పాయింట్లపై పేచీ! | crts stops councelling | Sakshi
Sakshi News home page

పాయింట్లపై పేచీ!

Published Mon, Jun 12 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

పాయింట్లపై పేచీ!

పాయింట్లపై పేచీ!

– కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న సీఆర్టీలు
–  సాయంత్రం 6 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం

 
అనంతపురం ఎడ్యుకేషన్‌ : గతంలో ఎప్పుడూ లేని విధంగా కేజీబీవీ స్పెషలాఫీసర్లు, సీఆర్టీల బదిలీలకు సంబంధించి ప్రతిభ ఆధారిత పాయింట్లు పెట్టడం దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వీరికి రెగ్యులర్‌ టీచర్లులా పాయింట్లు కేటాయించి బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కేజీబీవీలో పనిచేసే సీఆర్టీలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఆయా  సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతకు సంబంధించిన పాయింట్లు రాష్ట్ర అధికారులు కేటాయించారు. బోధన, పిల్లలతో కలుపుగోలుతనం తదితర అంశాలకు సంబంధించి సుమారు 20 పాయింట్లు ఉన్నాయి. వీటిని ఆయా కేజీబీవీ స్పెషలాఫీసర్లే నిర్ణయించాల్సి ఉంది. ఇక్కడే ఎస్‌ఓలు చక్రం తిప్పారని సీఆర్టీలు ఆరోపిస్తున్నారు. అనుకూలమైన వారికి ఎక్కువ పాయింట్లు వేసుకుని తమకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. ముందుగా ఎస్‌ఓల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. కాసేపటికే ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. రాష్ట్ర అధికారులు రూపొందించిన సీనియార్టీ జాబితాలోనూ పాయింట్లు తప్పులతడకగా ఉన్నాయన్నారు.  వాటిని సరిదిద్దిన తర్వాతనే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కొందరు ఎస్‌ఓలు, సీఆర్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మీ ఇష్టానుసారంగా పాయింట్లు వేస్తారా? అంటూ సీఆర్టీలు నిలదీశారు. అధికారుల సూచనల మేరకే పాయింట్లు వేశామంటూ ఎస్‌ఓలు చెప్పుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జాయింట్‌ కలెక్టర్‌ సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌  ఆందోళనకారులకు  సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకుండా జరిగిన తప్పిదాలను సరిదిద్దాలంటూ పట్టుబట్టారు.

పీఓ దశరథరామయ్య మాట్లాడుతూ  రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ఆధారంగానే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే ఆధారాలతో సహ ఇవ్వాలని, వాటిని రాష్ట్ర అధికారులకు పంపి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో కొందరు సీఆర్టీలు, ఎస్‌ఓలకు రావాల్సిన పాయింట్లు వేయని వైనంపై ఆధారాలతో జేసీకి చూపించారు. వాటిని పరిగణపలోకి తీసుకుని జాబితాను సరి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యనురాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు వారు అంగీకరించలేదు. తాము పంపిన జాబితా ఆధారంగానే కౌన్సెలింగ్‌ నిర్వహించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక రాష్ట్ర అధికారులు పంపిన పాయింట్ల జాబితా ఆధారంగానే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పీఓ ప్రకటించారు. దీంతో 9 గంటల ఆలస్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో ఎస్‌ఓల కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement