గూడుకట్టిన వేదన | Cracked buckets | Sakshi
Sakshi News home page

గూడుకట్టిన వేదన

Published Mon, Aug 7 2017 11:06 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

గూడుకట్టిన వేదన - Sakshi

గూడుకట్టిన వేదన

గూడుగోడు...వినేదెవరు

  • ఆధిపత్య పోరులో నిరాశ్రయులైన నిరుపేదలు
  • శిథిలాల్లోనే భవిష్యత్‌ వెతుక్కుంటున్న విజయనగర్‌ కాలనీ వాసులు
  • ఐదు రోజులైనా తొంగిచూడని ప్రజాప్రతినిధులు, అధికారులు
  • న్యాయం జరిగే వరకు కదలబోమంటున్న బాధితులు 

 

  అనంతపురం న్యూసిటీ: ఐదు రోజుల క్రితం సొంతిల్లుంటే సగం బాధలు పోయినట్లే. అప్పోసొప్పో చేసి, వెనకేసున్న నాలుగు పైసలతో నానా కష్టాలుపడి ఇళ్లు కట్టుకున్నారు. అధికార ప్రజాప్రతినిధుల గ్రూపు రాజకీయాలతో పేదల జీవితాలతో చెలగాటమాడారన్న విమర్శలు వినబడుతున్నాయి. గంటల వ్యవధిలోనే వందల కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. రెవెన్యూ అధికారులు వేకువజామున బలవంతంగా పేదలను నెట్టేసి వారి కళలను చెరిపేశారు. ఇళ్లను కూల్చి ఐదు రోజులు గడుస్తున్నా ఏ ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులే అటువైపు వెళ్లలేదు. ఎండనక, వాననక, చిమ్మచీకటిలోనే నిరుపేదలు ఎవరైనా వచ్చి తమను ఆదుకుంటారనని ఎదురుచూస్తున్నారు. శివారు ప్రాంతం కావడంతో విపరీతమైన దోమలు కుట్టడంతో పాటు పురుగుపుట్రా కన్పిస్తున్నాయి. వీరి బాధను చూసిన ఇస్కాన్‌ వారు రోజూ రెండు పూటల అన్నపానాలు అందిస్తున్నారు. గుడ్డి మబ్బులోనే భోజనం చేస్తున్నారు.  ఓరీ దేవుడా నీవేమార్గం చూపాలయ్యాని పేద ప్రజలు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదలమని చెబుతున్నారు.... విజయనగర్‌ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లో ఇళ్లు వేసుకుని పాలకులు, అధికార కోపానికి బలైన నిరాశ్రయులు. ఇళ్లు ఏర్పాటు చేసుకునేందుకు వారు పడ్డ తిప్పలు, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. వారి మాటల్లోనే...

 

కడుపుమీద కొట్టారు

నా కోడలు గాయత్రి ఐదు నెలలు గర్భిణి. ఇళ్ల తొలగించే ముందు అడ్డుపడితే తోపులాటలో సంపులో పడింది. ఓ వైపు కోడలు, మనవరాలు గీతిక ఏడుస్తున్నా బలవంతంగా ఇంటిని పీకేశారు. ఇల్లు కట్టేందుకు రూ. 5 లక్షల వరక ఖర్చైంది. ఇల్లు కట్టుకునేందుకు నాది, నా కోడలు బంగారు(ఏడు తులాలు) తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాం. నా కొడుకు గోపీ అప్పు చేసి కాస్త డబ్బు తెచ్చాడు. ఇప్పుడేమో ఇటుక పెళ్లలు తప్ప ఏమీ లేదు. ఇంత దారుణం పగవానికి కూడా జరగకూడదు. వీళ్లేం మనుషులయ్యా. కడపుమీద కొట్టారు.

– రత్నమ్మ

 

నలుగురు ఆడ పిల్లలు సార్‌..

కాలు విరగడంతో ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నా. నా భార్య తిరుపాలమ్మే ఆర్డీటీలో పని చేస్తూ కుటుంబాన్ని చూస్తోంది. నాకు నలుగురు పిల్లలు. అనూష, శిరీష, అక్షిత, లిఖిత. ఇక్కడ స్థలమిస్తామంటే రూ 1.80 లక్షలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నాను. డ్వాక్రా సంఘంలో రూ. 50 వేలు, వడ్డీకి రూ.60 వేలు అప్పు తెచ్చుకున్నాం. కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక్క రోజులో కూల్చేశారు. ఎవరైనా వచ్చి మాకు న్యాయం చేస్తారానని ఎదురుచూస్తున్నాం.

– సుంకన్న, తోపుడుబండిలో కూరగాయలమ్మే వ్యక్తి

 

పిల్లలను చూసేనా దయచూపండి

నేను నా తమ్ముడు భరత్‌ ఇద్దరు కలసి ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాం. ఇందుకోసం సంవత్సరాలుగా దాచుకున్న డబ్బుతో పాటు ఫైనాన్స్‌ తీసుకుని ఇంటికి వెచ్చించా. చూడండి సార్‌ ఎంత దారుణమో. నాకు ముగ్గురు పిల్లలు, నా తమ్మునికి ఇద్దరు పిల్లలు. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. రూ. 6 లక్షలతో కట్టిన ఇళ్లును కూల్చేశారు. మేము కోలుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఈ ఇటుక పెళ్లలమధ్యే పడుకుంటున్నాం. చిన్నపిల్లలను చూసైనా మాపై దయ చూపండి.

– జి. హమ్రారావు, టీ కొట్టు నిర్వాహకుడు, రాజస్థానీ

 

ముఖాలు ఎలా చూపించేది?

వేణుగోపాల్‌ నగర్‌లో నివాసముండే వాళ్లం. నా భర్త వేణుగోపాల్, నేను తోపుడుబండ్లపై స్టీల్‌ సామాన్ల వ్యాపారం చేసే వాళ్లం.  ఇక్కడ ఇళ్లు ఇస్తున్నారని తెలిసి బంధువులు, వడ్డీ వ్యాపారుల నుంచి రూ.4.5 లక్షలు అప్పుగా తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్నాం. అనంతపురంలోనే సొంతిళ్లు కట్టుకుంటున్నామని ఆనందంపడ్డాం. ఏం చేద్దాం సార్‌ మా అదృష్టం ఇలా ఏడ్చింది. ఇళ్లను కూల్చేశారు. బంధువులకు ముఖాలు ఏలా చూపించాలి. రాత్రి వేళల్లో పడుకునేందుకు భయమవుతోంది. ముగ్గురు చిన్నపిల్లలున్నారు. ఎవరితో చెప్పుకోవాలి మా బాధ.

- పవిత్ర, చిరు వ్యాపారి

 

జెండా మోసినందుకు బాగానే బుద్ధి చెప్పారు

పదిహేనేళ్లుగా టీడీపీ కార్యాకర్తగా ఉన్నా. ఇంటికోసం ప్రతిసారి అర్జీలిచ్చి సాలైపోయింది. ఏదో మా ప్రభుత్వం వచ్చిందని ధైర్యంతో రూ 1.70 లక్షల ఖర్చుతో ఇల్లు కట్టుకున్నా. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి జోక్యంతో నా ఇంటిని పీకేశారు. ఇప్పుడు రోడ్డుమీద పడ్డాం. మా పరిస్థితేంటి?టీడీపీ జెండా మోసినందుకు బాగానే బుద్ధి చెప్పారు.

–రమణ, టీడీపీ కార్యకర్త

 

ఇంత అన్యాయమా..?

నా భర్త జిలాన్‌ బాషా టీడీపీ కార్యకర్త. ఆటో నడుపుతాడు. నేను టైలర్‌గా గుడ్డలు కుట్టి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నా. రూ.లక్ష వరకు అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో ఉన్నట్లుండి ఇల్లు తొలగించారు. ఇద్దరు పిల్లలు మన్సూర్, నిహాతస్లీం చదువుకుంటున్నారు. అప్పులు కట్టాలా..వారిని చదివించాలా అర్థం కావడం లేదు. రాత్రి వేళల్లో నిరాశ్రయులమైన మా అవస్థలు దేవునికెరుక. ఇక్కడే వేసిన టెంట్‌ కిందే పడుకుంటున్నాం. ఇంత ఘోరం ఎక్కడా లేదయ్యా.

- హబీబా, టైలర్‌

 

న్యాయం చేసే వరకు వెళ్లేది లేదు

నా భర్త నగేష్‌ అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఇళ్లలో పని చేసి పిల్లలు అనిల్‌కుమార్, నందకిషోర్‌ను చదివించుకుంటున్నా. కూలి పని చేసి సంపాదించిన సొమ్ముతో పాటు  రూ.1.5 లక్షలు అప్పు చేసి ఇళ్లు కట్టించుకున్నా. ఇప్పుడేమో ఇళ్లను కూల్చేశారు. నాకు దిక్కెవరు. పిల్లలను ఏవిధంగా చూసుకోవాలి. అప్పు ఎలా తీర్చాలి. ఇల్లు కూల్చేముందు ‘అయ్యా మీ కాళ్లు పట్టుకుంటా. కూల్చొద్దండి’ అని వేడుకున్నా. పక్కకు నెట్టి కూల్చేశారు. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదు.

– భారతి, వితంతువు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement