ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Published Sat, Jul 30 2016 10:23 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
పట్టాదారు పాస్‌బుక్ కోసం రూ.4 వేలు లంచం
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
హుజురాబాద్ : కాసుల కోసం కక్కుర్తిపడిన మండలంలోని కందుగుల రెవెన్యూ కార్యదర్శి రూ.4 వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీకి రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కందుగులకు చెందిన మండ సదయ్య, ఆయన సోదరుడు జగపతి వ్యవసాయ భూమికి సంబంధించిన మ్యుటేషన్, పట్టా పాస్‌బుక్కుల కోసం మీసేవ కేంద్రంలో ఏడాదిక్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించినా అధికారులు పాస్‌బుక్కులు ఇవ్వలేదు. రేపుమాపు అంటూ కాలయాపన చేశారు. సదయ్యకు పాస్‌బుక్, ప్రోసిడింగ్ ఇచ్చేందుకు వీఆర్వో రాజ్‌కుమార్, వీఆర్‌ఏ రవీందర్ డబ్బులు అడిగారు. తాను గీతకార్మికుడినని, లంచం ఇచ్చే స్థితిలో లేనని మొరపెట్టుకున్నా వినలేదు. రూ.4 వేలు ఇస్తేనే పాస్‌బుక్కులు చేతికి వస్తాయని తేల్చిచెప్పారు. ఇదే విషయంపై ఇటీవల సదయ్య వీఆర్‌ఏతో గొడవపడ్డాడు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా, తహసీల్దార్‌ను కలిసినా ఫలితం లేకపోయింది. వీఆర్వో లంచం అడుగుతున్నాడని తహసీల్దార్ జగత్‌సింగ్‌కు ఫిర్యాదుచేశాడు. ఆ ఫిర్యాదు పత్రాన్ని వీఆర్వోకు ఇవ్వగా.. రాజ్‌కుమార్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో సదయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం ఆఫీస్‌కు వచ్చిన రాజ్‌కుమార్‌కు సదయ్య రూ.4 వేలు ఇవ్వబోగా.. ఆ మెుత్తాన్ని వీఆర్‌ఏకే ఇవ్వాలని సూచించాడు. దీంతో డబ్బులు వీఆర్‌ఏ రవీందర్ తీసుకుంటుండగా డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, సీఐలు సుందరిగిరి శ్రీనివాసరావు, వీరభద్రం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. నోట్లపై వేలి ముద్రలను సేకరించారు. వీఆర్వో గదిలో రికార్డులను పరిశీలించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.
తహసీల్దార్ సంజాయిషీ
మ్యుటేషన్, పట్టాపాస్‌బుక్ కోసం సదయ్య మీ సేవలో దరఖాస్తు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్‌లో పేరును నమోదు చేయకపోవడంతో ఏసీబీ డీఏస్పీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైతుపేరు ఎందుకు నమోదు చేయలేదని తహసీల్దార్ జగత్‌సింగ్‌ను ప్రశ్నించారు. కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు సెక్షన్ల వారీగా పరిశీలించారు. అన్‌లైన్ దరఖాస్తులను ఇన్‌వార్డులో ఎందుకు ఎంట్రీ చేయడంలే దని అడిగారు. తహసీల్దార్ సదయ్య పేరు ఎంట్రీ చేయకపోవడంపై తహసీల్దార్‌తో సంజాయిషీ రాయించుకున్నారు.
వేధింపులు భరించలేకనే..
–మండ సదయ్య, బాధితుడు
ఏడాదిగా పట్టాపాస్‌బుక్కల కోసం కార్యాలయం చుట్టూ తిరిగిన. అధికారులు రేపు..మాపు అంటూ వేధించిండ్రు. నాది, తమ్ముడిది పట్టా పాస్‌బుక్ కోసం లంచం ఇవ్వమన్నరు. పైసలు ఇచ్చేస్థోమత లేదని చెప్పినా కనికరించలేదు. వీఆర్వో, వీఆర్‌ఏ వేధింపులను భరించలేక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన. ఆయన కూడా పట్టించుకోలేదు. గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆ్రయించిన.
Advertisement