ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం
బద్వేలు అర్బన్ : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఆపై మాట తప్పిన మంత్రి లోకేష్‌బాబుకు ఇక్కడ పర్యటించే హక్కు లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో భాగంగా మంగళవారం ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. మూడున్నరేళ్లు అవుతున్నా దాని ఊసే ఎత్తకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా, పట్టణ కార్యదర్శులు వీరశేఖర్, చంద్రశేఖర్, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శులు బి.అనిల్, పి.ప్రభాకర్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు జకరయ్య, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు శివరాం, సూరి, సత్యం, సాయి, సుధాకర్, హరి, మోహన్, పెంచలయ్య పాల్గొన్నారు.