కౌన్సెలింగ్‌ రచ్చరచ్చ! | goalmal of teachers councelling | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌ రచ్చరచ్చ!

Published Sat, Jul 29 2017 9:34 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కౌన్సెలింగ్‌ రచ్చరచ్చ! - Sakshi

కౌన్సెలింగ్‌ రచ్చరచ్చ!

– అన్యాయం జరిగిందంటూ అడ్డుకున్న అయ్యవార్లు
– పలు అంశాల్లో స్పష్టత కోసం రాష్ట్ర అధికారులకు రాసిన అధికారులు
– హిందీ పండిట్ల కౌన్సెలింగ్‌ నేటికి వాయిదా  


అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా శనివారం జరిగిన ఎస్జీటీల కౌన్సెలింగ్‌ రచ్చరచ్చగా మారింది. సీనియార్టీ జాబితాపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సందర్భంలో కౌన్సెలింగ్‌ను జరగకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1–800 వరకు ఎస్జీటీలతో పాటు పండిట్లకు కౌన్సెలింగ్‌ ఉంటుందని సమాచారం పంపారు. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి సైన్స్‌ సెంటర్‌కు పండిట్లు, ఎస్జీటీలు వచ్చారు. అయితే తుది సీనియార్టీ జాబితా రాష్ట్ర అధికారుల నుంచి బాగా అలస్యమైంది. ఎట్టకేలకు 12.30 గంటల సమయంలో ఎస్జీటీల తుది సీనియార్టీ జాబితా వచ్చింది. దానిపై కొందరు ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు.

తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్న సీరియల్‌ నంబర్‌కు తుది జాబితాలోని నంబరుకు చాలా వ్యత్యాసంగా ఉండటంతో అధికారులతో గొడవకు దిగారు. అనుకూలమైన వారికి వివిధ పాయింట్లు యాడ్‌ చేయడంతో తాము జాబితాలో వెనక్కు వెళ్లామంటూ వాపోయారు. ధర్మవరం మండలం ఉప్పినేసినపల్లి, వసంతపురం ప్రాథమిక పాఠశాలల్లో  నాల్గో కేటగిరీ పాయింట్లులో అందరికీ ఒకేరకంగా కాకుండా ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా నమోదయ్యాయంటూ వాపోయారు. ఈ కేటగిరీ అందరికీ వర్తిస్తుందని మరి పాయింట్లలో ఎందుకు తేడాలున్నాయంటూ నిలదీశారు. అలాగే బుక్కపట్నం మండలం బిట్రగుంటపల్లి, యర్లంపల్లి గ్రామాలు నాల్గో కేటగిరీలో ఉన్నాయని, వీటి మధ్య ఉన్న కొత్తకోటను నాల్గో కేటగిరీలో లేకుండా చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయాలపై డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలి తప్ప కౌన్సెలింగ్‌ను అడ్డుకోరాదని ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేదే లేదని డీఈఓ స్పష్టం చేశారు.

బీఈడీ కోర్సుకు వెళ్లినా పాయింట్లు నమోదు
ఎస్సీ,ఎస్టీ ఎస్జీ టీచర్లకు ఆన్‌సర్వీస్‌లోనే బీఈడీ చేసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల పాటు బీఈడీ కోర్సుకెళ్లినా జీతం మంజూరవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతటి బెనిఫిట్‌తో తృప్తి పడని కొందరు ప్రబుద్ధులు బీఈడీ కోర్సు చేసిన కాలంలోనూ విద్యార్థులకు చదువులు చెప్పినట్లు పాయింట్లు వేసేసుకున్నారు. శింగనమల, కూడేరు మండలంలో కొందరు టీచర్లు ఇదేరకంగా పాయింట్లు వేసుకుని కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

తెలుగు పండిట్లకు 3.45 గంటలకు ప్రారంభం
మరోవైపు తెలుగు, హిందీ పండిట్ల కౌన్సెలింగ్‌ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమైంది. తుది సీనియార్టీ జాబితా రావడం ఆలస్యమైంది. దీంతో ఉర్దూ, కన్నడ పండిట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తెలుగుకు సంబంధించి 1–300 వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని తక్కిన వారికి ఆదివారం ఉంటుందని డీఈఓ ప్రకటించారు. హిందీ పండిట్ల కౌన్సెలింగ్‌ను నేటికి వాయిదా వేశారు. వీరితో పాటు ఎస్జీటీలకూ కౌన్సెంగ్‌ కొనసాగనుంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement