![వాహన కొనుగోళ్లు ఢమాల్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/61483205610_625x300.jpg.webp?itok=57iy8o9-)
వాహన కొనుగోళ్లు ఢమాల్
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ...
- ద్విచక్రవాహనాలపై ఎక్కువ ప్రభావం
- మిగతా వాహనాలకూ తగ్గిన డిమాండ్
అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలో ఉన్న ద్విచక్రవాహన షోరూంలో రెండు నెలల వ్యవధిలో దాదాపు 50 శాతం వ్యాపారం పడిపోయింది. 2015 నవంబర్‌లో 845 వాహనాలు, డిసెంబర్‌లో 638 వాహనాలను విక్రయించిన నిర్వాహకులు 2016 నవంబర్‌లో 509, డిసెంబర్‌లో 260 వాహనాలు మాత్రమే విక్రయించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని షోరూంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. - అనంతపురం సెంట్రల్
పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ప్రజల వద్ద నగదు లావాదేవీలు పూర్తిగా మందగించాయి. బ్యాంకులు ఇచ్చే డబ్బులు కనీస అవసరాలకే సరిపోవడం లేదు. దీంతో ప్రజలు సౌకర్యాలపై వెచ్చించే ఖర్చులను పూర్తిగా తగ్గించేశారని తెలుస్తోంది. మనిషి జీవితంలో వాహనం ఒక భాగమైంది. ప్రతి పనికీ వాహనం వినియోగించే పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్థోమతను బట్టి ద్విచక్రవాహనం, కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరుకు రవాణాకు ఉపయోగించే వాహనాలు కూడా పెరిగాయి. ప్రతి ఏడాదీ వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2008లో 1,49,670 ఉన్న ద్విచక్రవాహనాలు నేటికి 2.22,603 చేరుకున్నాయి. ఆటోలు, కార్లు, లారీలు ఇలా అన్ని వాహనాలూ 2008కి నేటికీ రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ప్రతి నెలా వందల్లో, ప్రతి ఏడాదీ వేలల్లో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.
మందగించిన కొనుగోళ్లు
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత వాహన కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. ఎక్కువ శాతం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వాహనాలపై ప్రభావం చూపింది. మరికొన్ని నెలల పాటు ఈ ప్రభావం ఇలాగే ఉంటుందని వాహన షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు.
నెలవారీగా ప్రధానమైన వాహన కొనుగోళ్లలో వ్యత్యాసం ఇలా...
వాహనాల రకం 2015 అక్టోబర్ 2015 అక్టోబర్ 2015 నవంబర్ 2016 అక్టోబర్ 2016 నవంబర్ 2016 డిసెంబర్
మోటారు కారు 156 0 221 204 207 97
ఆటో రిక్షాలు 232 219 286 238 280 135
గూడ్స్ వాహనాలు 163 124 145 138 210 57
ద్విచక్రవాహనాలు 2712 3867 3768 2795 3652 1158
ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది
వాహనాల కొనుగోళ్లు గతంతో పోలిస్తే తగ్గాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఎక్కువ ప్రభావం చూపింది. దీనివలన రిజిస్ట్రేషన్, ఇతర పన్నులు రాక ప్రభుత్వానికి ఆదాయం కూడా కొంతమేర తగ్గింది.
- శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం