గుత్తిరూరల్ : ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రబీ సీజన్‌లో బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాల మంజూరు 40 శాతం మాత్రమే పూర్తయినట్లు లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ జయశంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ జయశంకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రూ.4,400 కోట్ల రుణాలు చెల్లించి ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరామన్నారు.
స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ రూ.382 కోట్లు రుణాలను అందించామని మార్చి ఆఖరు లోగా రూ.931 కోట్ల రుణాలు చెల్లించి లక్ష్యం పూర్తి చేయాలని ఆయన బ్యాంకర్లకు ఆదేశించారు. 2017–18లో సబ్సిడీ రుణాల మంజూరుకు ఓబీఎంఎస్ అనే పోర్టల్‌లో నమోదు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వెలుగు, మెప్మా క్రెడిట్ లింకేజ్ త్వరగా లింక్ చేయాలన్నారు. రుణాల రెన్యూవల్‌లను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఆర్‌ఎం జయసింహారెడ్డి, గుత్తి సిండికేట్ బ్యాంకు ఫీల్డ్ అధికారిణి పుష్పవాణి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రత్నకుమార్, ఏసీలు నాగరాజు, మల్లికార్జున, వెలుగు, మెప్మా సిబ్బంది బ్యాంకు మిత్ర రాజు పాల్గొన్నారు.
పెద్దనోట్ల రద్దుతో తగ్గిన రుణాల మంజూరు
Published Wed, Jan 25 2017 11:03 PM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
Advertisement
Advertisement