వర్షం తెచ్చిన నష్టం
ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో మండలంలోని రామన్నగూడెం శివారులో సాగు చేస్తున్న మిరప తోటలు నీట మునిగాయి. బుధవారం ఉదయం నుంచి గోదావరి వరద భారీగా రావడంతో సమీపంలోని మిరప తోటలు నీట మునిగాయి.
ఏటూరునాగారం : ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో మండలంలోని రామన్నగూడెం శివారులో సాగు చేస్తున్న మిరప తోటలు నీట మునిగాయి. బుధవారం ఉదయం నుంచి గోదావరి వరద భారీగా రావడంతో సమీపంలోని మిరప తోటలు నీట మునిగాయి. మొక్కలు నాటిన వారం రోజుల వ్యవధిలోనే తోటలు నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప విత్తనాలను కొనుగోలు చేసి 35 నుంచి 40 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుని నాటిన మొక్కలు కళ్ల ముందే పాడైపోవడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. గోదావరి వరదతో రామన్నగూడెంకు చెందిన రాందేని రమేష్ ఎకరం, శ్రీరాం నాగేంద్ర ఎకరన్నర, గారె నర్సింహ ఎకరం, తోట వీరయ్యకు చెందిన ఎకరం తోటలు నీట మునిగి వేర్లు కుల్లిపోయే దశకు చేరుకుంటున్నాయి. గోదావరి తగ్గిందని తోటలు సాగు చేసేందుకు మొక్కలు నాటగా.. ప్రకృతి తమ పాలిట శాపంగా మారిందని వారు బోరున విలపిస్తున్నారు వరద ఉధృతితో ఎకరాకు రూ. 10 వేల నష్టం వాటిల్లిందన్నారు.
దుగ్గొండిలో 5,150 హెక్టార్లలో పంట నష్టం
దుగ్గొండి : మండలంలోని గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికి వరకు 5,150 హెక్టార్(12875 ఎకరాలు)లలో పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వ్యవసాయాధికారి దయాకర్ అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో తుఫాను దెబ్బతిన్న పంటలపై బుధవారం సర్వే ప్రారంభించారు. నష్టపోయిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో తుపానుతో 3,500 హెక్టర్లలో పత్తి, 450 హెక్టార్లలో వరి, 1200 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించామన్నారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ ఊరటి మహిపాల్‌రెడ్డి, జంగిలి రవి, రాంచంద్రం, తాళ్లపెల్లి వీరస్వామి , వీఆర్‌ఓ జంగం రాజన్న ఉన్నారు.