
దగాకోరు ప్రభుత్వమిది
సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
పామిడి : రాష్ర్ట్రంలో దగాకోరు పాలన సాగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో శుక్రవారం చలో గుంతకల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెండేళ్లయినా ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ఉన్న మక్కువ బాబుకు ప్రజా సమస్యలపై లేదన్నారు. నవ నిర్మాణదీక్షలు, మహాసంకల్పం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన వల్ల ఆర్థిక పరిస్థితి సరిగా లేదంటూనే రెండేళ్లలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు రూ.200 కోట్లు ఖర్చు చేశారన్నారు. బయోమెట్రిక్ విధానంలో విత్తన వేరుశనగ కాయల పంపిణీ చేపట్టడం వల్ల అర్హులైన రైతులకు విత్తనం అందలేదన్నారు. అన్ని పంటలకు ఫసల్ బీమాను వర్తింపజేయాలన్నారు.
పామిడిలో 964మంది పేదలకు ఇళ్ల స్థలాలకు అందజేస్తామని జాబితా సిద్ధం చేసినా ఇంతవరకూ సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ పాదయాత్ర ఈ నెల 20న గుంతకల్లు ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ ఆఫీసు కార్యాలయం వద్దకు చేరుకుంటుందన్నారు. నియోజకవర్గ ప్రజాసమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో గుంతకల్ డివిజన్ కార్యదర్శి డీ శ్రీనివాసులు, సీపీఎం మండల కార్యదర్శి పీ అనిమిరెడ్డి, రైతుసంఘం మండల నాయకులు చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.