార్ కాలిపోయిన ఘటనకు మాషుక్ను బాధ్యుడిని చేస్తూ అప్పటి పాలకవర్గం అతడిని విధుల్లో నుంచి తొలగించింది. దీంతో మాషుక్ 1998లో వరంగల్‌లోని లేబర్కోర్టును ఆశ్రయించడంతో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి 2001లో అతడిని విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ అప్పటి గ్రామ పంచాయతీ పాలకులు లేబర్‌కోర్టులో రీపిటిషన్ దాఖలు చేశారు. మరోసారి వాదనలు విన్న కోర్టు మరోసారి మాషుక్కు అనుకూలంగానే తీర్పు వెలువడింది. అయినా అప్పటి పాలకవర్గం, అధికారులు అతడిని విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మాషుక్ 2015లో మరోసారి లేబర్కోర్టును ఆశ్రయించాడు. దీంతో నగర పంచాయతీ కమిషనర్‌ను బాధ్యులను చేస్తూ కోర్టుకు పిలిపించారు. కోర్టులో అప్పటి కమిషనర్ మాషుక్ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాటవేశారు. దీంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రూ.ఽ13 లక్షల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులకు అధికారులు స్పందించకపోవడంతో నగరపంచాయతీలోని ఫర్నిచర్‌ను సోమవారం కోర్టు అడ్మినిస్టర్ గురునాథ్ వచ్చి జప్తు చేశారు. -
‘అభయ’ నిందితులకు జైలుశిక్ష
రంగారెడ్డి జిల్లా కోర్టులు: అభయ కేసులో నిందితులకు శిక్ష పడటంతో బాధితులకు ఊరట లభించింది. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన అభయ (22) (పేరు మార్చాం) గౌలిదొడ్డిలోని మహిళా హాస్టల్లో ఉం టూ హైటెక్‌సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోం ది. గతేడాది అక్టోబర్ 18న సాయంత్రం 5.30కి ముగించుకొని ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌కు వచ్చింది. రాత్రి 7.30కి మాల్ నుంచి బయటికి వచ్చి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా... ఆమె ఎదుట కారు (ఏపీ09 టీవీఏ-2762) ఆగింది. డ్రైవర్ వెడిచర్ల సతీష్ లిఫ్ట్ ఇస్తానని ఆమెను ఎక్కించుకున్నాడు. కారులో అతని స్నేహితుడు నెమ్మడి వెంకటేశ్వర్లు ఉన్నాడు. ఇద్దరూ ఆమెను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కారులో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును అరెస్టు చేసి.. దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.నాగార్జున్ బుధవారం నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అభయ కేసు నిర్భయ చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన తొలికేసు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసి.. త్వరగా దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో 209 రోజుల్లోనే తీర్పు రావడాన్ని స్వాగతిస్తున్నా. త్వరగా నిందితులకు శిక్షపడటంతో అభయ ఘటనలు వంటివి పునరావృతం కావు. - నాగరాజు, అభయ కేసు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహిళలపై దాడులకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలను సరిగ్గా అమలు చేస్తే మహిళలపై దురాగతాలు తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి మరింత కఠిన శిక్షలు విధించాలి. - (పి.రమణి, న్యాయవాది)