MLC somireddy
-
ఆలయాల అభివృద్ధికి కృషి
నెల్లూరు రూరల్: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దచెరుకూరు, అల్లీపురంలోని వివిధ ఆలయాల ధర్మకర్తల పాలకమండళ్ల సభ్యుల ప్రమాణస్వీకారాన్ని అల్లీపురం వీరాంజనేయస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెద్దచెరుకూరులోని రామాలయం, శివాలయం, అల్లీపురం సీతారామాలయం, వీరాంజనేయ స్వామి ఆలయాలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేశామని వివరించారు. నవాబుపేట నుంచి గుడిపల్లిపాడు వరకు రెండు లేన్ల రోడ్డు అభివృద్ధికి రూ.10 కోట్లను కేటాయించామని, త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ పనులను వేగవంతం చేసిందని, పెన్నా బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని వివరించారు. అనంతరం మాజీ మంత్రి, టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. సోమిరెడ్డి నాయకత్వంలో అల్లీపురం, పెద్దచెరుకూరు గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. ఈ ప్రాంతంలోని చెత్తడంపింగ్ యార్డు, రైస్‌మిల్లులను తొలగించి, రింగ్‌రోడ్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని చెప్పారు. మైపాడు బీచ్ వరకు రోడ్డును అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. అనంతరం ఆలయ పాలకవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలతో సత్కరించారు. విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కోడూరు కమలాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రెడ్డి, కార్పొరేటర్ మేకల రామ్మూర్తి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనం జయకుమార్‌రెడ్డి, అల్లీపురం వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ బండి శ్రీకుమార్రెడ్డి, రామమందిర చైర్మన్ శివశంకర్‌రెడ్డి, పెద్దచెరుకూరు శివాలయ చైర్మన్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామాలయ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆశల పల్లకీలో తమ్ముళ్లు
► మంత్రి పదవుల కోసం ఎదురుచూపు ► రేసులో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ► మరో వైపు ఆనం రామనారాయణరెడ్డి ప్రయత్నాలు ► సీఆర్డీఏకు పరిమితం కానున్న మంత్రి నారాయణ? సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారంతో జిల్లా టీడీపీ నాయకులకు ఆశలు చిగురించాయి. జూన్‌లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులు మంత్రి పదవిపై ఆశలుపెట్టుకున్నారు. అందులోభాగంగా అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీలో అనుభవ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ సోమిరెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. అయితే సోమిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో తమ ఉనికికే ప్రమాదం అని మరోవర్గం అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిసింది. జూన్, జూలైలో జరిగే మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజికవర్గంలో ఇద్దరికి చోటు ఉంటుందని టీడీపీ శ్రేణులు గట్టిగా చెబుతున్నారు. సోమిరెడ్డికి ఇస్తే పార్టీకి పెద్దగా ప్రయోజన ఉండదని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద తమ వాదనను వినిపించినట్లు తెలిసింది. సోమిరెడ్డికి బదులు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఇస్తే అటు ప్రకాశం, ఇటు నెల్లూరు జిల్లాకు ఉపయోగకరంగా ఉంటుందని అధిష్టానం వద్ద చెప్పినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సోమిరెడ్డి లోకేష్ ద్వారా మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగానే లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సోమిరెడ్డి విలేకరులు సమావే శం ఏర్పాటు చేసి డిమాండ్ చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈసారి మంత్రి వర్గంలో సోమిరెడ్డికి స్థానం కల్పించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన వర్గీయులు హెచ్చరిస్తున్నారు. నారాయణ సీఆర్డీఏ పరిమితమా? రాష్ట్ర మున్సిపల్‌శాఖా మంత్రి నారాయణను సీఆర్డీఏకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆయనకు అప్పగించనున్నట్లు సమాచారం. అదే జరిగితే మున్సినల్శాఖను రెడ్డి సామాజికవర్గానికి కేటాయిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులోభాగంగా సోమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో మున్సిపల్‌శాఖ ఎవరికి కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూ డా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆనంకు మంత్రి పదవి ఇవ్వటానికి వీల్లేదని ఓ వర్గం బలంగా పట్టుబడుతోంది. అదే జరిగితే తాము పార్టీలో ఉండే ప్రసక్తిలేదని స్పష్టం చేస్తున్నారు. రామనారాయణరెడ్డి మంత్రి అయితే నెల్లూరులో ఆనం వివేకా చెలరేగిపోయే ప్రమాదం ఉందని టీడీపీలోని ఓ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లో రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానం వద్ద తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం -
ఇలాగే నిధులిస్తే పోలవరం కష్టమే?: సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందే సహాయం ఇలాగే ఉంటే పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తవడం కష్టమేనని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కనీసం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులైనా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో ఆయన మంగళవారం చర్చ ప్రారంభించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి పీతల సుజాత సభలో సమత్వ ప్రతిజ్ఞ చేయించారు. మహిళలపై ఎమ్మెల్సీ ఎ.లక్ష్మి శివకుమారి పాడిన పాట సభలో ఆకట్టుకుంది. రోజా సస్పెన్షన్ రద్దు చేయాలి..: బోస్ ప్రభుత్వానికి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. రుణ మాఫీ నిబంధనలు సడలించండి..: ఉమ్మారెడ్డి అప్పుల బాధతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకైనా రైతు రుణ మాఫీలోని లక్షన్నర పరిమితిని తొలగించాలని మండలిలో వైఎస్సార్ సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కోరారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడారు. దీనిపై వ్యవసాయ మంత్రి పి. పుల్లారావు బదులిస్తూ.. లక్షన్నర పరిమితికే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాట్లాడారు. -
రోజాపై రౌడీషీట్ తెరవాలి : సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉపయోగించే భాషపై రౌడీషీట్ తెరవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తక్షణమే రోజాను స్పీకర్ ఐదేళ్లపాటు బహిష్కరించాలన్నారు. మహిళలు సిగ్గుతో తలదించుకునేలా రోజా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేస్తున్న మందకృష్ణ: గాలి ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణకు నిజంగా ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే మాదిగ సామాజికవర్గ ప్రజలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సిద్ధిపేట నుంచి ఉద్యమం ప్రారంభించాలని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచించారు. కేసీఆర్ ముందు నోరెత్తే దమ్ములేని మందకృష్ణ.. ఇక్కడ చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు.