ఇలాగే నిధులిస్తే పోలవరం కష్టమే?: సోమిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందే సహాయం ఇలాగే ఉంటే పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తవడం కష్టమేనని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కనీసం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులైనా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసన మండలిలో ఆయన మంగళవారం చర్చ ప్రారంభించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి పీతల సుజాత సభలో సమత్వ ప్రతిజ్ఞ చేయించారు. మహిళలపై ఎమ్మెల్సీ ఎ.లక్ష్మి శివకుమారి పాడిన పాట సభలో ఆకట్టుకుంది.
రోజా సస్పెన్షన్ రద్దు చేయాలి..: బోస్
ప్రభుత్వానికి నిజంగా మహిళలపై గౌరవం ఉంటే ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.
రుణ మాఫీ నిబంధనలు సడలించండి..: ఉమ్మారెడ్డి
అప్పుల బాధతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకైనా రైతు రుణ మాఫీలోని లక్షన్నర పరిమితిని తొలగించాలని మండలిలో వైఎస్సార్ సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కోరారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడారు. దీనిపై వ్యవసాయ మంత్రి పి. పుల్లారావు బదులిస్తూ.. లక్షన్నర పరిమితికే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాట్లాడారు.