‘చిన్న’బోయిన ‘పెద్ద’ పండుగ | big notes effect ..samkranthi festival | Sakshi
Sakshi News home page

‘చిన్న’బోయిన ‘పెద్ద’ పండుగ

Published Sat, Jan 7 2017 10:47 PM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM

‘చిన్న’బోయిన ‘పెద్ద’ పండుగ - Sakshi

‘చిన్న’బోయిన ‘పెద్ద’ పండుగ

  •  ‘సంక్రాంతి’పై పెద్దనోట్ల రద్దు ప్రభావం
  • ∙వెలవెలబోతున్న వస్త్ర దుకాణాలు
  • ∙భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు
  • ∙పల్లెల్లో కానరాని సంప్రదాయ శోభ
  • ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా ఎవరి రోజువారీ జీవితక్రమం వారికి ఉంటుంది. వారి వారి వృత్తివ్యాపకాలను బట్టి ఆ క్రమంలో ఎవరి నిత్యానుభవాలు వారికి ఉంటాయి. అయితే ఒకేరోజు ఓ జాతి జీవితం మొత్తాన్ని ఉత్తేజభరితంగా మార్చేవి పండుగలే. తెలుగు జాతి జరుపుకొనే పండుగల్లో విలక్షణమైనది.. ‘పెద్ద పండుగ’ అనే పర్యాయపదంతో తన స్థాయిని చాటుకునే సంక్రాంతి. తెలిమంచు పరుచుకునే వేకువలను హరిదాసు కీర్తనలకు వేదికలుగా; వాకిళ్లను నెలముగ్గులు విరిసే పూదోటలుగా; లోగిళ్లను ఆనందపు కొలువులుగా మార్చే సంక్రాంతి ఏటా ‘హేమంతంలో వచ్చే వసంతం’ అని చెప్పొచ్చు. జీవనోపాధి రీత్యా పుట్టినగడ్డలను వీడి, ఎక్కడెక్కడికో వెళ్లిన వారు, స్థిరపడిన వారు.. ధనిక, పేద తేడా లేకుండా... తల్లికోడి రెక్కల సందిట చేరే పిల్లల్లా సొంత ఊళ్లకు చేరే పండుగ సంక్రాంతి. ఏటా జనవరి నెల నడుమన తెలుగుజాతి జరుపుకొనే ‘మూడురోజుల మహోత్సవం’ ఈ ఏడాది కళ తప్పింది. సూర్యోదయానికి ముందే తూరుపున పొడసూపే వెలుగురేకల్లా.. ఏటా ఇప్పటికే ఊరూవాడా పెద్ద పండుగ సందడి కనిపించేది. పెద్దనోట్ల రద్దుతో యావద్భారతంపై పరుచుకున్న క్రీనీడ సంక్రాంతి పైనా పడింది. ఈ నేపథ్యంలో ఆ పరిణామాన్నీ, కళావిహీనంగా మారిన వాతావరణాన్నీ వివరిస్తూ..
     ‘సాక్షి’ ఫోకస్‌.... 
     
    రిపోర్టింగ్‌ :  పెనుబోతుల విజయ్‌కుమార్, మండపేట 
     
    మండపేట :
    తెలుగు వారి సంస్కృతీ సాంప్రదాయాలకు శోభాయమానంగా అద్దం పట్టే  సంక్రాంతి ఈ ఏడాది కళ తప్పింది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు వెలవెలబోగా ఆ ప్రభావం ఇప్పుడు పెద్ద పండుగపైనా పడుతోంది. నోట్ల రద్దు జరిగి రెండు నెలలైనా ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో గాడిన పడకపోవడంతో ఆశించిన స్థాయిలో పండుగ అమ్మకాలు లేక వ్యాపారులు అయోమయంలో ఉన్నారు. కొత్తగా ఇంటికి వచ్చే అల్లుళ్లకు కానుకలిచ్చేదెలా అన్న ఆలోచనలో పేద, మధ్యతరగతి కుటుంబాల వారున్నారు. 
    సంక్రాంతి పల్లె వాసుల పండుగ. ప్రధానంగా రైతుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలతో నాలుగు రోజుల పాటు ఆబాలగోపాలాన్ని అలరించే పెద్ద పండుగకు జిల్లాలోని పల్లెలు పెట్టింది పేరు. జిల్లాలో అధికశాతం మంది వ్యవసాయాధారిత కుటుంబాల వారే. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది  లక్షలకు పైగా  రైతులు ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో జిల్లాలో వాడవాడలా సంక్రాంతి పండును ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంట చేతికొచ్చిన ఆనందంలో ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పట్టణాలు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా సంక్రాంతికి స్వస్థలాలకు తిరిగిరావడం పరిపాటి. పితృదేవతలను గుర్తుచేసుకుంటూ వారికి తర్పణాలు ఇవ్వడంతో పాటు వారి పేరుమీద దుస్తులు, బియ్యం పంపిణీ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడాదిపాటు తమకు సేవలందించిన కులవృత్తుల వారికి యజమానులు ధాన్యం, నగదు రూపంలో కానుకలు అందజేస్తారు. తమకు పాడినిచ్చే పశువులకు పూజలు నిర్వహించడం, గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ధనుర్మాసం ప్రారంభం నుంచే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. తెలతెలవారుతూనే హరినామ సంకీర్తనలతో హరిదాసులు, ఇంటి ముంగిళ్లను ముత్యాల ముగ్గులతో తీర్చిదిద్దే పల్లెపడుచులు, డూడూ బసవన్నలు చేసే విన్యాసాలు, ‘పప్పుదాకలో పడిపోతున్నా’నంటూ కూనిరాగాలు తీసే కొమ్మదాసులు, ఏడాదికోమారంటూ సంక్రాంతి కళాకారులు చేసే సందడి, ‘ఎప్పుడెప్పుడు పండుగా ఏడాది పండుగ’ అంటూ భోగిమంటలకు పిడకల వేటలో చిన్నారుల కోలాహలం ఇవన్నీ సంక్రాంతి శోభలో ఒక భాగమైతే.. సంక్రాంతిని పురస్కరించుకుని ఇళ్లకు బూజులు దులిపి పెయింటింగ్స్‌ వేయించడం మొదలు ఇంటికి వచ్చే బంధువుల కోసం పిండి వంటల తయారీ, నూతన వస్రా్తల కొనుగోలు, తమతమ ఇళ్లు, పొలాలు తదితర వాటిలో పనిచేసే సిబ్బందికి వస్రా్తలు, సంక్రాంతి కానుకలు అందజేయడం వంటివన్నీ ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఉంటాయి. కొత్తగా పెళ్లిళ్లు జరిగిన ఇళ్లల్లో సంక్రాంతి సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వచ్చే అల్లుడికి బంగారం, వస్తు రూపంలో పండుగ కానుక అందజేయడం ఆనవాయితీ. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు మేర వాణిజ్యం జరుగుతుంటుంది.  ఏడాదిలో 11 నెలలు జరిగే వ్యాపారం ఒకటైతే క్రిస్మస్‌ నుంచి సంక్రాంతి పండుగ వరకు జరిగే వ్యాపారం ఒక ఎత్తని వ్యాపారవర్గాలంటున్నాయి.  
     
    కానుకలిచ్చేదెలా ? 
    కొత్తగా పెళ్లిళ్లు జరిగిన పేద, మధ్యతరగతి కుటుంంబాల్లో  అత్తమామల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నోట్ల రద్దుతో కిందమీద పడి పెళ్లి చేస్తే ఇప్పుడు ఇంటికొచ్చే కొత్త అల్లుడికి కానుక ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్నారు. పెళ్లయిన తర్వాత తొలిసారి పండుగకు వచ్చే అల్లుళ్లకు బంగారం, వాహన రూపాల్లో కానుకలు ఇవ్వడం పరిపాటి. ధాన్యం డబ్బులు చేతికందక కానుకలిచ్చేదెలాగని రైతువర్గాల వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా  సంక్రాంతి సీజ¯ŒSలో కోట్లాది రూపాయలు మేర బంగారం అమ్మకాలు జరిగేవి. వినియోగదారులతో కిటకిటలాడే జ్యూయలరీ షాపులు ఈసారి అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. 
     
    25 శాతం కూడా జరగని వ్యాపారం
    పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఇప్పటికే క్రిస్మస్, నూతన సంవత్సర వ్యాపారం  చాలా వరకు తగ్గిపోయింది. ఆయా పండుగల సందర్భంగా జిల్లాలో వాణిజ్య కేంద్రాలైన రాజమహేంద్రవరం, కాకినాడలతో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, తుని, పెద్దాపురం తదితర పట్టణాల్లో ఏటా జరిగే వ్యాపారంతో పోలిస్తే 25 శాతం మేర వ్యాపారం కూడా జరగలేదు. వస్త్ర వ్యాపారంతో పాటు పెద్ద ఎత్తున టీవీలు, ఫ్రిజ్‌లు తదితర విద్యుత్‌ గృహోపకరణాలు, సెల్‌ఫోన్లు అమ్మే వారు రకరకాల ఆఫర్లతో ముందుకు వస్తుంటారు. ఏటా ఈ సీజ¯ŒSలో జనంతో కిక్కిరిసి ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య కూడళ్లు, రోడ్లు ఇప్పుడు అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. పెద్ద పండుగపై గంపెడాశలు పెట్టుకుంటే ఇప్పుడు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. పండుగ అమ్మకాల కోసం తెచ్చిన స్టాకులు ఉండిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. రైతుల చేతికి పూర్తిస్థాయిలో సొమ్ములు లేకపోవడమే వ్యాపారాల క్షీణతకు కారణమంటున్నారు. 
     
    కర్షకుల ఇంట కొరవడ్డ హర్షం 
    ఈ సంక్రాంతికి రైతుల ఇంట పండుగ కాంతులు కరువయ్యాయి. పెద్ద పండుగ వాణిజ్యం అంతా చాలా వరకు తొలకరి ఫలసాయంపైనే ఆధారపడుతుంది. వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని పెద్దనోట్ల రద్దు సంక్షోభం ఆవిరి చేసింది. మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోళ్లు జరిగినా చేతికి చిల్లిగవ్వ దక్కని పరిస్థితి. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములున్నా రూ.రెండు వేల కోసం రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి. తొలకరి సాగు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చేదారి లేక, దాళ్వా సాగుకు పెట్టుబడులు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రబీ నాట్లు పూర్తికావాల్సి ఉండగా పెట్టుబడులు పెట్టేందుకు సొమ్ములేక సాగు తీవ్ర జాప్యమవుతోంది. దీంతో రైతుల ఇంట పండుగ కాంతులు కరువవుతున్నాయి. తాజాగా ఏటీఏంలలో రూ.4,500 వరకు విత్‌డ్రాయల్‌కు అనుమతినిచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత ఫర్వాలేదనిపిస్తున్నా, పల్లెల్లో చాలా వరకు నగదు సంక్షోభం కొనసాగుతోంది. ఏటీఎంలు లేక నగదు కోసం బ్యాంకుల వద్ద పల్లె ప్రజలకు ఇక్కట్లు  తప్పడం లేదు. చాలా మంది ఇంటికి పెయింటింగ్స్‌ కూడా వేయించలేని పరిస్థితులతో పెయింటింగ్‌  వర్కర్లకు ఉపాధి కరువైంది. 
    బ్యాంకుల చుట్టూ తిరగడమే పనిగా ఉంది..
    ‘నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ధాన్యం అమ్మినా నగదు ఇంకా చేతికి రానే లేదు. బ్యాంకుల చుట్టూ  తిరగడమే సరిపోతోంది. తొలకరి పంట అపులింకా తీర్చనే లేదు. దాళ్వా పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొన్న ఆగస్టు చివర్లో మా అమ్మాయి పెళ్లి చేశాను. ఇప్పుడేమో పండగ వచ్చేస్తోంది. అల్లుడికి, వియ్యపు వారికి బట్టలు పెట్టాలి. ఇంకా లాంఛనాలు ఉంటాయి. పెళ్లి జరిగిన ఇల్లు కావడంతో మొదటి పండుగను బాగా జరుపుకుందామనుకున్నాం. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు మామిడికుదురు మండలం నగరానికి చెందిన మేడిచర్ల సుబ్బారావు. ఇది ఆయన ఒక్కడి ఆవేదనే కాదు.. పెద్ద పండుగ దగ్గరకొస్తున్న వేళ జిల్లావ్యాప్తంగా ఎంతోమంది రైతుల ఆక్రోశం ఇది. మట్టిని మథించి, సృష్టించిన పంటను అమ్మినా చేతిలో చిల్లిగవ్వ లేక, రెండో పంటకు పెట్టుబడులు లేక ఇబ్బందులు పడుతున్నా తరతరాలు వస్తున్న పెద్ద పండుగ సాంప్రదాయాన్ని ఏదోవిధంగా కొనసాగించుకోవాలన్న తపనతో వ్యవసాయాధారిత పేద, మధ్యతరగతి కుటుంబాల  వారు అగచాట్లు పడుతున్నారు. 
     
    అంతంత మాత్రంగానే జరుపుకోవాలి..
    పెద్ద నోట్ల దెబ్బతో ఈ ఏడాది సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించడం లేదు. నాలుగు ఎకరాలు సాగుచేస్తే ఆ నగదు సుమారు రూ.లక్ష బ్యాంకు ఖాతాలో పడింది. తీరా బ్యాంకుకు వెళితే రూ.2వేలు, రూ.4వేలు చొప్పున ఇచ్చారు. పాత బాకీలు కట్టలేదు. ఇబ్బందులు తీరలేదు. రూ.24 వేలు చొప్పున ఒకేసారి  ఇస్తే బాగుండేది. రబీ పనులకు సంబంధించి నగదు బ్యాంకు ఖాతా నుంచి తీసుకోడానికి వీలు లేక తీవ్ర ఇబ్బందులతో వెద సాగు  చేపట్టాను. మరో మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి అల్లుడు, కూతురు వస్తున్నారు. చేతిలో నగదు లేక ఈ పండుగ అంతంతమాత్రంగా జరుపుకోవాల్సి వస్తుంది.
    – పంపన సూర్యనారాయణ, రైతు, కాండ్రేగుల, పెదపూడి మండలం
     
    నగదు రహితంతో ఆనందం దూరం
    నా సొంత వ్యవసాయం 5 ఎకరాలతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. శిస్తులతో పాటు కూలీలకు పండుగ డబ్బులు ఇవ్వాలంటే అప్పు దొరికే పరిస్థితిలేదు. నగదు రహిత లావాదేవీల పుణ్యమాని రైతుల కుటుంబాల్లో సంక్రాంతి ఆనందం కరువైంది. బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాం. రబీ సీజ¯ŒSలో పెట్టుబడికి సోమ్ములు లేక  అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఏటా సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా జరుపుకునేవాళ్లం. ఈ ఏడాది పండుగ వస్తుందన్న ఆనందం లేదు.  
    – ముదునూరి సత్యనారాయణరాజు, రైతు, ఆత్రేయపురం 
     
    పనుల్లేక ఖాళీగా ఉన్నాం..
    సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి పెయింటింగ్‌  వర్కర్లకు  ఖాళీ ఉండేది కాదు. ఉన్న వాళ్లం సరిపోక బయటి నుంచి  కూలీలను పెట్టుకునేవాళ్లం. ఇప్పు డా పరిస్థితి  లేదు. నోట్ల రద్దుతో  చేతిలో డబ్బుల్లేక చాలామంది పెయింటింగ్స్‌ వేయించడం లేదు. వర్కర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది.
           – కొల్లి విశ్వనాథం, జగ్జీవన్‌రామ్‌ పెయింటింగ్‌ వర్కర్స్‌ సంఘం వ్యవస్థాపకుడు, మండపేట
     
    బంగారం అమ్మకాలు తగ్గిపోయాయి.. 
    సంక్రాంతి సీజ¯ŒSలో అల్లుళ్లకు కానుకలుగా  పెట్టేందుకు ఎక్కువగా ఆర్డర్లు వచ్చేవి. ఉంగరాలు, గొలుసులు, బ్రాస్‌లెట్లు తదితర బంగారు వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. ఈ సారి తయారీకి వచ్చే ఆర్డర్లు, అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం కూడా వ్యాపారం జరగడం  లేదు. 
    – మహంతి అసిరినాయుడు, జ్యూయలరీ షాపు, మండపేట 
     
    నెలరోజుల పనికి కూలిడబ్బులు లేవు..
    నెల రోజులుగా కూలి పనులకు వెళుతున్నాం. రైతుల  నుంచి రూ.10 వేల వరకు కూలి సొమ్ములు రావాల్సి ఉంది. పండగేమో  దగ్గరకు వచ్చేస్తోంది. ఇంటికి బంధువులు వస్తారు. మేము కొత్త బట్టలు తీసుకోవాలి. పిండివంటలు చేయించుకోవాలి. నెలరోజుల పాటు పనిచేసిన డబ్బులేవు. రైతుల దగ్గర పంట డబ్బులు లేక కూలీలు అందరూ ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారు.               
    – కాపారపు దుర్గారావు, 
    వ్యవసాయ కూలీ, మర్రిపాక, జగ్గంపేట మండలం
      
    పండుగ జరుపుకోవడం పెద్ద కష్టమే..
    సంక్రాంతి పండుగను జరుపుకోవడం పెద్ద కష్టంగానే ఉంది. నెల రోజుల క్రితమే మా కుమార్తెకు వివాహం చేశాం. అప్పట్లో పెద్దనోట్ల రద్దుతో బ్యాంకు నుంచి మా డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెండునెలలైనా ఇంకా ఇబ్బందులు అలానే ఉన్నాయి. ఈ పండుగ బాగా చేసుకోవాలనుకున్నాం. పరిస్థితిలో మార్పురాకపోవడం సమస్యగా ఉంది.
     
    –  పి.విద్యారావు, చెల్లూరు, రాయవరం మండలం
     
    పంట అమ్మినా చేత పైకం లేదు
    భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెతో కూడిన కుటుంబం మాది. మూడు ఎకరాల్లో పంట పండించా ను. పంటను ఒబ్బిడి చేసుకుని దాదాపు వంద బస్తాలు కమీష¯ŒS ఏజెంటు ద్వారా మిల్లర్‌కు విక్రయిం చాను. ధాన్యానికి రావాల్సిన సొమ్ములను మిల్లర్‌ ఖాతాలో వేశారు. డబ్బులు పడి రెండు వారాలు కావస్తున్నా పెద్ద నోట్ల రద్దుతో  విత్‌ డ్రాల పరిమితులతో డబ్బులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. చెమటోడ్చి పండించి నా వచ్చే పండుగలకు పైసల్లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. డబ్బులందక కూలీలకు వేతనాలు పూర్తిగా ఇవ్వలేదు. ఎరువుల దుకాణంలో అప్పు అలానే ఉంది. పండక్కి పిల్లలకు నూతన వస్రా్తలు కొనలేదు. ఇంట్లో పండుగ సరుకు లు కొనలేదు. మూడు ఎకరాల రైతునై ఉండీ, 100 బస్తాలు పండించిన ధీమా ఉండి.. చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితి ఏర్పడింది. 
    – అరిగెల సత్యనారాయణ, భీమనపల్లి శివారు సుదాపాలెం, ఉప్పలగుప్తంమండలం
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement