teachers councelling
-
టీచర్ల కౌన్సెలింగ్ నేటితో సమాప్తం!
– చివరిరోజు ఎస్జీటీ తెలుగు 3,301 నుంచి చివరిదాకా – తప్పనిసరి బదిలీ..అయినా గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. బుధవారంతో అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలు పూర్తవవుతాయి. అయితే అప్‌గ్రేడ్ చేసిన పండిట్ పోస్టులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిడంతో వారికి మాత్రం మళ్లీ కౌన్సెలింగ్ ఉంటుంది. ‘నాట్‌ఆప్ట్’ ఆప్షన్లే ఎక్కువ డీఈఓ లక్ష్మీనారాయణ, పరిశీలకులు జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. రెక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఎక్కువమంది టీచర్లు వారికి అనుకూలమైన స్థానాలు రాకపోవడంతో ‘నాట్‌ఆప్ట్’ ఆప్షన్ ఇచ్చారు. రాత్రి 8 గంటలకు కౌన్సెలింగ్ ముగిసింది. బుధవారం సీనియార్టీ జాబితా 3,301 నుంచి చివరి నంబరు దాకా టీచర్లు హాజరుకావాలని డీఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. ఉదయం 7 గంటలకే సైన్స్ సెంటర్‌కు చేరుకోవాలన్నారు. తప్పనిసరి బదిలీ...గైర్హాజరు హిందూపురం మండలం చెక్‌పోస్టుకాలనీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ పోస్టు రేషనలైజేషన్ ప్రభావంతో రద్దయింది. ఇక్కడ పని చేస్తున్న సరోజబాయి (సీనియార్టీ జాబితా సీరియల్ నంబర్ 3,018) తప్పనిసరి బదిలీ కావాలి. కానీ కౌన్సెలింగ్ సమయంలో ఈమె గైర్హాజరయ్యారు. అధికారులు పలుమార్లు అనౌన్స్ చేసినా రాలేదు. దీనిపై డీఈఓ మాట్లాడుతూ, చివరికి మిగిలిపోయిన ఖాళీలకు ఆమెను పంపుతామని ప్రకటించారు. అలాగే క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అనుకూలమైన స్థానం కోసం.... రెండు రోజుల కిందట జరిగిన కౌన్సెలింగ్‌లో సుధాకర్ అనే టీచరు ఉరవకొండ మండలం కోనాపురం ప్రాథమిక పాఠశాల కోరుకున్నాడు. వాస్తవానికి అక్కడ పోస్టు ఖాలీ లేదు. దీంతో సదరు టీచరు డీఈఓ వద్ద రిపోర్ట్ చేసుకున్నారు. అయితే గార్లదిన్నె మెయిన్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సురేఖ (సీరియల్ నంబర్ 2,806) రెక్వెస్ట్ బదిలీలో భాగంగా మంగళవారం జరిగిన కౌన్సెలింగ్‌లో బొమ్మనహాల్ మండలం వెళ్లింది. ఈ స్థానానికి ముందురోజు కోనాపురం వెళ్లి వెనక్కు వచ్చిన టీచరును పంపే ప్రయత్నం చేశారు. దీన్ని కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు అడ్డుకున్నారు. సురేఖ తర్వాత 2,813 సీరియల్ నంబర్లో ఉన్న పెద్దవడుగూరు మండలం రాయాపురం పాఠశాలలో పని చేస్తున్న గుర్రప్ప అనే టీచరు గార్లదిన్నె స్కూల్ కోరుకున్నాడు. అయితే సుధాకర్‌కు కనగానపల్లి మండలం దాదులూరు స్కూల్‌కు బదిలీ చేశారు. రెండు రోజుల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కౌన్సెలింగ్ రచ్చరచ్చ!
– అన్యాయం జరిగిందంటూ అడ్డుకున్న అయ్యవార్లు – పలు అంశాల్లో స్పష్టత కోసం రాష్ట్ర అధికారులకు రాసిన అధికారులు – హిందీ పండిట్ల కౌన్సెలింగ్ నేటికి వాయిదా అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా శనివారం జరిగిన ఎస్జీటీల కౌన్సెలింగ్ రచ్చరచ్చగా మారింది. సీనియార్టీ జాబితాపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సందర్భంలో కౌన్సెలింగ్‌ను జరగకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1–800 వరకు ఎస్జీటీలతో పాటు పండిట్లకు కౌన్సెలింగ్ ఉంటుందని సమాచారం పంపారు. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి సైన్స్ సెంటర్‌కు పండిట్లు, ఎస్జీటీలు వచ్చారు. అయితే తుది సీనియార్టీ జాబితా రాష్ట్ర అధికారుల నుంచి బాగా అలస్యమైంది. ఎట్టకేలకు 12.30 గంటల సమయంలో ఎస్జీటీల తుది సీనియార్టీ జాబితా వచ్చింది. దానిపై కొందరు ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్న సీరియల్ నంబర్‌కు తుది జాబితాలోని నంబరుకు చాలా వ్యత్యాసంగా ఉండటంతో అధికారులతో గొడవకు దిగారు. అనుకూలమైన వారికి వివిధ పాయింట్లు యాడ్ చేయడంతో తాము జాబితాలో వెనక్కు వెళ్లామంటూ వాపోయారు. ధర్మవరం మండలం ఉప్పినేసినపల్లి, వసంతపురం ప్రాథమిక పాఠశాలల్లో నాల్గో కేటగిరీ పాయింట్లులో అందరికీ ఒకేరకంగా కాకుండా ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా నమోదయ్యాయంటూ వాపోయారు. ఈ కేటగిరీ అందరికీ వర్తిస్తుందని మరి పాయింట్లలో ఎందుకు తేడాలున్నాయంటూ నిలదీశారు. అలాగే బుక్కపట్నం మండలం బిట్రగుంటపల్లి, యర్లంపల్లి గ్రామాలు నాల్గో కేటగిరీలో ఉన్నాయని, వీటి మధ్య ఉన్న కొత్తకోటను నాల్గో కేటగిరీలో లేకుండా చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలి తప్ప కౌన్సెలింగ్‌ను అడ్డుకోరాదని ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేదే లేదని డీఈఓ స్పష్టం చేశారు. బీఈడీ కోర్సుకు వెళ్లినా పాయింట్లు నమోదు ఎస్సీ,ఎస్టీ ఎస్జీ టీచర్లకు ఆన్సర్వీస్లోనే బీఈడీ చేసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల పాటు బీఈడీ కోర్సుకెళ్లినా జీతం మంజూరవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతటి బెనిఫిట్‌తో తృప్తి పడని కొందరు ప్రబుద్ధులు బీఈడీ కోర్సు చేసిన కాలంలోనూ విద్యార్థులకు చదువులు చెప్పినట్లు పాయింట్లు వేసేసుకున్నారు. శింగనమల, కూడేరు మండలంలో కొందరు టీచర్లు ఇదేరకంగా పాయింట్లు వేసుకుని కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. తెలుగు పండిట్లకు 3.45 గంటలకు ప్రారంభం మరోవైపు తెలుగు, హిందీ పండిట్ల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమైంది. తుది సీనియార్టీ జాబితా రావడం ఆలస్యమైంది. దీంతో ఉర్దూ, కన్నడ పండిట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తెలుగుకు సంబంధించి 1–300 వరకు కౌన్సెలింగ్ ఉంటుందని తక్కిన వారికి ఆదివారం ఉంటుందని డీఈఓ ప్రకటించారు. హిందీ పండిట్ల కౌన్సెలింగ్‌ను నేటికి వాయిదా వేశారు. వీరితో పాటు ఎస్జీటీలకూ కౌన్సెంగ్ కొనసాగనుంది. -
పాయింట్లపై పేచీ!
– కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న సీఆర్టీలు – సాయంత్రం 6 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం అనంతపురం ఎడ్యుకేషన్ : గతంలో ఎప్పుడూ లేని విధంగా కేజీబీవీ స్పెషలాఫీసర్లు, సీఆర్టీల బదిలీలకు సంబంధించి ప్రతిభ ఆధారిత పాయింట్లు పెట్టడం దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వీరికి రెగ్యులర్ టీచర్లులా పాయింట్లు కేటాయించి బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కేజీబీవీలో పనిచేసే సీఆర్టీలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతకు సంబంధించిన పాయింట్లు రాష్ట్ర అధికారులు కేటాయించారు. బోధన, పిల్లలతో కలుపుగోలుతనం తదితర అంశాలకు సంబంధించి సుమారు 20 పాయింట్లు ఉన్నాయి. వీటిని ఆయా కేజీబీవీ స్పెషలాఫీసర్లే నిర్ణయించాల్సి ఉంది. ఇక్కడే ఎస్ఓలు చక్రం తిప్పారని సీఆర్టీలు ఆరోపిస్తున్నారు. అనుకూలమైన వారికి ఎక్కువ పాయింట్లు వేసుకుని తమకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. ముందుగా ఎస్ఓల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. రాష్ట్ర అధికారులు రూపొందించిన సీనియార్టీ జాబితాలోనూ పాయింట్లు తప్పులతడకగా ఉన్నాయన్నారు. వాటిని సరిదిద్దిన తర్వాతనే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొందరు ఎస్ఓలు, సీఆర్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మీ ఇష్టానుసారంగా పాయింట్లు వేస్తారా? అంటూ సీఆర్టీలు నిలదీశారు. అధికారుల సూచనల మేరకే పాయింట్లు వేశామంటూ ఎస్ఓలు చెప్పుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్ ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకుండా జరిగిన తప్పిదాలను సరిదిద్దాలంటూ పట్టుబట్టారు. పీఓ దశరథరామయ్య మాట్లాడుతూ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే ఆధారాలతో సహ ఇవ్వాలని, వాటిని రాష్ట్ర అధికారులకు పంపి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో కొందరు సీఆర్టీలు, ఎస్ఓలకు రావాల్సిన పాయింట్లు వేయని వైనంపై ఆధారాలతో జేసీకి చూపించారు. వాటిని పరిగణపలోకి తీసుకుని జాబితాను సరి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యనురాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు వారు అంగీకరించలేదు. తాము పంపిన జాబితా ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక రాష్ట్ర అధికారులు పంపిన పాయింట్ల జాబితా ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పీఓ ప్రకటించారు. దీంతో 9 గంటల ఆలస్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో ఎస్ఓల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
పదోన్నతుల్లో పదనిసలు
♦ నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ జాబితా ♦ ఉపాధ్యాయ సంఘాల నిరసన ♦ కౌన్సెలింగ్‌లో డీఈఓతో వాగ్వాదం ♦ సోషల్, తెలుగు, హెచ్ఎం పోస్టుల భర్తీ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన వివిధ కేటగిరీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం రాత్రి డీఈఓ కార్యాలయంలో డీఈఓ అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన కౌన్సెలింగ్‌లో గొడవ జరిగింది. ఉపాధ్యా సంఘాలు, డీఈఓ మధ్య వివాదం నెలకొంది. ఈ నెల 17న సీనియార్టీ జాబితాను అధికారికంగా ప్రకటించారు. కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే సమయంలో కొందరిని సీనియార్టీ జాబితాలోకి చేర్చారు. సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ఏకంగా ఏడుగురిని అప్పటికప్పుడు సీనియార్టీ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితా వెల్లడించిన రోజు తర్వాత వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయినా వారిని చేర్చడం వెనుక ఆంతర్యమేమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. 1983 నుంచి 1994 డీఎస్సీల వరకు 157 మంది పదోన్నతులు తీసుకోలేదని గుర్తించారు. వీరందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. వీరిలో కొందర్ని మాత్రమే సీనియార్టీ జాబితాలో చేర్చి తక్కిన వారిని చేర్చకపోవడాన్ని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, ఆప్టా, ఎస్‌ఎల్‌టీఏ సంఘాల నాయకులు తప్పుబట్టారు. దీనిపై డీఈఓతో వాగ్వాదానికి దిగారు. చివరకు వారు కౌన్సెలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెల్లిపోయారు. రెండుసార్లకు పైగా పదోన్నతులు తిరస్కరించిన ఐదుగురు టీచర్లు గతంలో కోర్టుకు వెళ్లగా అప్పటి డీఈఓ మధుసూదన్‌రావు 154 జీఓ ప్రకారం వారు పదోన్నతులకు అనర్హులని కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఇదే తరహాలో ఉన్న కొన్ని కేసులు ప్రస్తుత కౌన్సెలింగ్‌తో పరిగణపలోకి ఎలా తీసుకుంటారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు (జిల్లా పరిషత్) 6, ఎస్ఏ సోషల్ 9, తెలుగు 3, హిందీ 2, పీడీ 2 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద సోషల్ 23, హెచ్ఎం 3, తెలుగు 3, పీడీ 2, ఫిజికల్సైన్స్ పోస్టును భర్తీ చేశారు.