ఉత్సాహ‘బరి’తంగా..
ఉత్సాహ‘బరి’తంగా..
Published Sun, Jan 8 2017 9:59 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
కోడిపందేలకు సై
సిద్ధమవుతున్న బరులు
యుద్ధప్రాతిపదికన పనులు
కోడి పందేలు వలదంటూ సర్వోన్నత న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చినా.. సర్కారు ఉదాసీన వైఖరి నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా జిల్లాలో పందేల నిర్వహణకు భారీ ఎత్తున బరులు సిద్ధమవుతున్నాయి. క్రీడా ప్రాంగణాలను తలపించేలా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి.
తణుకు టౌన్ :
పందేలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. బరులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఒకవైపు కోడి పందేలను నిషేధిస్తూ.. రాష్ట్ర అత్యుతన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. అయితే అధికారులు చేసే దాడులు, తనిఖీలకు కొన్ని షరతులు విధించింది. దీనిని సాకుగా చేసుకుని సర్కారు ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. ఇది నిర్వాహకుల్లో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా పందేలకు బరులు భారీ ఎత్తున సిద్ధమవుతున్నాయి. బరుల చదును పనులను నిర్వాహకులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. రెండు రోజులుగా తణుకు మండలంలోని తేతలి గ్రామంలో బరులను నిర్వాహకులు శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇక్కడ భారీస్థాయిలో కోడి పందేలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా పందేల నిర్వహణకు నిర్వాహకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం పండగ నాలుగు రోజులూ పందేలకు అనుమతులు ఇస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట నిర్వహణకూ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి.
అనుమతివ్వకుంటే ఎద్దుల పోటీ
ఒక వేళ కోడి పందేలకు సర్కారు అనుమతి ఇవ్వకపోతే ఎద్దుల పోటీలను నిర్వహించేందుకు తణుకు మండలం తేతలి గ్రామంలో బరిని నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. దీని కోసం నిర్వాహకులు ఇప్పటికే గుంటూరు, నరసరావుపేట వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ జరిగే ఎద్దుల పోటీలను పరిశీలించి వచ్చారు. ఎద్దుల పోటీకి తగ్గట్టుగా భారీ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. వెయ్యి కిలోల బరువు గల సిమ్మెంట్ దిమ్మెను తయారు చేశారు.
కోళ్లకు పౌష్టికాహారం
పందేల కోసం జిల్లాలోని జూదరులు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. వాటికి వేల రూపాయలు ఖర్చు చేసి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏదేమైనా కోడి పందేలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే బరులను ఏర్పాటు చేస్తుండడం వల్ల జూదరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement