ఎండుతున్న పంటలు | crops is drying | Sakshi
Sakshi News home page

ఎండుతున్న పంటలు

Published Wed, Aug 24 2016 5:41 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

ఎండుతున్న పంటలు - Sakshi

ఎండుతున్న పంటలు

పెద్దవూర: వర్షాభావ పరిస్థితులతో మండలంలోని పత్తి, కంది, పెసర పంటలు వాడుబట్టి ఎండిపోతున్నాయి. రూ. వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు వర్షాలు లేక కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పత్తి పంటను సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రచారం చేసినా మండల రైతులు దాని వైపే ఆసక్తి కనపర్చారు. జూన్‌లో సక్రమంగా వర్షాలు పడటంతో మండలంలో రైతులు 30వేల ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు విత్తారు. పత్తి చేలలో అంతరకృషి చేపట్టారు. పదిహేను రోజుల తర్వాత ఒక మోస్తారు వర్షం పడటంతో రైతులు పంట ఎదుగుదలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కాంప్లెక్స్‌ ఎరువులు, క్రిమి సంహారక మందులను పిచికారి చేశారు. కాని నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి, కంది, పెసర చేలు, బత్తాయి తోటలు వాడుబట్టి ఎండిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.  
ఎండిన పెద్దవాగు.. ఆందోళనలో రైతులు
మండలంలో ఎప్పుడు అన్ని కాలాల్లో నీటితో కళకళలాడే పెద్దవాగు ఎండిపోయింది. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 11ఏళ్లలో ఏనాడు వాగు ఎండిపోయిన దాఖలాలు లేవు. ఈ యేడాది వర్షాలు ఆశించిన మేర కురవక పోవడంతో భూములు పూర్తిగా తడిసి నీరు బయటకు వెళ్లిన పాపాన పోలేదు. పడిన వర్షాల వల్ల విత్తనాలు వేసుకోవడానికి కావాల్సిన పదును మాత్రమే అయ్యింది. వరదలు రాకపోవడంతో నాగార్జునసాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజీలోనే ఉంది. 
వందల ఎకరాల్లో సాగు:  పెద్దవాగు నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టి గుర్రంపోడ్, పీఏపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోనికి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణం కాకమునుపు వర్షాకాలంలోనే ఈ వాగులో నీరు ప్రవహించేది. ప్రాజెక్టు నిర్మాణంతో కాలువల ద్యారా ఎప్పటికప్పుడు చెరువులను నింపుతుండటం, జంటనగరాలకు కృష్ణాజలాలలను అందించే వాటర్‌ ప్లాంటును పదిహేను రోజుల కొకసారి కడుగుతుంటుండంతో నిత్యం నీళ్లు ప్రవహిస్తుంటాయి. దీంతో ఎప్పుడు నీరు ప్రవహిస్తుండంతో వాగు సమీపంలో భూములు ఉన్న రైతులు వాగులో విద్యుత్‌ మోటార్లు వేసుకుని పైపులైన్‌లు తీసుకుని సాగుచేసుకుంటున్నారు. మండలంలోని పెద్దవూర, ఈదులగూడెం, పిన్నవూర, బట్టుగూడెం, కొత్తగూడెం, తెప్పలమడుగు, లింగంపల్లి, పెద్దగూడెం, చిన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు వాగువెంట వరినాట్లు వేశారు. వాగును నమ్ముకుని వాగుకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు పైపులైన్లు వేసుకుని బత్తాయి తోటలు, పత్తి పంటను సాగుచేస్తున్నారు. వాగు ఎండిపోవడంతో వాగును నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని వాగు వెంట కొందరు వరి నాట్లు వేయగా, మరొకొంత మంది నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. గత నెల రోజులుగా సరైన వర్షాలు పడకపోవడంతో వరి, పత్తి, బత్తాయి తోటలను కాపాడుకోవటానికి నీరు సరిపోవడం లేదు. నీరు రాకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాగులో ఊరే నీళ్లు విద్యుత్‌ రాగానే అంతా ఒకేసారి మోటార్లు పెట్టుతుండటంతో చుక్క నీరు ఉండటం లేదు. కేవలం పెద్ద పెద్ద గుంతలు తీసుకుని మోటార్లు వేసుకున్న రైతులకు మాత్రమే అంతోకొంత నీరు అందుతుంది. పాలకులు, అధికారులు స్పందించి ఏఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల రైతులు వేడుకుంటున్నారు.
వాగును నమ్ముకుని సాగుచేస్తున్నాం– పబ్బు యాదగిరి, రైతు పెద్దవూర
వాగులో నిత్యం నీళ్లు వస్తుండటంతో వాగును నమ్ముకుని బత్తాయి తోటను సాగుచేస్తున్నాను. సరైన వర్షం పడకపోవడంతో ఈ సంవత్సరం వాగులో ఒక్కసారి కూడా నీళ్లు పారలేదు. వాటర్‌ ప్లాంటును శుభ్రం చేయగా వచ్చే వృథానీరు పదిహేను రోజులకు ఒకసారి వస్తాయి. ఈ నీటితోనే ఇన్ని రోజులు నెట్టుకొస్తున్నాము. వాగువెంట మోటార్లు ఎక్కువ సంఖ్యలో వేయటంతో వాగు ఎగువ భాగంలో ఉన్న రైతులకే ఆ నీళ్లు సరిపోతలేవు. బత్తాయి చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది.
 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement