పడిపోయిన క్రేన్, ధ్వంసమైన విగ్రహం
క్రేన్ కూలి వినాయక విగ్రహం ధ్వంసం
Published Thu, Sep 15 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
బంజారాహిల్స్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విగ్రహాన్ని క్రేన్ సహాయంతో లారీలోకి చేర్చే క్రమంలో విగ్రహం కుప్పకూలింది. బంజారాహిల్స్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్ నెం. 14లోని వెంకటేశ్వరనగర్‌లో బంజారా యూత్ అసోసియేషన్ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలోని మండపంలో 18 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహం ఒంటి గంట ప్రాంతంలో భారీ క్రేన్ సహాయంతో వినాయకుడిని ఆలయ ముఖద్వారం పై నుంచి రోడ్డుపై ఉన్న లారీలోకి చేర్చుస్తుండగా క్రేన్ హుక్కు ఊడిపోయింది.
దీంతో క్రేన్ ఒక వైపునకు ఒరిగిపోవడంతో ఆలయ ముఖద్వారం పై నుంచే విగ్రహం కిందపడి కుప్పకూలింది. లారీలోకి విగ్రహాని ఎక్కించే దృశ్యాన్ని తిలకించేందుకు వందలాది మంది అక్కడికి వచ్చారు. అయితే.. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు. సరిగ్గా విగ్రహం కూలిన చోటే ఓ బాలుడు నిలబడి.. గణేశుడ్ని క్రేన్‌లోకి ఎక్కించే దృశ్యాన్ని చూస్తున్నాడు. విగ్రహం పడిపోతున్న విషయం గమనించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ ఆ బాలుడిని క్షణాల్లో అక్కడి నుంచి పక్కకు లాగడంతో పెనుప్రమాదం తప్పింది. క్రేన్ సామర్థ్యం తక్కువగా ఉండటం, విగ్రహం ఎత్తు, బరువు ఎక్కువగా ఉండటం ఈ ఘటనకు కారణంగా పోలీసులు నిర్ధారించారు.
మరో క్రేన్ను తెప్పించి, రెండు గంటల అనంతరం కిందపడ్డ విగ్రహాన్ని సరి చేసి లారీలోకి ఎక్కించి ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కాగా, ఘటనాస్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఏడీఈ గోపాలకృష్ణ వచ్చి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఘటనా స్థలాన్ని బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు.
Advertisement