ఆశల పల్లకీలో తమ్ముళ్లు
► మంత్రి పదవుల కోసం ఎదురుచూపు
► రేసులో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి
► మరో వైపు ఆనం రామనారాయణరెడ్డి ప్రయత్నాలు
► సీఆర్‌డీఏకు పరిమితం కానున్న మంత్రి నారాయణ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారంతో జిల్లా టీడీపీ నాయకులకు ఆశలు చిగురించాయి. జూన్‌లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులు మంత్రి పదవిపై ఆశలుపెట్టుకున్నారు. అందులోభాగంగా అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీలో అనుభవ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ సోమిరెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. అయితే సోమిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో తమ ఉనికికే ప్రమాదం అని మరోవర్గం అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిసింది.
జూన్, జూలైలో జరిగే మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజికవర్గంలో ఇద్దరికి చోటు ఉంటుందని టీడీపీ శ్రేణులు గట్టిగా చెబుతున్నారు. సోమిరెడ్డికి ఇస్తే పార్టీకి పెద్దగా ప్రయోజన ఉండదని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద తమ వాదనను వినిపించినట్లు తెలిసింది. సోమిరెడ్డికి బదులు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఇస్తే అటు ప్రకాశం, ఇటు నెల్లూరు జిల్లాకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం వద్ద చెప్పినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న సోమిరెడ్డి లోకేష్ ద్వారా మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగానే లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సోమిరెడ్డి విలేకరులు సమావే శం ఏర్పాటు చేసి డిమాండ్ చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈసారి మంత్రి వర్గంలో సోమిరెడ్డికి స్థానం కల్పించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
నారాయణ సీఆర్‌డీఏ పరిమితమా?
రాష్ట్ర మున్సిపల్‌శాఖా మంత్రి నారాయణను సీఆర్‌డీఏకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆయనకు అప్పగించనున్నట్లు సమాచారం. అదే జరిగితే మున్సినల్‌శాఖను రెడ్డి సామాజికవర్గానికి కేటాయిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులోభాగంగా సోమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో మున్సిపల్‌శాఖ ఎవరికి కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూ డా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆనంకు మంత్రి పదవి ఇవ్వటానికి వీల్లేదని ఓ వర్గం బలంగా పట్టుబడుతోంది. అదే జరిగితే తాము పార్టీలో ఉండే ప్రసక్తిలేదని స్పష్టం చేస్తున్నారు. రామనారాయణరెడ్డి మంత్రి అయితే నెల్లూరులో ఆనం వివేకా చెలరేగిపోయే ప్రమాదం ఉందని టీడీపీలోని ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లో రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానం వద్ద తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం